శివసేనతో చంద్రబాబు మంతనాలు…

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి అన్యాయం జరిగిన వైనంపై టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రంగానే స్పందిస్తున్నాడు. పైకి ఏం చెప్పకపోయినా తెర వెనుక చేయాల్సిన పనిని చేస్తున్నారు. ఫలితంగా హైడ్రామా కొనసాగుతోంది. బీజేపీపై విమర్శలు వద్దని చంద్రబాబునాయుడు పైకి చెబుతున్నాడు. కానీ లోలోపల తాను చేయదల్చుకున్న పనిని చేస్తున్నాడు. మేము రాజీనామాలు చేస్తామని ఎంపీలు గట్టిగానే చెబుతున్నారు. మిగతా వారికంటే నరసరావుపేట ఎంపీ రాయపాటి సాంబశివరావు ఒక అడుగు ముందుకేశాడు. నేను లేఖతో సిద్దంగా ఉన్నానని చెబుతున్నాడు. అమరావతిలో జరిగిన టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలోను ఆసక్తికర చర్చ సాగింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని కొందరు ఎంపీలు అన్నారు. ఇంకొందరు విడిగానే పోటీ చేస్తే టీడీపీకి సీట్లు పెరుగుతాయని చెప్పారని తెలుస్తోంది. 
సార్వత్రిక ఎన్నికల సమయం దగ్గర పడటంతో టీడీపీ అధిష్టానం కొత్త వ్యూహంతో వెళుతోంది. అందులో భాగంగానే నాటకీయ పరిణామాలకు తెరలేపింది. బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో చంద్రబాబు కూటమిని ఏర్పాటు చేస్తారనే ప్రచారం సాగుతోంది. శివసేన అధ్యక్షుడు ఉద్దవ్‌ ఠాక్రేతో టీడీపీ అధ్యక్షుడు మంతనాలు చేయడం ఇందులో భాగమేనంటున్నారు. టీడీపీ లీక్ చేయకపోయినా… శివసేన వైపు నుంచి ఈ ఫోన్ సమాచారం బయటకు పొక్కింది. ఠాక్రేకు చంద్రబాబు ఫోన్‌ చేశారని శివసేన పార్టీ అనధికారికంగా తెలిపింది. బీజేపీతో పొత్తు తెంచుకునే ఆలోచన చేస్తున్న చంద్రబాబు జాతీయ స్థాయి నేతలతోను మంతనాలు చేస్తున్నారు. అవసరమైతే మమత బెనర్జీ, నితీష్ కుమార్, శిరోమణి అకాలీదల్ పార్టీలతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడంటున్నారు. టీడీపీ, శివసేనలు రెండూ ఎన్టీఏలో భాగస్వామ పక్షాలే. కాకపోతే బీజేపీకి దూరంగా జరిగింది శివసేన. మరోవైపు టీఆర్ఎస్ దూరంగానే ఉన్నా.. బీజేపీని ఏం అనలేకపోతోంది. 
శివసేనతో చంద్రబాబు టచ్ లో ఉన్నారని తెలియడంతో బీజేపీ పెద్దలు చంద్రబాబును బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది జాతీయ రాజకీయాల్లో హాట్ టాపికైంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*