ఛలో మూవీ రివ్యూ

రేటింగ్ : 3.0/5
నటీనటులు : నాగశౌర్య, రష్మిక మండన్నా, నరేష్, సత్య, వెన్నెల కిషోర్ తదితరులు
నిర్మాత : ఉషా మూల్పురి
దర్శకత్వం : వెంకీ కుడుముల
సంగీతం : మహతి స్వర సాగర్
సినిమాటోగ్రఫీ : సాయి శ్రీరామ్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
బ్యానర్ : ఐరా క్రియేష‌న్స్‌
పరిచయ మాటలు….
ప్రధమ చిత్రం `ఊహ‌లు గుస‌గుస‌లాడే` సినిమాతో క్యూట్ లవర్ బాయ్ గా విజయ ఢంకా మోగించాడు హీరో నాగ‌శౌర్య‌. త‌ర్వాత దిక్కులు చూడ‌కు రామ‌య్యా, జాదూగాడు, క‌ల్యాణ వైభోగ‌మే, ఒక మ‌న‌సు, జో అచ్యుతానంద వంటి విభిన్న కధాంశాలు చేసుకుంటూ వెళుతున్నాడు. కానీ కమర్షియల్ హిట్ అందుకోలేదనే విమర్శ ఉంది. అందుకే ఈ సారి కాస్తంత కమర్షియల్ సినిమా చేసేందుకు సిద్దమై ముందుకు వచ్చాడు. 
ఎట్ట‌కేల‌కు త‌న స్వంత నిర్మాణ సంస్థ ఐరా క్రియేష‌న్స్‌ను స్టార్ట్ చేసిన వెంకీ కుడుముల తన ద‌ర్శ‌క‌త్వంలోనే `ఛలో` సినిమా చేశారు. ల‌వ్ ఎంట‌ర్‌ టైన‌ర్‌గా రూపొందిన ఈ చిత్రం నాగ‌శౌర్య‌కు ఎలాంటి స‌క్సెస్‌ను తెచ్చింది. 
మంచి కథ, కథనం ఉన్నాయి. మహతి స్వర సాగర్ అందించిన పాటలు అదిరిపోతున్నాయి. ఛలో ట్రైలర్ కు మంచి స్పందన వచ్చింది. అందుకే సినిమా రిలీజ్ కు ముందే భారీ బజ్ వచ్చింది. మరో వైపు హీరోయిన్ రష్మికకు వీరాభిమానులున్నారు. మొత్తంగా భారీ అంచనాల మధ్య విడుదలైన ఛలో ఎలా ఉందో చూసేద్దాం అయితే ఛలో….
ఇక కథలోకి వెళ్తే… 
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు సరిహద్దు ప్రాంతం ‘తిరుప్పురం’. తెలుగు, తమిళవారు రెండు వర్గాలుగా విడిపోయి అక్కడ గొడవపడుతుంటారు. తమ పిల్లాడు హ‌రి(నాగ‌శౌర్య‌)కి చిన్న వ‌య‌స్సు నుంచి గొడ‌వ‌లు, కోట్లాట‌లు అంటే చాలా ఇష్టం. అందుకే ఇంటి నుంచి బయటకు పంపితే ప్రశాంతంగా ఉంటాడని త‌ల్లిదండ్రులు నమ్ముతారు. అందుకే హ‌రిని తమిళనాడు సరిహద్దు ప్రాంతం తిరుప్పురంలోని బంధువుల ఇంటికి పంపుతారు. ఊరు మధ్యలో కంచె నిర్మించుకొని హద్దులు పెట్టుకొని మరీ కొట్లాడుకుంటారు. మరోపక్క హరి(నాగశౌర్య)కు గొడవలంటే మహాఇష్టం. అటువంటి వ్యక్తి తిరుప్పురంలోకి ఎంటర్ అవుతాడు. జనాలు కొట్టుకుంటారు గానీ ఎవరూ సరిహ‌ద్దు దాటి వెళ్లే సాహసం చేయరు. అలా దాటి వ‌స్తే సంప్ర‌దాయంగా చంపేసుకుంటారు. 
తిరుప్పురంకు వచ్చిన హరి అక్కడ కాలేజీలో చ‌దువుకున్న హ‌రి కార్తీక‌(ర‌ష్మిక మండ‌న్నా)ను ప్రేమిస్తాడు. కానీ కార్తీక అతన్ని కాదంటోంది. మనం పెళ్లి చేసుకోవాలంటే ఊరి గొడవ తీర్చాలని మెలిక పెడుతోంది. అస‌లే కోట్లాట‌లు, కుమ్మ‌లాట‌లతో చీలిపోయిన తెలుగు- త‌మిళ‌వ‌ర్గం హ‌రి సంగతి తెలిసి మరింతగా రెచ్చిపోతాయి. అత‌న్ని చంపాల‌ని విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తారు. కానీ ఆరెండు ఊళ్ల‌ని క‌లిపేందుకు కార్తీక ప్రయత్నిస్తోంది. అందులో భాగంగానే హరికి ఊరు ఒక్కటిగా కలిస్తేనే తప్ప మన ప్రేమ గెలవదని చెబుతోంది. అయితే కార్తీక తమిలమ్మాయి కావడంతో ఊర్లో ఉన్న గొడవల కారణంగా తమ పెళ్ళికి పెద్దలు ఒప్పుకోరంటోంది. ఇంతలోనే కార్తీకకు ఇంట్లో వారు వేరే అబ్బాయితో పెళ్లి చేయాలనుకుంటారు. హరి ఆ పెళ్లి జరగకుండా ఏం చేశాడు..? తన ప్రేమను గెలిపించుకునేందుకు అతను ఏం చేస్తాడు. మరి తన ప్రేమ కోసం హరి ఊరిని ఒక్కటిగా చేశాడా..? తన ప్రేమను ఎలా గెలిపించుకున్నాడు..? అసలు హరి గెలిచాడా లేదా అనే విష‌యం తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ….
యంగ్ హీరో నాగశౌర్య తనకి సూటయ్యే పాత్రలో బాగా ఒదిగిపోయాడు. చాలా ఈజ్‌తో పాత్రకి పరిపూర్ణ న్యాయం చేశాడు. కొన్ని చోట్ల మాస్ లుక్ తో కనిపించాడు. అయినా సరే అద్భుతంగా నటించాడు. రష్మిక ఒక సాధారణ అమ్మాయిగా అతికినట్టు కుదిరింది. ఆమె లుక్స్ పై సినిమాలో జోక్స్ వేశారు. కానీ తెరపై అందంగానే ఉంది. నటిగాను అందరినీ మెప్పిస్తుంది. ఎమోషనల్ సన్నివేశాల్లో మరింత పరిణితి ప్రదర్శించి ఉండాల్సింది. హీరో తండ్రి పాత్రలో నరేష్ నవ్వుల జల్లు కురిపించాడు. ఇక సత్య, వైవా హర్ష, సుదర్శన్ ల కామెడీ అద్భుతంగా పండింది. అచ్యుత్ కుమార్, రాజేంద్రన్, జి.ఎమ్.కుమార్ వంటి సీనియర్ తమిళ నటులు తమ నటనతో ఆకట్టుకున్నారు. పోసాని కృష్ణమురళీ కనిపించేది ఒక్క సీన్ లోనే అయినా… ఆ పాత్ర మాత్రం మర్చిపోలేము. అంతగా ఆడియన్స్ ను నవ్వించారు. రఘుబాబు కాలేజ్ ప్రిన్సిపల్ గా పర్వాలేదనిపించారు.
సాంకేతికాంశాలు…
సాయి శ్రీరామ్ ఫొటోగ్రఫీ సినిమాకు ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమాలోని ప్రతీ సీన్, ప్రతి షాట్ అందంగా, నాణ్యతకు లోటు లేకుండా చూపించాడు. సాయి ప్రతిభ ప్రతి ఫ్రేమ్ లో కనపడింది. పాటలు ఎంతో అందంగా చిత్రీకరించాడు. సాయి శ్రీరామ్ ఫొటోగ్రఫీ కారణంగా హీరోయిన్ మరింత అందంగా కనిపించిందనే చెప్పాలి. మహతి చేసిన పాటలన్నీ బాగున్నాయి. సినిమా నేపధ్య సంగీతం ఆకట్టుకుంటోంది. ఇక కోటగిరి వెంకటేశ్వరావు ఎడిటింగ్ బాగుంది. సెకండ్ హాఫ్ లో కొన్ని అనవసరమైన సీన్స్ ను తొలగించే అవకాశం ఉండేది. కానీ ఎందుకో ఆ పని చేయలేదనిపిస్తోంది. క్వాలిటీ విషయంలో ఎక్కడా రాజీ పడలేదు. సినిమా చాలా రిచ్ గాను కనిపిస్తోంది. దర్శకుడిగా వెంకీకు ఇది మొదటి సినిమా. ఈ సినిమా చూస్తే అలా అనిపించదు. బాగా అనుభవం ఉన్న వ్యక్తి తీసినట్లు ఉంది. ఫస్ట్ హాఫ్ ను తీసినంత గ్రిప్పింగ్ గా సెకండ్ హాఫ్ ను చూపించలేకపోయాడనే కొద్దిపాటి ఆలోచన వస్తోంది. కానీ వెంకీ కామెడీ డైలాగులు ఆడియన్స్ ను కడుపుబ్బా నవ్విస్తాయి. సరదాగా నవ్వుకునే సన్నివేశాలు, సందర్భాలు చాలానే సినిమాలో ఉన్నాయి. సెకండాఫ్ లో వెన్నెల కిషోర్ కడుపు చెక్కలయ్యేలా నవ్వించాడు. సెకండాఫ్ లో ఎమోషనల్ గానూ దర్శకుడు కంటతడి పెట్టించాడు. దర్శకుడిగా, రచయితగా వెంకీ సూపర్ సక్సెస్ అయ్యాడు. 
కథ ప్రేక్షకుల్ని కనెక్ట్ చేసే విధానం బాగుంది. కథనం రాసుకోవడంలో దర్శకుడి అసలు ప్రతిభ బయటపడుతుంది. ఆ సినిమా కమర్షియల్ గా విజయం సాధించాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పించే స్టైల్ ఉండాలి. అటువంటి అంశాలన్నీ కూడా ఈ సినిమాలో ఉన్నాయి. సినిమాలో చిన్న చిన్న లోపాలు ఉన్నా… వినోదానికి ఏ మాత్రం లోటు లేదు. మొత్తంగా ఈ సినిమా మంచి రిలీఫ్ ఇస్తుంది.
ప్లస్ పాయింట్లు…
+ కథనం… హాస్యం
+ హీరో, హీరోయిన్ పాత్ర‌లు
+ సినిమాటోగ్ర‌ఫీ
+ మాట‌లు, పాట‌లు
+ సంగీతం 
మైనస్ పాయింట్లు…
– బ‌ల‌మైన క‌థ లేక‌పోవ‌డం
– లాజిక్ లేని స‌న్నివేశాలు
మొత్తంగా… సినిమా చూసి కడుపురా నవ్వుకోవచ్చు. హాయిగా చూడవచ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*