ఆ టీడీపీ నేతకు గవర్నర్ గిరీ

ఆ టీడీపీ నేతకు గవర్నర్ గిరీ
తెలుగుదేశం సీనియర్ నేత, కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు రాజకీయ సన్యాసం చేస్తారట. ఏపీ మాజీ ముఖ్యమంత్రి, తమిళనాడు మాజీ గవర్నర్ రోశయ్య ఇప్పటికే పూర్తిగా రాజకీయాల నుంచి వెదొలుగుతున్నట్లు నిన్ననే ప్రకటించారు. ఇప్పుడు అదే మాట చెప్పనున్నాడు కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు. ఈ సంగతి సన్నిహితులకు ఆయన చెప్పారు. ఆ విషయం ఆ నోటా ఈ నోట పడి చంద్రబాబు చెవిన పడింది. ఫలితంగా నిజమా కాదా అని ఆరా తీస్తున్నారు తెలుగు తమ్ముళ్లు. 
విజయనగరం ఎంపీ అశోక్ గజపతిరాజు. జనతా పార్టీతో తన రాజకీయ ప్రస్తానం ప్రారంభించిన అశోక్ గజపతిరాజు చంద్రబాబు కంటే ఎక్కువ సార్లు ఎన్నికల్లో గెలిచారు. ఏడుసార్లు ఎమ్మెల్యేగా.. మరోసారి ఎంపీగా గెలిచిన ఘనత అశోక్ గజపతిరాజుది. ఆయన తండ్రి విజయరామ గజపతిరాజు పార్లమెంటు సభ్యుడిగా ఉన్న వారే. మొత్తంగా 50 ఏళ్ల నుంచి ఆ కుటుంబం రాజకీయాల్లో నడుస్తోంది. ఇప్పుడు ఆయన స్థానంలో కూతురు రాజకీయ రంగంలోకి వస్తుందంటున్నారు. అందుకే అశోక్ గజపతిరాజు రాజకీయ విరమణ పాటిస్తారని తెలుస్తోంది. 
దానికి బదులుగా అశోక్ గజపతిరాజుకు గవర్నర్ గిరీ ఇస్తారని తెలుస్తోంది. ప్రధాని నరేంద్రమోడీ ఆయన విషయంలో సానుకూలంగా ఉన్నారని సమాచారం. ఏదో ఒక రాష్ట్రానికి గవర్నర్ గా పంపిస్తానని మోడీ హామీ ఇచ్చారంటున్నారు. అందుకే ఆయన రాజకీయాల నుంచి తప్పుకునే ఆలోచన చేస్తున్నారట. విజయనగరంలో గజపతిరాజుల కుటుంబానికి మంచి పేరు ఉంది. అందుకే వారి వారసులకు సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. 
తెలంగాణ టీడీపీ సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులకు గవర్నర్ గిరీ వస్తుందని ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నాడు. కలలు కనడంతోనే సరిపోయింది. లేకపోతే ఆయన పార్టీ మారితే తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి పదవి వచ్చేది. కానీ అలా చేయకుండా పార్టీనే అంటి పెట్టుకున్నాడు. ఇక తనకు గవర్నర్ పదవి రాదని నిర్ణయించుకున్నాక.. ఏకంగా టీడీపీ పైనే ఎదురు దాడికి దిగుతున్నాడాయన. పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేయాలని వ్యాఖ్యలు చేస్తున్నాడు. మోత్కుపల్లికి రాకపోయినా అశోక్ గజపతిరాజుకు కచ్చితంగా గవర్నర్ సీటు ఇస్తారని హస్తిన వర్గాలు చెబుతున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*