తెలంగాణ‌లో వేడెక్కుతోన్న రాజకీయం!

మ‌రో ఇర‌వై ఏళ్లు.. కేసీఆరే సీఎం. మాకు ప్ర‌త్య‌ర్థి అంటూ ఎవ‌రూ ఉండ‌రు. ప్ర‌జ‌లు మాకే ప‌ట్టం క‌డ‌తామ‌నుకుంటున్నారు. సాగు మంత్రి హ‌రీష్‌రావు ధీమా. కేసీఆర్ స్మార్ట్ సీఎం ప‌వ‌న్‌క‌ళ్యాణ్ ప్ర‌శంస‌. ఇవ‌న్నీ కేవ‌లం ప్ర‌చార‌పు ఆర్భాట‌మే.. కేసీఆర్ పాల‌న‌పై ప్ర‌జ‌ల్లో వ్య‌తిరేక‌త పెరుగుతోంది. ఖ‌మ్మంలో రైతుల‌పై జ‌రిగిన దాడులు, క‌రీంన‌గ‌ర్ ద‌ళితుల ప్రాణాలు తీసిన ఇసుక లారీలు.. న‌ల్గొండ‌లో జరిగిన మున్సిప‌ల్ చైర్‌ప‌ర్స‌న్ భ‌ర్త శ్రీనివాస్ హ‌త్య వంటి ఘ‌ట‌న‌లతో టీఆర్ ఎస్ ఉనికిని ప్ర‌శ్నార్ధ‌కం చేసుకుంటోందంటూ కోదండ‌రాం మాస్టారు విశ్లేషించారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నుల్లో అవినీతి.. గొర్రెల పంపిణీలో అవ‌క‌త‌వ‌క‌లు.. కులాల వారీగా పంప‌కాలు.. ఇవ‌న్నీ కేసీఆర్ పీఠానికి మెట్లుగా మార‌టం ఎలా వున్నా అధికారం దూరం చేస్తాయ‌నే వాద‌న వినిపిస్తోంది. అన్నింటినీ మించి కేసీఆర్ ఆరోగ్యంపై కూడా ప‌లు పుకార్లు షికారు చేస్తున్నాయి. అందుకే.. తాను వెనుక ఉండి చ‌క్రం తిప్పుతూ.. కుమారుడు కేటీఆర్‌ను సీఎం చేయాల‌నే ఆలోచ‌న ఉంద‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. ఇవ‌న్నీ ప‌క్క‌న‌బెడితే.. టీడీపీ బ‌ల‌హీన ప‌డ‌టం.. మోత్కుప‌ల్లి వంటి సీనియ‌ర్ నేత‌.. పార్టీను టీఆర్ ఎస్‌లో క‌లిపేద్దాం అంటూ చేసిన కామెంట్స్ కూడా రాజ‌కీయాల‌ను ర‌స‌వ‌త్త‌రంగా మార్చాయి. ద‌క్షిణ తెలంగాణ‌లో మూడున్న‌రేళ్లుగా టీఆర్ ఎస్ బ‌ల‌ప‌డేందుకు ప్ర‌య‌త్నించినా ఆశించిన ప్ర‌యోజ‌నం పొంద‌లేక‌పోయింది. ఖ‌మ్మంలో తుమ్మ‌ల పార్టీ మారినంత మాత్ర‌న‌.. ఓట‌ర్లు ఎలా ప్ర‌భావితం అవుతార‌నేది ప్ర‌శ్నార్ధ‌క‌మే. నిజామాబాద్‌, కరీంన‌గ‌ర్‌, మెద‌క్ వంటి జిల్లాల్లో పార్టీ వ్య‌తిరేక ప‌వ‌నాలు. అంత‌ర్గ‌త కుమ్ములాట‌లు.. సీట్ల పంప‌కాల్లో అనుమానాలు ఇవ‌న్నీ పార్టీ నేత‌ల మ‌ధ్య విబేధాలు సృష్టిస్తున్నాయి. కాంగ్రెస్‌, టీడీపీల నుంచి వ‌చ్చిన వారికే ప‌ట్టం క‌డుతున్నారంటూ.. ఇటీవ‌ల సాక్షాత్తూ.. హోం మంత్రి నాయిని న‌ర‌సింహారెడ్డి చేసిన కామెంట్స్ కూడా.. విశ్లేష‌కుల అంచ‌నాల‌పై న‌మ్మ‌కాన్ని పెంచుతున్నాయి.  ఎవ‌రితో పొత్తు లేక‌పోయినా.. తామే నెగ్గుతామంటున్న టీఆర్ ఎస్ ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఎవ‌రో ఒక‌రితో అంట‌కాగాల‌ని భావిస్తోంది. అది జ‌న‌సేన‌, ఎంఐఎం, కాంగ్రెస్‌, బీజేపీ ఎవ‌ర‌నేది మాత్రం ప్ర‌స్తుతానికి స‌స్పెన్స్‌.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*