నరసింహన్ చెబుతుంది నిజమేనా…

గవర్నర్ నరసింహన్ కు తెలుగు రాష్ట్రాల్లో మద్దతు కరువైంది. ఇటు తెలంగాణ, అటు ఆంధ్రప్రదేశ్ లోను వ్యతిరేకత పెరుగుతోంది. కాంగ్రెస్, బీజేపీ, విపక్షాలు ఆయన పై విరుచుకుపడుతున్నాయి. ఫలితంగా తాను ఏం చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితికి వచ్చాడు. అందుకే ఆయన ఇప్పుడు సి.ఎంల జపం చేస్తున్నాడు. తెలంగాణకు వెళితే కేసీఆర్ ను ఆకాశానికెత్తుతున్నాడు. అసలు కలియుగంలో ఇంతకంటే మంచి సి.ఎం దొరుకుతాడా అన్న రీతిలో పొగిడేస్తున్నాడు. కాలేశ్వరం ప్రాజెక్టుకు కేసీఆర్ పేరు పెట్టాలన్నారు. కే అంటే కల్వకుంట్ల కాకుండా కాలేశ్వరం అని పెట్టాలన్నారు. ఫలితంగా టీఆర్ఎస్ ప్రభుత్వం ఆయన్ను బాగా గౌరవించింది. ఆయన కావాలని పొగుడుతున్నారో, లేక వ్యూహాత్మకంగా పొగుడుతున్నారో కాని అసలు ఎవరికీ అర్థం కాలేదు. 
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ ను పొగిడి విపక్షాల నుంచి తీవ్ర విమర్శలకు గురైన నరసింహన్ ఎపికి వెళ్లి అక్కడ అదే పని చేశాడు. విశాఖ జిల్లా పెందుర్తి మండలం సౌభాగ్యపురం గ్రామానికి వెళ్లిన గవర్నర్ నరసింహన్ రాష్ట్రానికి చంద్రబాబు వంటి వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అదృష్టమన్నారు. నిజమే చెప్పాడని తెలుగు తమ్ముళ్లు అంతా భావిస్తున్నారు. చంద్రబాబు పడుతున్న కష్టం, తపన, అభివృద్ధి చేసే విధానం చూసి నరసింహన్ ఈ మాట నిజమే అంటున్నారు. గతంలో ఎప్పుడు గవర్నర్ నరసింహన్ ఇంతలా మాట్లాడలేదు. రాజకీయ నేతలా ఆయన మాట్లాడుతున్న తీరు చూసి విస్తుబోవడం విపక్షాలది కాదు.. అధికార పార్టీలదీ అవుతోంది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అన్ని సౌకర్యాలు కల్పిస్తోందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల కోసం 24 గంటలూ పనిచేస్తుంటారని తెలిపారు. అంతెందుకు చంద్రబాబుకు 24 గంటలు సరిపోవన్నారు. ఇది కాస్త ఎక్కువైంది అంటున్నారు టీడీపీ జనాలు. ప్రజల కోసం ప్రభుత్వం ఎంతో చేస్తోందని, అందరూ కలిసి రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలపాలని కోరడంలో తప్పు లేదు. హఠాత్తుగా ఇంతగా ప్రశంసల వర్షం కురిస్తే అందరికీ అనుమానం కలుగుతోంది. 
గవర్నర్ నరసింహన్ ను మార్చాలని, అతను బ్రోకర్ అని, బఫూన్ అని సిపిఐ నారాయణ లాంటి మాట్లాడారు. కాంగ్రెస్, బీజేపీలు ఆయన్ను తొలగించాల్సిందేనని పట్టుబట్టాయి. మొత్తంగా గవర్నర్ ను మారుస్తారనే చర్చ సాగుతోంది. ఇలాంటి సమయంలో చంద్రులిద్దరినీ పొగడ్తలతో ముంచెత్తడంతో ఏది నిజమో.. ఏది అబద్దమో అర్థం కావడం లేదు.  

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*