భాగమతి మూవీ సమీక్ష

రేటింగ్ : 3/5
నటీ నటులు : అనుష్క శెట్టి, ఉన్ని ముకుందన్‌, జయరామ్‌, ఆశా శరత్‌, మురళీ శర్మ తదితరులు
సంగీతం : తమన్‌.ఎస్‌
దర్శకత్వం : జి. అశోక్‌
నిర్మాత : వంశీ కృష్ణారెడ్డి, ప్రమోద్‌
పరిచయ మాటలు….
లేడీ ఓరియంటేడ్ సినిమాకు పెట్టింది పేరు అనుష్క. అరుంధతి, పంచాక్షరి, రుద్రమదేవి వంటి సినిమాలు అనుష్కలోని నటనా కోణాన్ని వెలుగులోకి తెచ్చాయి. బాహుబలిలోను అద్భుతంగా నటించి మెప్పించింది అందాల తార. హీరోలకు సమానంగా తన పేరు మీదే సినిమాకు ఓపెనింగ్స్ రాబట్టే రేంజ్ కు చేరింది అనుష్క. అందుకే నాలుగేళ్లు ఆగి మరీ ఆమె కోసం సినిమా తీశారు దర్శకుడు అశోక్. బాహుబలి చేస్తున్న సమయంలో ఎక్కువ సినిమాలు చేసేందుకు అవకాశం దక్కకపోవడంతో కొంత గ్యాప్ తీసుకుని అనుష్క భాగమతితో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అరుంధతి తర్వాత అంత మంచి పాత్ర ఉన్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. సంక్రాంతికి వచ్చిన సినిమాలు వరుసగా నిరాశ పరిచాయి. ఫలితంగా ఈ సినిమా పైనా ఆశలు పెట్టుకున్నారు ప్రేక్షకులు. మరి అభిమానులు అనుష్క మీద పెట్టుకున్న ఆశలను నిలబెట్టుకుందా లేదా అనేది చూద్దాం…. 
కథలోకి వెళితే….
కేంద్ర మంత్రి ఈశ్వర్‌ ప్రసాద్‌ (జయరామ్‌). నిజాయితీ రాజకీయాలు చేసే నాయకుడు. మంచి రాజకీయ నేత అయిన అతను మిగతా వారికి ఇబ్బందిగా మారాడు. అందుకే ఈశ్వర్‌ ప్రసాద్‌ ను దెబ్బతీస్తే తమ భవిష్యత్ కు ఇబ్బంది లేదని భావిస్తారు. అందుకే అవినీతి, అక్రమాలు చేస్తున్నాడని నిరూపించే ప్రయత్నం చేస్తారు. అదే సమయంలో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో వరుసగా అరుదైన విగ్రహాల దొంగతనాలు జరుగుతుంటాయి. కేంద్ర ప్రభుత్వానికి అది పెద్ద సమస్యగా మారుతోంది. ఇలాంటి నెపాన్ని ఈశ్వర్ ప్రసాద్(జయరాం)మీదకు తోసేసే ఉద్దేశంతో సీబీఐ ఆఫీసర్ వైష్ణవి నటరాజన్(ఆశా శరత్) ను నియమిస్తారు. ఎసీపీ సంపత్(మురళిశర్మ), తమ్ముడు శక్తి (ఉన్ని ముకుందన్) లు హత్య కేసులో జైల్లో ఉన్న ఐఎఎస్ ఆఫీసర్ చంచల(అనుష్క)ను రహస్యంగా విచారించడం కోసం భాగమతి బంగళాకు తీసుకొస్తారు. అక్కడ అనూహ్య పరిణామాల తర్వాత భాగమతి ఆత్మ ఉందనే విషయం తెలుస్తోంది. 
సీబీఐ జాయింట్‌ డైరెక్టర్‌ వైష్ణవి నటరాజన్‌(ఆశా శరత్)కు ఈ బాధ్యతను అప్పగిస్తారు. తనకు అప్పగించిన పనిని వైష్ణవి వీలున్నంతగా ఈశ్వర్‌ ప్రసాద్ ను ఇరికించే ప్రయత్నం చేస్తోంది. అందుకు ఆయన దగ్గర సెక్రటరీగా పనిచేసిన చంచలా ఐఏఎస్‌ (అనుష్క)ను విచారించే పని చేస్తారు. అప్పటికే తన ప్రియుడ్ని చంపిన కేసులో జైల్లో ఉంటోంది చంచల. అందుకే ఆమెను జనాల మధ్య కాకుండా రహస్యంగా అడవిలో ఉన్న భాగమతి బంగ్లాకు తీసుకెళతారు. అక్కడకు వెళ్లడమే ఆలస్యం చంచలకు పూనకం వస్తోంది. గతంలో తాలూకు స్మృతులు గుర్తుకు వస్తాయి. చంచల చాలా వింతగా ప్రవర్తిస్తుంది. తనను ఎవరో కొడుతున్నారని అరుస్తోంది. విచిత్రమైన భాషలో మాట్లాడుతోంది. విచారణకు వచ్చిన పోలీసులనే భయపెడుతోంది. అరబిక్‌ భాషలోను మాట్లాడుతోంది. చంచల అలా ఎందుకు ప్రవర్తించింది…. మంత్రి ఈశ్వర్‌ ప్రసాద్‌ మీద మచ్చ వేయాలన్న కుట్ర అమలు చేసారా లేదా… అసలు  చంచల తన ప్రియుడ్ని ఎందుకు చంపింది… చంచల ఎలా బయటపడింది..? అసలు భాగమతి ఎవరు, ఎందుకు ఆత్మ రూపంలో అక్కడ ఉంది… విగ్రహాల దొంగలు ఎవరు తదితర ప్రశ్నలకు సమాధానమే ఈ సినిమా. 
నటీనటుల తీరు… 
అనుష్క లేకపోతే ఈ సినిమా లేదు. ఆమె పాత్రనే కీలకం. అనుష్కతో తీయాలనే దర్శకుడు అశోక్ ఈ కథ రాసుకున్నాడేమో అన్న అనుమానం వస్తోంది. అంతగా రెండు పాత్రల్లో పరకాయ ప్రవేశం చేసింది అనుష్క. కలెక్టర్ గా డీసెంట్ రోల్ లో నటించింది. భయపెట్టే ఆహార్యంతో భాగమతిగా ఇరగదీసింది. ఈ పాత్రలలో ఇంకెవరిని ఊహించుకోలేం. అరుంధతి ఛాయలు కొంత కనిపించాయి. ఇప్పటికీ అనుష్క నటనలో పరిణితిని గమనించవచ్చు. విచారణ సీన్స్ లో అనుష్కలోని అమాయకత్వాన్ని చూడవచ్చు. భాగమతిగా మురళీశర్మ టీమ్ని భయపట్టే సీన్స్ అదిరిపోయాయి. కానీ కథనం అప్పుడప్పుడు గజిబిజిగా సాగింది. అయినా సరే అనుష్క నటన హైలెట్ అనే చెప్పాలి. భాగమతిని తీసుకు వచ్చిన బంగళా సరైన ఎంపిక. హర్రర్ సినిమాలకు అనుష్క ఇక నో చెప్పడం బెటర్ అనిపిస్తోంది. ఎంత బాగా నటించినా ఇలాంటివి ఇకపై బోర్ కొడతాయి. హీరో లాంటి పాత్రలో ఉన్ని ముకుందన్ పెద్దగా చేసింది లేదు. అయినా సరే ఆ పాత్రకు అతికినట్లు సరిపోయాడు. సీనియర్ మలయాళ నటుడు జయరాం బాగా నటించాడు. కూల్ గా ప్రతినాయక పాత్రను రక్తికట్టించాడు. 
కొందరు నటులు తెలుగు వారు కాదు. ఫలితంగా వీరు ఎవరు..ఏంటనే అనుమానం వస్తోంది. ఎసిపి గా నటించిన ఆశా శరత్ పెర్ఫార్మన్స్ బాగుంది. మలయాళం నటులను ఇందులోకి దింపారు. మురళి శర్మ అలవాటైన పాత్రలో బాగానే నటించాడు. ఇక ప్రభాస్ శీను, ధన్ రాజ్ లకు ఇలాంటి పాత్రలు మంచి పేరు తెస్తాయి. తమిళ నటుడు తలైవాసల్ విజయ్ బాగానే నటించినా.. తెలుగు నేటివిటీ ఉండదు. 
సాంకేతిక వర్గం… 
ఇక దర్శకుడు అశోక్ ముందుగా బాగానే హోం వర్క్ చేశాడు. స్టోరీథ్రెడ్ లో కీలకమైన మలుపులు కొంత గందరగోళానికి దారి తీస్తాయి. బంగళా సెటప్, ఫ్లాష్ బ్యాక్ లో హీరొయిన్ కి విలన్స్ వల్ల ఏదో అన్యాయం జరిగి ఉంటుంది అని ఊహించేయవచ్చు. మెయిన్ స్టొరీలోకి ఎప్పుడు వెళ్తామా అనిపిస్తోంది. భాగమతి బంగాళాలో జరుగుతున్న పరిణామాలు ప్రేక్షకుడు ఊహించేలా ఉన్నాయి. అశోక్ లాస్ట్ మూవీ చిత్రాంగద ఫ్లాప్ అయింది. అయినా సరే హర్రర్ అనే హ్యంగ్ ఓవర్ నుంచి అశోక్ ఇంకా బయటికి రాలేదు. తన మీద జరిగిన కుట్రకు హీరొయిన్ ఇంత పెద్ద నాటకం ఆడాలా అనే ప్రశ్న తలెత్తుతోంది. విలన్ ఎవరో ఈజీగా గెస్ చేసేలా క్లూ ఇచ్చాడు దర్శకుడు. సీబీఐ, పోలీస్ శాఖను సిల్లీగా వాడుకునేతీరు కాస్త ఆశ్చర్యమే. కథ ఇంత ఫ్లాట్ గా రాసుకుని నిర్మాతలతో సహా అనుష్కని ఒప్పించిన అశోక్ టాలెంట్ ని అభినందించాల్సిందే. 
టెక్నికల్ గా తనలో మంచి దర్శకుడు ఉన్నాడని అశోక్ నిరూపించుకున్నాడు. సంగీత దర్శకుడు తమన్ మరోసారి బ్యాక్ గ్రౌండ్ లో తన ప్రతిభ చూపాడు. బంగళా ఎపిసోడ్స్ అంతగా పండటానికి తమన్ పాత్రే కీలకం. రెండు పాటల్లో మందారా స్వీట్ మెలోడీ కాగా థీమ్ సాంగ్ మాత్రం అంతగా ఆకట్టుకోలేదు. సౌండ్ మిక్సింగ్ బాగా కుదిరింది. ఆర్ మాధీ కెమెరా పనితనం చాలా బాగుంది. రెండు విభిన్న బ్యాక్ డ్రాప్స్ లో సంబంధించిన కలర్ వేరియేషన్ ను మంచిగా సెట్ చేశారు. యూవీ నిర్మాణ విలువలు ఎప్పటిలాగే రాజీ పడలేదు. ఆర్ట్ డిపార్టుమెంటు అడిగిన దాని కంటే ఎక్కువ ఖర్చు పెట్టి క్వాలిటీ చూపించారు. రవీందర్ పనితనం బాగుంది. కోటగిరి ఎడిటింగ్ షార్ప్ గా ఉన్నా లెంగ్త్ ఎక్కువైన ఫీలింగ్ కలుగుతుంది.
ప్లస్ పాయింట్స్…
+ అనుష్క నటన
+ తమన్ సంగీతం 
+ నిర్మాణ విలువలు 
+ మందారా సాంగ్ 
మైనస్ పాయింట్స్… 
– క్లైమాక్స్ 
– కామెడీ లేదు 
– స్క్రీన్ ప్లే 
– కథనంలో గజిబిజీ
మొత్తంగా…
రెగ్యులర్ హారర్ స్టోరీ. అరుంధతి స్థాయిలో ఊహించుకుంటే తీవ్ర నిరాశ తప్పదు. అనుష్క కోసం తప్ప భాగమతి చూడడానికి ఇంకో కారణం ఉండదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*