రాయలసీమ పోరాట వీరుడు పరిటాల రవి

జనవరి24న పరిటాల రవి వర్దంతి
రాయలసీమ విప్లవకారుడు. రాజకీయ నాయకుడు, నక్సలైట్, ఫ్యాక్షనిస్టు, సామాజిక సేవకుడు. మేధావి, దుస్సాహసికుడు, ఒంటెత్తు తత్వమనిషి, ఆదర్శ నాయకుడు, స్వాప్నికుడు, ప్రేమికుడు ఇలా ఎవరికి వారే పరిటాల రవి స్వభావం గురించి చెప్పే మాటలు. ఏళ్లు గడుస్తున్నా.. ఆయన గురించి సీమ ప్రజలు మర్చిపోరు. మర్చి పోలేరు. అంతగా పరిటాల రవితో వారికి బంధం పెనవేసుకుపోయింది. పోకిరి సినిమాలో మహేష్ బాబు కోసం విలన్ ప్రకాష్ రాజ్.. నాజర్ ను ప్రశ్నించిన దృశ్యం నా కళ్ల ముందు కదులుతోంది. నా కొడుకు ఎక్కడున్నాడో చెప్పినా నువ్వు చంపుతావు. చెప్పకపోయినా చంపుతావు. నా చావు నాకు తెలుస్తోంది. ఇవాళ నా డెత్ డే. రేపు నీ డెత్ డే అంటూ నాజర్ పాత్ర చెబుతోంది. ఇందుకు విలన్ పాత్రలో ఉన్న ప్రశాష్ రాజ్ బెస్టాఫ్ లక్ చెబుతాడు. అచ్చం అలా కాకపోయినా చావు గురించి ముందే తెలుసుకుంటాడు పరిటాల రవి. చనిపోయేటప్పుడు అదే మాట చెబుతాడు. చంపడం తప్ప నువ్వేం చేయలేవని సైగ చేస్తూ ప్రాణాలొదిలాడు. ఇప్పటికీ ఆ మాటలే చెబుతారు అక్కడున్న వాళ్లు. 
ఏం జరిగిందంటే….
అది జనవరి 24, 2005. మధ్యాహ్నాం 2.10 నిమిషాలు. అనంతపురంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి బయటకు వచ్చాడు పరిటాల రవీంద్ర. ఇద్దరు గన్ మెన్లు ఉన్నారు. అంతే రవి పై ఒక్కసారిగా బుల్లెట్ల వర్షం కురిసింది. మోకాళ్లలో రెండు, ఛాతిలో రెండు, పక్క టెముకల్లో రెండు. చివరిగా గుండెలో ఒకటి. ఏం జరుగుతుందో ఆలోచించే లోపే ఏడు బుల్లెట్లు. పరిటాల శరీరాన్ని చిద్రం చేశాయి. రక్తం ధారలా కారింది. నన్ను చంపబోతున్నావని తెలుసు. చంపరా పిరికి పందా.. నన్ను చంపుతున్నావు అంతే కదా.. అవే ఆయన ఆఖరి మాటలు. 
పెట్టుబడిదారీ వ్యవస్థను గట్టిగా వ్యతిరేకించిన వాడు పరిటాల రవి. అందుకే అన్న ఎన్టీఆర్ పిలిచి మరీ ఆయనకు టీడీపీకి టిక్కెట్ ఇచ్చారు. చంద్రబాబునాయుడు అదే స్థాయిలో గౌరవించారు. పరిటాల రవి చనిపోయి చాలా కాలమే అయింది. అయినా అనుకూలంగానో.. వ్యతిరేకంగానో ఆయన ప్రజల నోళ్లల్లో నానుతూనే ఉన్నాడు. ఎప్పటికీ అదే పరిస్థితి. రాయలసీమ చరిత్ర ఉన్నంత వరకు పరిటాల రవిని ఎవరూ మర్చిపోలేరు. 
పార్టీలో సాధారణ కార్యకర్తగా అడుగు పెట్టి పార్టీ అధినేత చంద్రబాబునాయుడుకు కుడి భుజంగా మెసిలాడు. విముక్త రాయలసీమ పునర్నిర్మాణంలో ప్రధాన పాత్రవహించాడు. అప్పటి వైఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పోరాటమే చేశాడు పరిటాల రవి. ఆయన తన జీవితమంతా ఫ్యాక్షన్ మీద రాజీ లేని పోరు సాగించాడు. జీవితానికీ మరణానికీ సార్ధకత ఉండాలని తపించిన వ్యక్తి. మార్పు జీవితమంత విశాలమైనది అని చెప్పిన విప్లవకారుడు. ఫ్యాక్షనిజం మానవజాతిని రెండు పరస్పర వ్యతిరేక వర్గాలుగా విభజించే దిశగా వెళితే, నేను సామాన్యులుండే వర్గం తరపునే నిలుస్తానని ప్రకటించిన నేత. పరిటాల రవి జీవితమంతా ఫ్యాక్షన్ సామ్రాజ్యవాద శక్తులతో జరిపిన పోరాటాలమయమే. తన మార్గం అనితర సాధ్యం అనిపించేలా ఉండేది. తెలుగుదేశం పార్టీ విజయానంతరం లభించిన మంత్రి పదవిని వద్దనుకున్నాడు. ఫ్యాక్షన్ ప్రభావిత ప్రాంతాలను విముక్తం చేయాలనుకున్నాడు. 
మనిషి. ఎందుకలా ప్రవర్తించాడు. ఇతనికేం కావాలి. సుఖమైన జీవితాన్ని వొదిలిపెట్టి ఎందుకలా ప్రాణాలకు తెగించి పోరాడాడు. ఒక మనిషిని శృంఖలాలనుంచి విముక్తుడిని చేయటానికి మరో మనిషిపై తుపాకి గురిపెట్టాలా.. అని తన డైరీలో రాసుకున్నాడు పరిటాల రవి. రవి నిబద్దత, రాజకీయ అవగాహన, పీడిత ప్రజలకు స్వేచ్ఛ, స్వాతంత్ర్ర్యాలను అందించాలన్న కాంక్ష ప్రతీ పేజీలోను కనిపిస్తాయి. మార్పు తీసుకురావటానికి పరిటాల రవి ఎంచుకొన్న విధానం హింసాపూరితం కావొచ్చు.  కానీ ఇతని నిజాయితీని శంకించలేము. 
పరిటాల చరిత్రను…
రవి తండ్రి పేరు పరిటాల శ్రీరాములు. పోరాటాల శ్రీరాములుగా ఘనతకెక్కినవాడు. శ్రీరాములు తండ్రి ధర్మవరపు చిన ముత్యాలప్పకి స్వయాన మేనల్లుడు. ఈ చిన ముత్యాలప్ప అనంత సీమలో కమ్యూనిస్ట్ పార్టీకి పునాదులు వేసిన మహనీయుడు. 1952లో శ్రీ రాములు సీరిపి కొట్టాల గ్రామానికి చెందిన రాసినేని పెద నారాయణప్ప చెల్లెలు నారాయణమ్మని వివాహం చేసుకున్నాడు. 1948-51 హయాంలో కమ్యుూనిస్టు కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొన్నాడు. వందల ఎకరాల భూమిని ప్రజలకి పంచడంలో కీలకమైన పాత్ర పోషించిన వ్యక్తి. 1959 సెప్టెంబర్ 4 న రామసుబ్బారెడ్డి అనే భూస్వామి పై దాడి జరిగింది. ఈ దాడిలో రామ సుబ్బారెడ్డితో పాటు… తలారి నరసింహులు చనిపోయారు. తొలిగా తీవ్ర గాయాల పాలైన రామసుబ్బారెడ్డి నాలుగు రోజుల తర్వాత చనిపోయాడు. ఈ హత్యలో పాత్ర ఉందంటూ శ్రీరాములకు 13 ఏళ్ల జైలు శిక్ష పడింది. కానీ 1962లో ఆ కేసును కొట్టేశారు. ఫలితంగా అందరూ విడుదలై బయటకు వచ్చారు. శ్రీ రాములు సోదరుడు గజ్జెలప్పకు శిక్ష పడింది. పరిటాల బయటకు వచ్చాక చైనాయుద్దం జరిగింది. అప్పుడే భారత కమ్యూనిస్టు పార్టీ రెండుగా చీలింది. సిపిఐ నుంచి వేరు పడిన వారు సిపిఎంగా ఏర్పడ్డారు. అప్పుడే నసనకోట పంచాయితీకి సర్పంచిగా పోటీ చేశాడు. కానీ ముత్యాలప్ప అనే వ్యక్తి కొందరు రెడ్డి భూస్వాములతో చేతులు కలిపి ఆ ఎన్నికల్లో గెలుస్తాడు. అదే సమయంలో మద్దుల చెరువుకి చెందిన గంగుల నారాయణ రెడ్డి అతని అనుచరుడు సానె చెన్నారెడ్డిల హవా సాగుతోంది. వారి నుంచి తమను రక్షించాలని శ్రీరాములుని ఆశ్రయించారు స్థానికులు. ఫలితంగా పెనుబోలు గ్రామంలో భూస్వాములకి అడ్డు తగిలారు శ్రీరాములు. 
అది వారిద్దరికీ కంటగింపు అయింది. ఫలితంగా శ్రీ రాములు ప్రధాన శత్రువు అయ్యాడు. అందుకే పొలంలోనే శ్రీరాములను హతమార్చేందుకు పావులు కదుపుతారు. కానీ చాకచక్యంగా తప్పించుకుంటాడు శ్రీరాములు. విప్లవ ఉద్యమాల వైపు ఆకర్షితుడైనా పరిటాల కమ్యూనిస్టు పార్టీలో చేరతాడు. ఫలితంగా అక్కడ వామపక్షాలకు బలమైన పునాదులు ఏర్పడ్డాయి. సామాన్యులు సైతం ఆయుధాలు పట్టి భూస్వాములపై తిరగ బడ్డారు. శ్రీ రాములుని చంపితేనే మనకు మేలని వారు నిర్ణయించుకున్నారు. తొలిగా శ్రీరాములు ప్రధాన అనుచరుడైన వెట్టి ముత్యాలప్పపై దాడి జరిగింది. తప్పించుకున్నాడు. శ్రీ రాములు నేతృత్వం లో భూస్వామి అయిన వెంకట రెడ్డిని ఈడ్చుకుని వచ్చారు. చంపవద్దని వేడుకోవడంతో పాటు శ్రీరాములు కాళ్ల మీద పడి క్షమాపణ అడగడంతో వదిలేసారు .
ఇదే అసలు హత్యకు దారి తీసింది. 1975లో శ్రీరాములు అనుచరుడైన సిద్దప్పని వశ పరచుకుని పెళ్లికి వెళ్లి వస్తున్న బస్సు పై దాడి చేసారు .
ఈ దాడి లో శ్రీ రాములు, అతని తమ్ముడు సుబ్బయ్య, తగర కుంటకి చెందిన రామాంజనేయులు, ఎగువపల్లికి చెందిన లింగన్న చనిపోయారు నారాయణమ్మ ఈ సమయం లో కూడా తెగువ చూపించి వీరిపై తిరగ బడింది.
తండ్రిబాటలోనే కొడుకు
ఈ సమయంలో పరిటాల రవి వయసు కేవలం 17 సంవత్సరాలు. ఆ తర్వాత శ్రీరాములుకి మద్దతుగా నిల్చిన వారిపై విప్లవాల మార్గం చేపట్టిన వారిపై అరాచకాలు పెరిగాయి. ఇదే సమయంలో శ్రీరాములు పెద్ద కొడుకు హరి వచ్చాడు. కొంతకాలం ఉద్యమాన్ని బాగానే నడిపాడు. ఉద్యమ నాయకుడైన సత్యంని అరెస్ట్ చేసి జైల్లో పెడతారు. కానీ హరి వందల మందితో వచ్చి పోలీస్ స్టేషన్ లో చొరబడి చాకచక్యం గా తప్పించేశాడు. హరిని పట్టుకుంటేనే విప్లవం ఆగుతుందని ప్రభుత్వం భావించింది. అందుకే 1982 నవంబర్ 28 న ఎన్ కౌంటర్ చేసిందని చెబుతారు. పోలీసులు, నక్సల్స్ మధ్య కాల్పులు జరిగాయి. ఆ సంఘటనలో హరి చనిపోయాడని రికార్డులు చెబుతున్నాయి. 
1958 ఆగస్ట్ 30న జన్మించాడు పరిటాల రవి. తండ్రి శ్రీరాములు హత్యకి కారణమైన గంగుల నారాయణ రెడ్డి 1983లో గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. పరిటాల రవి చంపాడని కొంతమంది, కాదు పీపుల్స్ వార్ పార్టీ చంపిందని మరికొందరు చెప్పారు. 1983 ఎన్నికల్లో ఎన్టీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. ఆ తర్వాత 1984 లో రవి తన స్వగ్రామానికి వెళ్ళారు. అదే ఏడాది అక్టోబర్ 27న ధర్మవరపు కొండన్న కూతురు సునీతతో రవి పెళ్లి జరిగింది. శ్రీరాములు హత్యతో సంబంధమున్న సిద్దప్ప 1986 లో జైలు నుంచి విడుదలయ్యాడు. కాని అతన్ని పీపుల్స్ వార్ చంపేసింది. పరిటాలనే ఈ హత్యకు కారణమనే చర్చ వచ్చింది. ఫలితంగా రవిని అరెస్ట్ చేసారు. కొంతకాలానికి మళ్లీ స్వగ్రామమైన వెంకటాపురంకి వచ్చి ఫ్యాక్షనిజాన్ని నిర్మూలించాలనుకున్నాడు రవి. ఆ తర్వాత ప్రత్యేక రక్షణ వ్యవస్థని ఏర్పాటు చేసుకున్నాడు. క్రమంగా గట్టి నేతగా ఎదిగాడు. అప్పుడు రాష్ట్రంలో జరిగిన తొలి మండల ఎన్నికల్లో రామగిరికి దళిత కులానికి చెందిన ఓబన్న రవి మద్దతుతో గెలిచాడు. శ్రీ రాములు, హరిల హత్యలతో సంబంధమున్న ఆరోపణలు ఎదుర్కున్న సానె చెన్నారెడ్డి పెనుగొండ నియోజక వర్గంలో కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగాడు. భారీ బందోబస్తుతో ప్రచారానికి వచ్చిన అతన్ని ఆత్మాహుతి దళాన్ని ఉపయోగించి అడ్డుకున్నాడు రవి. ఏడు ఏళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చింది. స్థానిక నేత చెన్నారెడ్డి తిరిగి గెలిచాడు. తాను పదవిలోకి రాగానే తనకి వ్యతిరేకుల సంగతి ఏం చేయాలా అని ఆలోచించాడు. రవి మద్దతు దారులపై పెద్ద ఎత్తున దాడులు చేయించారంటారు. ఫలితంగా చాలా మంది బలైపోయారు. కుంటి మద్ది, ఏడు గుర్రాల పల్లి, గాదిగ గుంటలలో ఎక్కువగా మరణ హోమాలు జరిగాయి. అనేక కుటుంబాలను పల్లెల నుండి తరిమేశారు. కానీ 1991 మే7 న చెన్నారెడ్డిని పీపుల్స్ పార్టీ కాల్చి చంపింది. దాంతో చెన్నారెడ్డి అనుచరులు రవి ఊరికి దగ్గరగా ఉన్న కొత్త గాదిగకుంట పై దాడి చేశారు. ఊరికే నిప్పు పెట్టారు. ఫలితంగా చాలా ఇళ్లు మాడి మసై పోయాయి. వెంకటాపురం నుండి రవి మనుషులు భారీ ఎత్తున వెళ్లి వాళ్ళని తరిమికొట్టారు. 
రాజకీయ చరిత్ర…
మరోవైపు పెనుగొండలో చెన్నారెడ్డి పెద్ద కొడుకు రమణా రెడ్డి ఎమ్మల్యేగా గెలిచాడు. రమణా రెడ్డి తమ్ముడు ఓబుల్ రెడ్డి, ఆయన కుమారులు సూర్య నారాయణ రెడ్డి ( సూరి ), రఘునాధ రెడ్డిలు ఆయనకు అండగా ఉంటూ వచ్చారు. స్థానికంగా వారికి ఎదురొడ్డి నిలిచిన పరిటాల రవి స్థానికులను రక్షించే పనిలో పడ్డాడు. అదే సమయంలో తనను చంపేసేందుకు కుట్ర జరుగుతుందని భావించాడు. అందుకే అప్పటి జిల్లా ఎస్పీ కే.వి రెడ్డి సమక్షంలో పోలీసుల వద్ద 1992లో లొంగిపోయాడు. అప్పటి నుండే రాజకీయాల్లోకి వస్తున్నట్లు ప్రకటించాడు రవి. మాజీ నక్సలైటు ముష్కిన్ షేక్ రవికి సన్నిహితుడు. ఓబుల్ రెడ్డికి వ్యతిరేకంగా పావులు కదిపాడు. ఫలితంగా 1993లో సూరి సోదరులు ముస్కిన్ ను దారుణంగా చంపారనే ప్రచారముంది. ఆ తర్వాత 1993 అక్టోబర్ 24న ప్రత్యర్థులు ప్రణాళిక సిద్దం చేశారు. మరమ్మత్తులకు ఇచ్చిన టీవీలో బాంబు పెట్టి సూరి కుటుంబాన్ని హతమార్చేందుకు సినీపక్కీలో కుట్ర జరిగింది. మద్దెల చెరువు సూరి ఇంటిలో ఇది పేలింది. ఈ ఘటనలో సూరి తల్లి సారమ్మ, తమ్ముడు రఘునాథరెడ్డి, అక్క పద్మలతోపాటు బోయ చంద్రశేఖర్‌, నారయణప్పలు మృతిచెందారు. వారి కుటుంబంలో మిగిలింది సూరి ఒక్కరే. ఫలితంగా రఘునాధ రెడ్డి ( సూరి తమ్ముడు )తో పాటు ఆరు మంది చనిపోయారు. ఇది రవి పనే అని అంతా భావించారు. ఆ తర్వాత 1994 జూన్ 17 న వై.ఎస్ రాజా రెడ్డిని ( వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి )  రవి కలిసాడు. ఇది కాంగ్రెస్ లో పెద్ద గొడవకు దారి తీసింది. వారిద్దరు ఏం మాట్లాడుకున్నారనేది ఇప్పటికీ రహస్యమే. కానీ అదే ఏడాది ఆగస్ట్ 7 న పెనుకొండలో జంట హత్యలు జరిగాయి. రమణా రెడ్డి అనుచరుల్ని చంపారు. మొదటి ముద్దాయిగా రవి ఉండటంతో అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. ఈ లోపు అసెంబ్లీ ఎన్నికలు వచ్చాయి. జైలు నుండే నామినేషన్ కి దాఖలు చేసారు రవి. అత్యధిక మెజారిటీ తో గెలిచారు. ఆ తర్వాత తెలుగు దేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. పరిటాల కార్మిక మంత్రిగా ఎన్నిక అయ్యారు. ఆ తర్వాత హత్య రాజకీయాల్ని పక్కన పెట్టి ఫ్యాక్షన్ కుటుంబాల మద్య రాజీ కుదిర్చి గొడవల్ని తగ్గించే పని చేశాడు పరిటాల రవి. 
1996 లో ఓబులరెడ్డి హత్య జరిగింది. తనతండ్రి జీవితాన్ని సినిమాగా తీద్దామనుకున్న రవి 1997 లో రాములయ్య సినిమా నిర్మాణం చేపట్టారు. ఈ సందర్బంగా హైదరాబాద్ జూబ్లీహిల్స్ కారు బాంబు పేలుడులో మోహన్ బాబుకి బాగా దెబ్బలు తగిలాయి. కాని రవి క్షేమంగా బయట పడ్డాడు. కానీ 26 మంది అమాయకులు చనిపోయారు. ఇది సూరి పనే అని అంతా భావించారు. ఈ కేసు పై విచారించిన కోర్టు యావజ్జీవ శిక్ష వేసింది. 2001 లో రవి కి తీవ్రమైన జ్వరం వచ్చి చాలా రోజుల పాటు మంచాన పడ్డాడు. 2003 లో రాయల కాలం నాటి దేవాలయాన్ని పునరుద్దరించి 2,50,000 మంది జనం సమక్షంలో 550 జంటలకి పెళ్ళిళ్ళు చేశాడు. 2004 ఫిబ్రవరి లోను 1116 పెళ్ళిళ్ళు చేశారు. ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో సూరి భార్య గంగుల భానుమతిని కాంగ్రెస్ అభ్యర్దిగా నిలబెట్టింది. ఆ ఎన్నికల్లో తెలుగు దేశం ఓడి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంది. రవికి ప్రాణ హాని మొదలైంది. ముందు జాగ్రత్తగా తన ప్రధాన అనుచరుడైన చమన్ ( రవి కుడి భుజం ) అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు. రవిపై ఉన్న పాత కేసులని తిరగదోడటం మొదలెంది. ఆసమయంలోనే తనకు ప్రాణ హాని ఉందని ప్రభుత్వానికి పదే పదే చెప్పాడు రవి. గన్ మెన్ ల సంఖ్యను నాలుగు నుంచి రెండు కి తగ్గించేసారు. కానీ ఫలితం లేదు. జైల్లో శిక్ష అనుభవిస్తున్న సూరికి జగన్ కి మధ్య తనపై హత్యా ప్రయత్నానికి సంభాషణ జరిగినట్లుగా చెప్పాడు రవి. కానీ ఇది నిరూపణ కాలేదు. జగన్ రవిపై పరువునష్టం దావా వేసాడు. ఫలితంగా 2004 డిసెంబర్ 23 న పులివెందులలో కోర్టు కి హాజరయ్యాడు. తన ఆరోపణలకి సంబందించిన సాక్ష్యాలు ఉన్నాయని కూడా చెప్పాడు రవి. కానీ ఈ లోపే 2004 సెప్టెంబర్ 7 న ప్రభాకర్ (రవి అనుచరుడు) హత్య జరిగింది. అప్పుడే రవి మానసికంగా అన్నిటికీ సిద్దపడ్డాడు. అదే జరిగింది. పరిటాల రవిని ప్రత్యర్థులు హతమార్చారు. 
సూరి… మొద్దు శీనుల హత్య…
సూరి జైలులో శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే 2005 జనవరి 24వ తేదీన పెనుకొండ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర హత్యకు గురయ్యారు. సూరి బావ కళ్లలో ఆనందం చూసేందుకే తాను ఈ హత్య చేశానని జూలకంటి రంగారెడ్డి అలియాస్‌ మొద్దుశీను ప్రకటించాడు. ఓ టీవీ చానల్ తో ఈ మాట చెప్పడం సంచలనంగా మారింది. దీనిపై విచారణ చేపట్టిన సిబిఐ మద్దెలచెరువు సూరిని ప్రధాన నిందితుడిగా పేర్కొంది. దీంతో ఈ కేసు విచారణ అనంతపురం జిల్లా కోర్టులో జరిగింది. కారుబాంబు కేసుకు సంబంధించి 2009లో సూరికి ప్రభుత్వం క్షమాబిక్ష ప్రసాదించింది. అయితే పరిటాల హత్యకు సంబంధించిన కేసులో ఆయన ప్రధాన నిందితుడిగా ఉండటంతో కొంతకాలం రిమాండులో కొనసాగాల్సి వచ్చింది. 2009 డిసెంబరు 12న కోర్టు ఆయనకు షరతులతో కూడిన బెయిల్‌ను మంజూరు చేసింది. రవి హత్య కేసు నిందితుడు మొద్దు శీను అనంతపురం జిల్లా జైలులోనే హత్యకు గురి అయ్యాడు. 2008 నవంబర్ 9వ తేదీన కారాగారంలోనే ఈ సంఘటన జరిగింది. తాను రామకోటి రాసుకుంటూ ఉండగా మొద్దుశీను తనను ఇబ్బంది పెట్టాడని దాంతో కోపమొచ్చి తాను అతన్ని డంబుల్ తీసుకొని చంపినట్టు చెప్పారు ఓం ప్రకాష్‌ అనే తోటి ఖైదీ. మరోవైపు మద్దెల చెరువు సూరిని భాను కిరణ్ హతమార్చారనే ఆరోపణలు వచ్చాయి. కారులో వెనుక కూర్చున్న భాను కిరణ్ అతన్ని చంపేశారంటారు. పరిటాల రవి హత్యకేసులో కీలకమైన సూరి, రేఖమయ్యలకు బాను కిరణ్ సహకరించాడనే ప్రచారం జరిగింది. రవి హత్యకు ముందు మొద్దు శీను, రేఖమయ్యకు బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు, గన్స్, వాటి రౌండ్లు భానూయే సమకూర్చాడనే వాదన వచ్చింది. తమిళనాడు నుంచి మరో నలుగురిని తీసుకొచ్చారని చెప్పారు. 
పరిటాల కేసులో శిక్ష
మాజీ మంత్రి పరిటాల రవి హత్య కేసులోని నిందితులలో ఎనిమిది మందికి జీవిత ఖైదు విధించింది కోర్టు. మొత్తం పదహారు మందిలో ఎనిమిది మందిని దోషులుగా తేలారు. అందులో నలుగురిపై కేసు కొట్టేసింది. సరైన ఆధారాలు లేనందున పటోళ్ల గోవర్దన్ రెడ్డి, జివి రెడ్డి, ఆనంద కుమార్ రెడ్డి, రామస్వామిలను విడిచి పెట్టింది. మరో నిందితుడు రామ్మోహన్ రెడ్డి అప్రూవర్‌గా మారాడు. ఆయనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసులో మరో ముగ్గురు ప్రధాన నిందితులు  మద్దెలచెర్వు సూరి, మొద్దు శీను, తరగకుండ కొండారెడ్డిలు హత్యకు గురయ్యారు. మిగిలిన ఎనిమిది మందిని దోషులుగా నిర్దారిస్తూ తీర్పు వచ్చిది. వారిలో వడ్డె కొండ, వడ్డె శీను, రేఖమయ్య, నారాయణ రెడ్డి, రంగనాయకులు, పెద్దిరెడ్డి, హన్మంత రెడ్డి, ఓబిరెడ్డి లకు జీవిత ఖైదు విధించింది. పరిటాల రవి హత్య కేసులో 133 మంది సాక్షులను కోర్టు విచారించింది. పరిటాల రవి మన ముందు లేనప్పటికీ  పెనుగొండ, రాప్తాడు ప్రాంతాలు శాంతియుతం కావాలని ఆయన భార్య, మంత్రి సునీత, కుమారుడు పరిటాల శ్రీరామ్ లు తమ వంతుగా కృషి చేస్తున్నారు. వారి కుటుంబంలో మూడో తరం నేత శ్రీరామ్ ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. రవిలా పేరు తెచ్చుకోవాలని… అదే సమయంలో వివాదాలకు దూరంగా ఉండాలని ఆ కుటుంబాల శ్రేయోభిలాషులు కోరుతున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*