పద్మావత్ మూవీ సమీక్ష

రేటింగ్ : 3/5
నటీనటులు : రణవీర్ సింగ్, షాహిద్ కపూర్, దీపికా పదుకొనే తదితరులు
దర్శకత్వం : సంజయ్ లీలా భన్సాలీ
సంగీతం : సంజయ్ లీలా భన్సాలీ
నిర్మాతలు : సంజయ్ లీలా భన్సాలీ, సుధాంశ్ వత్స్, అజిత్ అంధారే
సినిమాటోగ్రఫీ : సుదీప్ ఛటర్జీ
ఎడిటింగ్ : జయంత్ జాదర్, సంజయ్ లీలా భన్సాలీ, అకివ్ అలీ
రచన : సంజయ్ లీలా భన్సాలీ, సంజయ్ కపాడియా
పరిచయ మాటలు….
పద్మావత్. ఈ మధ్య కాలంలో ఇంతగా వివాదస్పదం అయిన చిత్రం మరొకటి లేదు. రాష్ట్రాలకు రాష్ట్రాలే ఆ సినిమా వద్దని చెప్పేశాయి. ఎవరు ఎన్ని మాటలు అన్నా.. ఎన్ని వివాదాలు రేపినా విడుదల ఆపలేదు. సుప్రీంకోర్టు వరకు వెళ్లి మరీ సినిమా విడుదల కోసం పావులు కదిపారు దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ. ఫలితంగా అసలు ఈ మూవీ విడుదలవుతుందా? లేదా? అనే సందేహాం వచ్చింది. భారత్ లో ఈ చిత్రానికి వచ్చినన్ని వివాదాలు మరే సినిమాకు రాలేదు మరి. ఎప్పుడో చరిత్రలో అల్లావుద్దీన్ ఖిల్జీ చిత్తోడ్ రాజు రావల్ రతన్ సింగ్‌ను చంపేస్తే.. ఆయన భార్య ఆత్మాహుతి చేసుకుందని పాఠాల్లో ఉంది. ఈ చరిత్ర నిజామా కాదా తెలియదు. కల్పితం అని కొందరు. కాదు కాదు నిజమే అని మరికొందరు చెప్పారు. ఇలాంటి కథ, కథనాలతో సంజయ్ లీలా భన్సాలీ నిర్మాణ దర్శకత్వంలో రూపొందిన చిత్ర రాజమే ‘పద్మావత్’. 
అడ్డుకునే ప్రయత్నాలు….
సంజ‌య్ లీలా భ‌న్సాలీ తెర‌కెక్కించిన ఈ మూవీ వివాదాల న‌డుమనే షూటింగ్ పూర్తి చేసుకుంది. రెండు సార్లు షూటింగ్ సెట్ లు దగ్దం చేశారు. కోట్లాది రూపాయల మేర ఆస్తి నష్టం జరిగింది. అయినా వెనక్కు తగ్గకుండా సినిమా పూర్తి చేశారు. డిసెంబ‌ర్ 1న రిలీజ్‌ చేద్దామనుకున్నా వాయిదా పడింది. ఆతర్వాత వాయిదా పడింది. చివరకు కోర్టు జోక్యంతో విడుదలైంది. ముందుగానే ప్రివ్యూ వచ్చేసింది. రాజ్‌పుత్ కర్ణిసేన ఈ సినిమాను అడ్డుకునే పని చేస్తోంది. పద్మావ‌తి మూవీని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ)కు పంపారు. రివ్యూకి పంపిన ద‌ర‌ఖాస్తు సరిగా నింపలేదని చాలా రోజులు ఆపారు. సర్టిఫికెట్ ఇవ్వకుండానే దాన్ని తిప్పి పంపారు. అప్లికేష‌న్ పూర్తిగా ఫిల్ చేసి పంపితే అప్పుడు తిరిగి పరిశీలిస్తామని చెప్పారు. అదేమంత పెద్ద విషయం కాదు. కానీ ఇప్పుడు వివాదం నడుస్తుంది కాబట్టి అదే పెద్దది అయింది. 
క‌ర్ణిసేన కార్య‌క‌ర్త‌లు బెదిరింపుల‌కి పాల్ప‌డుతున్నా చిత్ర యూనిట్ విడుదల చేసేసింది. ఈ సినిమాలో ప్రధాన పాత్రధారి హీరోయిన్ దీపిక ముక్కు కోస్తామ‌ని, ఆమె త‌ల తెస్తే రూ.5 కోట్లు ఇస్తామ‌ని హెచ్చరికలు పంపారు. అయినా సరే దీపిక వెనక్కు తగ్గలేదు. ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొంది. సినిమా సెన్సార్ క‌నుక లేట్ అయింది. ప‌ద్మావ‌తి విడుద‌ల రోజున రాజ్ పుత్ కర్ణిసేన అధ్యక్షుడు లోకేంద్ర సింగ్ కల్వీ భారత్ బంద్ కు పిలుపునిచ్చి అనేక ఆందోళనలు రేపినా ఆగలేదు. సినిమా పూర్తయిన తర్వాత విడుదల చేయకూడదని రాజ్‌పుత్ కర్ణిసేనలు ఆందోళనలు చేయడం మచింది కాదని కేంద్ర మంత్రులు, పార్లమెంటు సభ్యులు చెప్పేశారు. కొన్ని రాష్ర్ట ప్రభుత్వాలు పద్మావత్ పై నిషేధం విధించాయి. 
ఏపీలో పెద్దగా అభ్యంతరాలు రాలేదు. కానీ తెలంగాణలో ఆ సినిమాను అడ్డుకుంటామని బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ హెచ్చరించారు. అయినా సరే సెన్సార్ చాలా కట్స్ విధించి సినిమా విడుదలకు అనుమతి ఇచ్చారు. విదేశాల్లో ఇప్పటికే సినిమా విడుదలైంది. తొలిగా పద్మావతిగా ఉన్న పేరు ఇప్పుడు ‘పద్మావత్’గా మార్చారు. ఇంతకు ఈ సినిమా ఎలా ఉందనే విషయాన్ని తెలుసుకోవాలంటే ముందు కథేంటో చూద్దాం…
కథలోకి వెళితే….
మేవాడ్ రాజు రావల్ రతన్ సింగ్(షాహిద్ కపూర్) తన మొదటి భార్యకు ముత్యాలు తేవడానికి సింహళ ( శ్రీలంక) దేశానికి వెళతాడు. ఆ దేశ యువరాణి పద్మావత్(దీపికా పదుకొనే) వేటాటకు వస్తోంది. అదే సమయంలో అనుకోకుండా ఆమె బాణం రతన్ సింగ్‌కు తగులుతోంది. వెంటనే విషయం తెలుసుకున్న ఆమె రతన్‌సింగ్‌ను కాపాడుతుంది. తనకు సాయం చేసిన పద్మావత్ ను తొలి చూపులోనే ప్రేమిస్తాడు రతన్ సింగ్. ఆ తర్వాత పద్మావత్ కోసం ఆమె తండ్రి అనుమతి కోరాడు. చివరకు విహహం చేసుకుని మేవాడ్‌ మహా సామ్రాజ్యానికి మహారాణిని చేస్తాడు. అదే సమయంలో అఫ్ఘనిస్థాన్‌కు చెందిన జలాలుద్ధీన్ ఖిల్జీ ఢిల్లీని ఆక్రమిస్తాడు. ఫలితంగా భారత్ లోని రాజ్యాలన్నీ భయపడతాయి. కానీ తన పెదనాన్న అయిన జలాలుద్ధీన్‌ను అల్లావుద్ధీన్ ఖిల్జీ హతమార్చి ఢిల్లీ సుల్తానుగా అవతరిస్తాడు. అదే సమయంలో ఓ పూజారి దేశద్రోహ శిక్షకు గురవుతాడు. అతనే మేవాడ్ రాజగురువు రాఘవ చింతనుడు. అతని ద్వారా పద్మావత్ అంద చందాలు గురించి తెలుసుకుంటాడు అల్లావుద్ధీన్ ఖిల్జీ. అంతే మేవాడ్‌పై దండెత్తుతాడు. ఆ తర్వాత ఏమైంది… అల్లావుద్ధీన్ పద్మావత్ ను దక్కించుకున్నాడా? లేదా? తన మాన ప్రాణాల కోసం పద్మావత్ పోరాటం ఎలా చేసింది.. వాస్తవం ఏంటనేది తెలుసుకోవాలంటే ఇక సినిమా చూడాల్సిందే..
విశ్లేషణ…. 
సినిమాలను తెరకెక్కించడంలో సంజయ్ లీలా భన్సాలీది ప్రత్యేక శైలి. గతంలో ఆయన తీసిన బాజీరావ్ మస్తానీ చిత్రం చరిత్రను గుర్తుకు తెస్తాయి. తీసే విషయంలో ఎక్కడా రాజీ పడడు. ఎంత రిష్క్ అయినా తీసుకుంటాడు. ఎన్ని వివాదాలు వచ్చినా తట్టుకుంటాడు. ఒక రకంగా చెప్పాలంటే మొండోడు. అంతటి గొప్ప సినిమాలను తెరకెక్కించి ప్రశంసలు అందుకున్న సంజయ్ లీలా భన్సాలీ.. అంతే గొప్పగా ‘పద్మావత్’ను తెరకెక్కించారు. మేవాడ్ కోటలు, రాజపుత్రులు, రాజపుత్ర స్త్రీలు వారి వేషధారణ, వారి నృత్యాలు అన్నింటినీ అద్భుతంగా చూపించాడు. ప్రతి సీన్‌ను చాలా రిచ్‌గా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ చాలా అందంగా గొప్పగా కనపడింది. ఇందులో సంజయ్ లీలా తన మార్కును చూపించారు. ఇక సుదీప్ ఛటర్జీ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రాణం. అరుదైన రాజ ప్రాసాదాలు, ఢిల్లీ కోటలు, యుద్ధ సన్నివేశాలు హైలెట్ అనే చెప్పాలి. ఇలా అన్నింటినీ చక్కగా తెరపై తీసుకువచ్చారు. సంగీతం పర్వాలేదు. కాకపోతే గూమార్ పాట మినహా మరే ట్యూన్ అంతగా ఆకట్టుకునేలా లేదు. సంచిత్ బల్హారా నేపథ్య సంగీతం కొన్ని చోట్ల చాలా బావుంది.. మరికొన్ని చోట్ల సాధాసీదాగా ఉంది. ఇక నటీనటుల విషయానికి వస్తే.. పద్మావత్ గా నటించిన దీపికా పదుకొనే ఆ పాత్రకు తగ్గట్టు హుందాగా నటించింది. రాజ్‌పుత్‌ల ఖడ్గంలో ఎంత శక్తి ఉంటుందో వారి కంకణంలోనూ అంతే శక్తి ఉంటుంది అని దీపిక చెప్పిన డైలాగ్ అద్భుతంగా ఉంది.
మిగతా వారి పాత్రలు…
మహారాణి పాత్రలో దీపికా కొన్ని సన్నివేశాల్లో మరీ పీలాగా అనిపిస్తుంది. కొన్ని కాస్టూమ్స్ ఆమెకు సరిపడలేదు. ఇక అల్లావుద్ధీన్ ఖిల్జీ పాత్రలో రణవీర్ సింగ్ అద్భుతంగా నటించాడు. ప్రతినాయక పాత్రలో మంచి నటనను చూపాడు. షాహిద్ కపూర్ నటన కూడా ఆకట్టుకుంది. అదితిరావ్‌హైదరీ, రజా మురాద్ తమ నటనా ప్రతిభ చూపారు. చారిత్రక కథాంశాలతో తెరకెక్కిన సినిమాలు అనగానే పోరాటాలు, భారీ గ్రాఫిక్స్ హంగులకే ఎక్కువగా ప్రాధాన్యత ఉంటోంది. అలాంటి సినిమాలతో పోలిస్తే పూర్తి భిన్నమైన అనుభూతిని పంచిన చిత్రమిది. సినిమాగా కాకుండా తెరపై నిజజీవితాల్ని చూస్తున్న భావనను ప్రతి ఒక్కరిలో కలిగిస్తుంది. అలనాటి చరిత్రను కళ్లముందు కనపడుతోంది. ఫస్టాఫ్ సాగదీతగా అనిపిస్తుంది. సెకండాఫ్ కూడా అంతే. కొన్ని సార్లు విసుగ్గానే ఉంటుంది. బలమైన కథను మరింతగా తీర్చిదిద్దాలి అనిపిస్తోంది. కానీ సినిమా గొప్పదనం ప్రేక్షకుడిని సీటు నుండి కదలనీయదు. సినిమా నిర్మాణం అద్భుతం. ఈ సినిమాలో పాత్రలు, సన్నివేశాల మధ్య ఎమోషన్స్ ఆశించినంత గొప్పగా ఏం లేవు. వివాదాలతో సినిమాకు కావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. అందుకే సినిమాపై అంచనాలు కూడా మొదలయ్యాయి. అయితే సినిమా చూసిన సగటు ప్రేక్షకుడికి ఈ సినిమాకు ఇంత వివాదం ఎందుకు చేశారా అనే ఆలోచన వస్తోంది. 
ప్లస్ పాయింట్లు….
+ దీపిక నటన
+ సంజయ్ లీలా భన్సాలీ ప్రతిభ
+ నిర్మాణ విలువలు
+ యుద్ద సన్నివేశాలు
+ క్లైమాక్స్…
 మైనస్ పాయింట్లు…
 – భావోద్వేగాలు పెద్దగా లేవు
 – కథలో వేగం లేకపోవడం
 – సెకండాఫ్ బోర్
 – సంగీతం
 మొత్తంగా… రూ.300 కోట్లతో తీసిన సినిమా కోసమే కాదు… చరిత్ర కోసం ఒకసారి చూడాల్సిందే

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*