టీటీడీ ఛైర్మన్ గా రాఘవేంద్రరావు

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ పదవి మంత్రి యనమల వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు ఇస్తారనే ప్రచారం జరిగింది. చివరకు ఆర్ఎస్ ఎస్ రంగంలోకి దిగడంతో సిఎం చంద్రబాబునాయుడు వెనక్కు తగ్గాడంటారు. కారణం ఏదైనా ఆ పదవి ఇప్పుడు సినీ దర్శకుడు రాఘవేంద్రరావుకు ఇస్తారనే వాదన వస్తోంది. తనకు ఆ పదవి ఇవ్వాలని  ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడును దర్శకేంద్రుడు అడిగారని సమాచారం. చంద్రబాబు ఈ విషయంలో ఎటువంటి హామీ ఇవ్వలేదట. కాకపోతే చంద్రబాబు వియ్యంకుడు బాలయ్య బాబు కూడ రాఘవేంద్రరావు వైపు మొగ్గు చూపాడట. కొందరు కాదంటున్నా.. బాలయ్య గట్టిగానే పట్టుబట్టాడు.
వాస్తవంగా దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు మొదటి నుంచి టి.డి.పికి సేవలందిస్తూ వస్తున్నారు. పార్టీ గీతాలు తీయడంలో గానీ.. పలు కార్యక్రమాల సందర్భంలో టీడీపీకి అండదండగా ఉంటున్నారు. పైగా పార్టీకి నమ్మిన బంటు. అందుకే ఆయనకు టీటీడీ బోర్డు సభ్యుని పదవిని ఇచ్చింది. ఇప్పుడు ఆయన్నే ఏకంగా ఛైర్మన్ పదవిలో కూర్చో పెట్టే పని చేయనున్నారట. రాజకీయ నేతలకు కాకుండా బయట వారికి ఆ పదవి ఇవ్వాలనేది చంద్రబాబు ఆలోచనగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఎవరికో ఇచ్చే బదులు రాఘవేంద్రరావుకు ఇస్తే మంచిదంటున్నారు. మురళీమోహన్ గతంలోనే ఆపదవి అడిగినా ఆయన ఎంపీగా ఉన్నాడు కాబట్టి కుదరదని తేల్చాడట. 
దావోస్ పర్యటనకి వెళ్ళే లోగానే చంద్రబాబు ఈ సంగతి తేల్చే అవకాశముందంటున్నారు. బాలయ్య బాబు కోరికతో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేక తికమక పడుతున్నారని వాదన సాగుతోంది. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*