కారు ఢీకొట్టింది ఎమ్మెల్యే కొడుకని వదిలేశారు

విజయవాడలో ఫిరాయింపు ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కుమారుడు సాహుల్ ఖాన్ ను పోలీసులు అదుపులోకి తీసుకొని వదిలేశారు. విజయవాడ పిన్నమనేని పాలిక్లినిక్ రోడ్డులో అతను ప్రయాణిస్తున్న కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఫలితంగా ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారు డ్రైవర్ కృష్ణతేజను ముందుగా అదుపులోకి తీసుకున్న పోలీసులు ఆ తర్వాత ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడని తెలుసుకుని విచారించారు. పోలీసులు ఈ కేసును సీరియస్ గా తీసుకున్నా… రాజకీయ నేతలు లైట్ తీసుకోమని చెప్పారు. ఫలితంగా ఎంత సీరియస్ గా కేసును ముందుకు తీసుకెళదామనుకున్నారో అంతే వేగంగా వదలి పెట్టారనే విమర్శలొస్తున్నాయి. 
నిందితుడు టీడీపీ నేత జలీల్ ఖాన్ కుమారుడు కావడమే ఇందుకు కారణం. అంతే కాదు.. అసలు ఈ ప్రమాదానికి జలీల్ ఖాన్ కుమారుడుకి సంబంధమే లేదన్నారు. మరో కొత్త కథ చేరింది. అసలు గాయపడ్డ వారిని ఆసుపత్రికి చేర్చిందే మరో కారులో వచ్చిన జలీల్ ఖాన్ కుమారుడని చెప్పారు. రోడ్డు ప్రమాదం జరిగితే వెంటనే వచ్చి వారిని ఆసుపత్రికి చేర్చిన ఔదార్యం సాహుల్ ఖాన్ కు ఉందని విజయవాడ డిసిపి గజారావు మీడియాకు తెలపడం మరింత విచిత్రం. 
తప్పు చేసింది తన వాడైనా, మనవాడైనా, పగ వాడైనా చట్టం దృష్టిలో సమానమే. కానీ ఈ విషయంలో టీడీపీ నేత కుమారుడు కావడంతో పోలీసులు కేసును పక్కదారి పట్టించారనే ఆరోపణలున్నాయి. ఇద్దరు తీవ్రగాయాలకు కారణమైన వారిని వదిలి పెట్టడం వల్ల రానున్న కాలంలో ఇలానే నేతల పిల్లలు బరితెగించి తిరిగే అవకాశాన్ని ఇచ్చినట్లు అయింది. గతంలో మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు తనయులు, మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు, బొండా ఉమా కుమారుడు ఇలానే వాహనాన్ని వేగాన్ని మించి డ్రైవ్ చేసి ప్రమాదానికి కారణమయ్యారనే ఆరోపణలున్నాయి. మంత్రి నారాయణ కుమారుడు తప్ప తాగి వాహనం నడుపుతూ ప్రమాదానికి గురై చనిపోయిన సంగతి తెలిసిందే. 
మరోవైపు బాధితులకు అవసరమైన వైద్య సేవల ఖర్చును పెట్టుకునేందుకు ఎమ్మెల్యే కుమారుడు ముందుకు వచ్చాడట. ఏ తప్పు చేయక పోతే ఎందుకు వైద్య ఖర్చులు పెడతారనే చర్చ సాగుతోంది. ఆ కారులో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమారుడు సాహుల్‌ఖాన్‌ ఉన్నారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానీ బుల్లెట్‌ను ఢీకొట్టిన కారులో ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ కుమారుడు సాహుల్‌ఖాన్‌ లేరని పోలీసులు ముందే క్లీన్ చిట్ ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఈ కేసు నిందితుడు కృష్ణతేజ ప్రమాద సమయంలో మద్యం తాగలేదని డీసీపీ స్పష్టం చేయడం అనుమానాలను రేపుతోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*