యాదవ్ వద్దు చౌదరికే :: కుదరదన్న చంద్రబాబు

కీలకమైన ఒక నామినేటెడ్ పదవిని ఎవరికి కట్టబెట్టాలనే విషయంలో ఏపీ ప్రభుత్వంలో చిన్న సంక్షోభం ఏర్పడింది. ఈ సంక్షోభం ప్రమాదకరమైనదేమీ కాదు గానీ.. పార్టీలో అంతర్గతంగా కాకుండా.. రెండు భాగస్వామ్య పక్షాల మద్య ఏర్పడినది కావడంతో.. తేడా వస్తే దీని ప్రభావం విషమించే ప్రమాదం కూడా ఉంటుందని పలువురు అనుకుంటున్నారు. ఏపీలో ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలోని రెండు భాగస్వామ్య పార్టీలు తెదేపా- భాజపా మధ్య వచ్చిన భేదాభిప్రాయాలు చాలా చిన్న అంశానికి సంబంధించినవి. కానీ ఒక పట్టాన తెగడం లేదు.
వివరాల్లోకి వెళితే.. టీటీడీ బోర్డు నియామకం అనే వ్యవహారం చాలా నెలలుగా పెండింగులోనే ఉంది. చదలవాడ కృష్ణమూర్తి నేతృత్వంలోని పాత బోర్డు పదవీకాలం పూర్తయ్యాక ఇప్పటిదాకా కొత్త బోర్డును నియమించలేదు. చంద్రబాబునాయుడు మాత్రం.. యనమల రామకృష్ణుడు ఆబ్లిగేషన్ ను అనుసరించి.. ఆయన వియ్యంకుడు పుట్టా సుధాకర్ యాదవ్ కు ఛైర్మన్ గిరీ కట్టబెట్టాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే గత బోర్డులో సభ్యుడిగా కూడా ఉన్న యాదవ్ పేరును భాజపా-ఆరెస్సెస్ ససేమిరా ఒప్పుకోవడం లేదు. ఆయన మీద క్రైస్తవ సంఘాల సంబంధాల ముద్ర ఉండడం నెగటివ్ అవుతోంది. ఇలాంటి నేపథ్యంలో భాజపా-ఆరెస్సెస్ కలిసి… త్రిపురనేని హనుమాన్ చౌదరి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. ఆయన ను టీటీడీ ఛైర్మన్ చేయడానికి ఆరెస్సెస్ కూడా సుముఖంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆయన తెలుగుదేశానికి కూడా అనుకూలమైన వ్యక్తే అయినప్పటికీ.. ఇంత కీలకమైన నామినేటెడ్ పోస్టును ఆయన కు కట్టబెట్టడానికి మాత్రం చంద్రబాబునాయుడు ఒప్పుకోలేదని తెలుస్తోంది.పుట్టాసుధాకర్ యాదవ్ కు పదవి విషయంలో యనమల ఒత్తిడి బాగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. దేవాదాయ శాఖ తమ పార్టీకి చెందిన పైడికొండ మాణిక్యాల రావు చేతుల్లోనే ఉన్నప్పటికీ.. తమ మాట నెగ్గకపోవడం అనేది భాజపా కాస్త ప్రిస్టీజియస్ గా తీసుకుంటున్నట్లు సమాచారం. ఇలాంటి ప్రతిష్టంభన నడుమ.. టీటీడీ బోర్డు ఏర్పాటు గురించి ఎన్నిసార్లు పత్రికల్లో వార్తలు వచ్చేస్తున్నా జీవో మాత్రం రావడం లేదని అమరావతి వర్గాలు పేర్కొంటున్నాయి. మరి ఈ రెండు భాగస్వామ్య పక్షాల మద్య ప్రతిష్టంభన ఎలా తొలగిపోతుందో.. ఎవరు మెట్టుదిగి.. సంయమనం పాటిస్తారో చూడాలి.

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*