దావోస్ సదస్సుకు నారా లోకేష్

దావోస్ లో జరిగే ప్రతిష్టాత్మక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు ఈసారి ఏపీ ప్రభుత్వం తరఫున ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ హాజరు కాబోతున్నారు. ప్రపంచస్థాయిలో ఉండే రాజకీయ నాయకులు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుకు హాజరు కావడాన్ని చాలా ప్రతిష్టాత్మకమైన విషయంగా భావిస్తుంటారు. సాధారణంగా రాజకీయ నాయకుల్లో సీనియర్లకే ఈ అవకాశం దక్కుతూ ఉంటుంది. ఏపీ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు గతంలో పలుమార్లు దావోస్ సదస్సుకు హాజరయ్యారు. అయితే ఈసారి మాత్రం ఏపీ ప్రభుత్వం తరఫున నారాలోకేష్ వెళ్లనున్నట్లుగా తెలుస్తోంది. స్విట్జర్లాండ్ లోని దావోస్ లో 17, 18 తేదీల్లో రెండు రోజుల పాటూ ఈ సదస్సు జరుగుతుంది. ఈసారి జరగబోయే సదస్సుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా హాజరవుతున్నారు. అలాగే ఈసారి మాత్రం ప్రధాని నరేంద్రమోడీ కూడా హాజరవుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి ఐటీ మంత్రి కేటీఆర్ కు అవకాశం రాగా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఐటీ మంత్రి లోకేష్ వెళుతున్నారు.
కేవలం సదస్సుకు హాజరు కావడం మాత్రమే కాదు.. ‘భవిష్యత్ అవసరాలకు సాంకేతికత ఏరకంగా ఉపయోగబడబోతున్నది’ అనే అంశం మీద నారా లోకేష్ ప్రసంగించే అవకాశం ఉంది. దావోస్ సదస్సులో ఈ సబ్జెక్టు మీద జరిగే సదస్సును ఏపీ ప్రభుత్వమే స్పాన్సర్ చేస్తున్నది. ఏపీ ప్రభుత్వం తరఫున హాజరవుతున్న లోకేష్ ఈ సదస్సులో కీలక ప్రసంగం చేస్తారు.
ఈసారి దావోస్ సదస్సు మీద భారత్ కు చాలా ఆశలే ఉన్నాయి. అటు అమెరికా అధ్యక్షుడు మన ప్రధాని ఇద్దరూ హాజరవుతున్న నేపథ్యంలో.. వీరిద్దరి మధ్య భేటీ జరిగే అవకాశం ఉంటుందని కూడా అంచనా వేస్తున్నారు.
అలాగే ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తల నజర్ ఏపీ మీద పడేలాగా.. నారా లోకేష్ పర్యటన, ప్రసంగం ఉపయోగపడగలవని కూడా అంచనాలు సాగుతున్నాయి. ఐటీ మంత్రిగా లోకేష్ ఇప్పటికే చాలా కొత్త నిర్ణయాలు తీసుకుంటూ ఏపీ ఐటీ రంగాన్ని మున్ముందుకు తీసుకుపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ లోని ఐటీ ప్రగతిని.. భవిష్యత్ లో ఈ రాష్ట్రంలో ఉండబోతున్న విస్తారమైన ఐటీ మరియు పారిశ్రామిక అవకాశాలను సరిగ్గా దావోస్ సదస్సులో ప్రెజంట్ చేయగలిగితే చాలు.. రాష్ట్రానికి మేలు జరుగుతుందని పలువురు ఎదురుచూస్తున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*