రాజీలేదు: కోర్టుకు సై అంటున్న చంద్రబాబు!

కేంద్రంతో సంబంధాల విషయంలో చంద్రబాబు నాయుడు సుదీర్ఘకాలం పాటు చాలా సహనం వహిస్తూ వచ్చారు. కొన్న సందర్భాల్లో సొంత పార్టీకి చెందిన నాయకులు దూకుడుగా విమర్శలు చేసినా కూడా తన వారినే మందలిస్తూ.. మిత్రపక్షంగా ఉన్నందుకు మిత్ర ధర్మం పాటిస్తూ.. సంయమనం పాటించాలని తనవారందరికీ హితబోధ చేస్తూ వచ్చారు. ఇప్పుడు కూడా ఆయన ఆ మాట తప్పడం లేదు. సంయమనం వీడడం లేదు. కాకపోతే.. తన చుట్టూ గిరిగీసుకున్న సంయమనం అనే పరిధిని దాటి వచ్చి కొన్ని మాటలైనా చెప్పకపోతే..  రాష్ట్రానికి చాలా అన్యాయం జరిగిపోతుందని ఆయన గుర్తించినట్లుగా కనిపిస్తోంది. అందుకే శుక్రవారం నాడు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అయిన పిమ్మట చంద్రబాబు పెట్టిన ప్రెస్ మీట్ లో చిన్న తేడా కనిపించింది. కేంద్రం గనుక ఇప్పటికీ న్యాయం చేయకపోతే కోర్టును ఆశ్రయించడం తప్ప తమకు మరో ప్రత్యామ్నాయం కూడా లేదని చంద్రబాబునాయుడు అన్నారు. దీనిని చాలా కీలకమైన కామెంట్ గా పరిగణించాలి.

కొత్త సర్కారులు కొలువు తీరిన తర్వాత.. కేంద్రాన్ని చంద్రబాబునాయుడు ఇప్పటిదాకా పల్లెత్తు మాట అనలేదు. అదే ప్రభుత్వంలో తన పార్టీ వారు కూడా మంత్రులుగా ఉండడం ఒక్కటే అందుకు కారణం కాదు. అనాథలా ఏర్పడిన రాష్ట్రానికి కేంద్రం నుంచి ఎంతో చేయూత అందాల్సి ఉంది. అలాంటప్పుడు వారితో పోరాడి సాధించుకోవాలని అనుకోవడం కంటె.. స్నేహంగా ఉండి సాధించుకోవడమే సులువు అనే అభిప్రాయానికి ఆయన వచ్చినట్లుగా తొలినుంచి వైఖరి కనిపిస్తోంది. అందుకే ప్రత్యేకహోదా విషయంలో మాట తప్పినా, ప్రత్యేక ప్యాకేజీ పేరిట అర్ధరాత్రి దాకా బేరాలు సాగించి.. ఎలాంటి ప్రత్యేకత లేని ఆర్థిక ప్యాకేజీని మంత్రి అరుణ్ జైట్లీ ప్రకటించినా.. ప్రకటించిన ప్యాకేజీ మేరకు ఇన్నినెలలుగా ఒక్కరూపాయి సాయం కూడా ప్రభుత్వానికి అందకపోయినా.. ఆయన మౌనం పాటిస్తూనే వచ్చారు. ఇప్పటికీ కూడా డైరక్టుగా కేంద్ర ప్రభుత్వం మీద ఎటాక్ చేసే మాటల జోలికి ఆయన వెళ్లడం లేదు. కానీ.. సంయమనం అని గిరిగీసుకుని కూర్చునే ధోరణిని మాత్రం వీడారని అనిపిస్తోంది.

రాష్ట్ర విభజన అనేది ఎంతో అశాస్త్రీయంగా జరిగిన కారణంగానే.. ఆంధ్రప్రదేశ్ అనేక రకాల ఆర్థిక నష్టాల్లో కూరుకుపోతున్నదనేది తొలినుంచి చంద్రబాబునాయుడు వాదన. ఇదే విషయాన్ని ఆయన మరింత సోదాహరణంగా తాజా భేటీలో నరేంద్రమోడీకి వివరించారు. ఆ విషయంలో న్యాయం చేయాల్సిందిగా కోరారు. అయితే అది ప్రధాని పరిధిలోని విషయమే అనుకోవడానికి కూడా వీల్లేదు. అందుకే చంద్రబాబునాయుడు ఇప్పటికీ ఏపీకి న్యాయం జరగకపోతే కోర్టును ఆశ్రయించడం తప్ప తమకు వేరే మార్గంలేదని కూడా ప్రెస్ మీట్ లో చెప్పారు. నిజానికి విభజన చట్టంలోని అనేక అంశాలు ఇంకా అమలుకు నోచుకోని కారణంగా కూడా ఏపీ నష్టపోతున్న మాట వాస్తవం. అయితే కేంద్రం ఈ వ్యవహారాన్ని ఒక కొలిక్కి తెచ్చేయడానికి చొరవ చూపించడంలేదనే అసంతృప్తి కూడా చంద్రబాబు మాటల్లో ఉంది. ఫైనల్ ఎటెంప్ట్ గానే కోర్టునైనా ఆశ్రయిస్తాం అనే మాట సీఎం చెప్పారనే భావన పలువురిలో వినిపిస్తోంది. అక్కడిదాకా పరిస్థితిని వెళ్లనివ్వకుండా.. విభజన చట్టం తేల్చే అంశాలను త్వరగా ఒక కొలిక్కి తెచ్చేస్తే కేంద్రానికి కూడా పరువు దక్కుతుందని విశ్లేషకులు అనుకుంటున్నారు. కేంద్రం ఆంద్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేకంగా సాయం చేయాల్సిన అవసరం లేదు. విభజన సమయంలో.. జరిగిన అశాస్త్రీయ పోకడ వల్ల జరిగే నష్టాన్ని భర్తీ చేసేలా దానిని సరిదిద్దినా కూడా చాలు అనే అభిప్రాయం కూడా వినిపిస్తోంది. 

1 Comment

Leave a Reply

Your email address will not be published.


*