ఆ మంత్రి పని చేయడం లేదా…

కేబినెట్‌ విస్తరణ జరిగితే తొలిగా టీడీపీ సీనియ‌ర్ నేత‌, ప్ర‌కాశం జిల్లా ద‌ర్శి ఎమ్మెల్యే, ప‌ర్యావ‌ర‌ణ, అట‌వీ శాఖ మంత్రి శిద్దా రాఘ‌వ‌రావును ముందుగా తప్పిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఆయన పనితీరు పై సి.ఎం చంద్రబాబు అసంతృప్తిగా ఉన్నారంటున్నారు. ఇందుకు నివేదికలు దోహదం చేస్తున్నాయట. పని తీరు సరిగా లేని మంత్రుల్లో ఆయన స్థానం మొదటిగానే ఉందట. అదే సమయంలో ఆయన నియోజ‌క‌వ‌ర్గంలోను వ్య‌తిరేక ప‌వ‌నాలు భారీగానే వీస్తున్నాయి. ఎన్నిక‌ల హామీల అమలులోను ఆయన తీరు సరిగా లేదు. 2014లో ద‌ర్శిలో వైసీపీ త‌ర‌ఫున సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బూచేప‌ల్లి శివ‌ప్ర‌సాద్ రెడ్డిపై టీడీపీ త‌ర‌ఫున శిద్దా విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇరు ప‌క్షాలు హోరా హోరీగా త‌ల‌ప‌డిన ఈఎన్నిక‌ల్లో కేవ‌లం 1200 ఓట్ల తేడాతో శిద్దా రాఘ‌వ‌రావు గెలిచారు. 
త‌న‌కు ఓటేస్తే  వెనుక‌బ‌డ్డ ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తాన‌ని, నిరుద్యోగ యువ‌త‌కు అవ‌కాశం క‌ల్పిస్తాన‌ని చెప్పారు రాఘవరావు. ద‌ర్శిలో తాగునీటి ఎద్ద‌డి ఉన్నా…పట్టించుకోవడం లేదు. ఇంటింటికీ కుళాయి ఇస్తామ‌ని, నీటిని స‌ర‌ఫ‌రా చేస్తామ‌ని చెప్పారు. చేయలేకపోతున్నారు. ఉపాధి కల్పన లేదు. సాగర్ కుడి కాలువుకు మూడేళ్లుగా నీళ్లు లేవు. ఫలితంగా పంటలు సరిగా వేయలేదు. అమరావతికి బదులు దొన‌కొండ‌లో ఇండ‌స్ట్రియ‌ల్ కారిడార్ పెడ‌తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందే హామీ ఇచ్చారు. వంద‌ల కొద్దీ ఫ్యాక్ట‌రీలు వ‌స్తాయ‌ని ఆశ పెట్టారు. ఇంకేముంది యువ‌తకు స్థానికంగా ఉపాధి ల‌భిస్తుంద‌నుకున్నారు. కానీ పేద‌లకు ఇళ్ల ప‌ట్టాలు ఇవ్వలేని పరిస్థితికి వచ్చారు. ఇంటింటికీ కుళాయి ఇస్తామ‌న్న శిద్దా మంత్రిగా ఉండి కూడా ఆ ప‌నిచేయ‌లేక‌పోవ‌డంపై స్థానికంగా ప్ర‌జ‌లు ఆగ్రహాం వ్యక్తం చేస్తున్నారు. ఆర్వో ప్లాంట్లు మాత్రం మంజూరు చేయించాన‌ని, ఇప్పుడున్న ప‌రిస్థితిలో ఇంత‌క‌న్నా చేయ‌లేమ‌ని చేతులు ఎత్తేశారాయన. రోడ్లకు ప్రాధాన్యం సరిగా ఇవ్వలేదు. కొన్ని రోడ్లు వేసి వదిలేస్తున్నారు. ఫలితంగా  శిద్దాకు స్థానికంగా వ్య‌తిరేకత పెరుగుతోంది. 
ఇంట‌ర్నేష‌న‌ల్ డ్రైవింగ్ స్కూల్ ఏర్పాటు ఆచరణకు నోచుకోలేదు. అక్కడ శిలా ఫ‌ల‌కం వేశారు అంతే. ఇక డిగ్రీ, పాలిటెక్నిక్ కాలేజీలు పెడ‌తామ‌ని చెప్పినా హామీ అమలు కాలేదు. ప్ర‌కాశం జిల్లాలో ఆయ‌న వ‌ల్ల ఇటు ప్ర‌భుత్వానికి, అటు పార్టీకి ఉప‌యోగం లేద‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారట. ఆయనస్థానంలో వైకాపా నుంచి జంప్ చేసిన ఎమ్మెల్యే గొట్టిపాటి ర‌వికుమార్‌కు మంత్రి ప‌ద‌వి ఇవ్వాల‌నే ఆలోచన చేస్తున్నారట చంద్రబాబు. అంతే కాదు…శిద్ధాకు అటు పార్టీలోను, ఇటు ప్ర‌భుత్వంలోనూ చివ‌ర‌కు నియోజ‌క‌వ‌ర్గంలోనూ వ్యతిరేకత వస్తోంది. ఇలాంటి స్థితిలో గెలుపు గుర్రాలకే టిక్కెట్ ఇచ్చే చంద్రబాబు ఆయనకు అసలు సీటు ఇస్తారా అనే వాదన సాగుతోంది. ఒకవేళ సీటు ఇచ్చినా గెలుపు క‌ష్ట‌మేన‌ంటున్నారు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*