వైకాపాలో ఆ నలుగురు….

వైఎస్ఆర్ కాంగ్రెస్ లో పార్టీ అధినేత జగన్ తర్వాత.. నలుగురు నేతలు ఇప్పుడు హవా కొనసాగిస్తున్నారు. చాన్స్ దొరికితే చాలు ప్రభుత్వం పై విరుచుకు పడుతున్నారు. ప్రజల్లో తమ పార్టీ ఉనికిని తీసుకెళుతున్నారు. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్ యాదవ్, నగరి ఎమ్మెల్యే రోజా. ఇప్పుడీ నలుగురు ఆ పార్టీలో కీలకమైన నేతలుగా ఉన్నారు.

న్యాయపరంగా చిక్కులు తెచ్చేందుకు ఆర్కే తనదైన వ్యూహంలో వెళుతున్నాడు. తెలుగుదేశం పార్టీని, సీఎం చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేసేందుకు కొడాలి నాని, చంద్రబాబు హామీల వైఫల్యంపై యువతను ఆకట్టుకునేందుకు అనిల్ యాదవ్‌లకు జగన్ అంతర్గతంగా ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది. వీరితో పాటు…పైర్ బ్రాడ్ రోజా జగన్ ఆలోచనలు, పార్టీ విధానాలను జనంలోకి తీసుకెళ్తున్నారు. మహిళా సమస్యలు, డ్వాక్రా రుణమాఫీతో పాటు చంద్రబాబు, లోకేష్‌పై విమర్శలు చేస్తూ అధినేత ఆదేశాలను పాటిస్తున్నారు రోజా.

ఇక అసెంబ్లీ సమావేశాలను వైసీపీ బహిష్కరించడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్యలపై అన్ని ప్రాంతాల్లో పర్యటించి, వాటిపై గళమెత్తాలని జగన్ చెప్పారంటున్నారు. ఈ నలుగురి వల్ల పార్టీకి మైలేజ్‌తోపాటు డ్యామేజ్ అంతే స్థాయిలో అవుతోందని వాదన లేకపోలేదు. బొత్స, ఉమ్మారెడ్డి, అంబటి, ధర్మాన, పార్థసారధి లాంటి వారిని అప్పుడప్పుడు రంగంలోకి దింపుతున్నారు. గతంలో ఒక వెలుగు వెలిగిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కరుణాకర్ రెడ్డిల హవా తగ్గింది. కావాలనే వారి ప్రయార్టీ తగ్గించి మిగతా వారికి ప్రాధాన్యత నిస్తున్నారని తెలుస్తోంది. వైవి సుబ్బారెడ్డి, మేకపాటిలు ఉన్నా..గతంలో ఉన్నంత దూకుడు లేదు. అంతే కాదు..జిల్లాల్లోను నేతలు వీలున్నంత వరకు వ్యూహాత్మకంగానే మీడియా ముందుకు రావడం విమర్శలు చేయడం వంటి పనులు చేస్తున్నారు. ఇక మీదట మరికొందరిని కీలక నేతలుగా పెట్టే ఆలోచన చేస్తున్నారు జగన్. అది ఎంత వరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*