బేషరతుగా నిధులిస్తే మోడీకే మంచిది!

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇవాళ ఉదయం 10.40 గంటలకు ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కాబోతున్నారు. వీరిద్దరి భేటీ మీద ఏపీ ప్రజల్లో మెండుగా ఆశలున్నాయి. వీరి భేటీ పూర్తయ్యేసరికి రాబోయే ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ లో అభివృద్ధి పనుల ముఖచిత్రం ఎలా ఉండబోతున్నదో ఒక క్లారిటీ వచ్చేస్తుందనే ఆశతో ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో ఏపీ పట్ల పూర్తి సానుకూల దృక్పథంతో వ్యవహరించి.. మెండుగా నిధులు ఇస్తే గనుక.. మోడీ సర్కారుకే మేలు జరుగుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. భాజపాకు రాజకీయ ప్రయోజనం కూడా నెరవేరుతుందని అనుకుంటున్నారు.

ఆంధ్రపదేశ్ రాష్ట్రాన్ని మోడీ సర్కారు సవతిబిడ్డలాగా చిన్న చూపు చూస్తున్నదనే అభిప్రాయం రాష్ట్రప్రజల్లో పుష్కలంగా ఉంది. ముందు ఆ అభిప్రాయాన్ని చెరిపేసుకోవడం ఆ పార్టీకి తక్షణావసరం. లేకపోతే.. గత ఎన్నికల్లో నామమాత్రపు సీట్లు సాధించిన భాజపా ఈసారి.. ఎన్నికల్లో డిపాజిట్లు కోల్పోయినా ఆశ్చర్యం లేదు. అప్పటికీ చంద్రబాబు సర్కారు చేస్తున్న ప్రతి సంక్షేమ కార్యక్రమమూ తమ నిధులతో చేపడుతున్నదే అని లోకల్ బీజేపీ నాయకుల పదేపదే టముకు వేసుకుంటూ ఉన్నారు. వచ్చే జనరల్ ఎలక్షన్స్ లో ఏపీలో స్వతంత్రంగా తామే అధికారంలోకి వచ్చేస్థాయి బలాన్ని సంతరించుకుని ఉంటాం అని అవగాహన లేకుండా అజ్ఞానంతో పలికే వారు కొందరైతే.. నెంబర్ టూ పొజిషన్ లో తమ పార్టీనే ఉంటుంది.. ప్రధాన ప్రతిపక్షం స్థాయిని సంపాదించుకుంటాం.. అని పొగరుగా పలికేవాళ్లు కూడా మరికొందరు ఉన్నారు.

రాజకీయ పార్టీగా ఒక రాష్ట్రంలో తమ అస్తిత్వం కొంత ఉన్నతరువాత.. పార్టీగా ఎదగడానికి.. విస్తరించడానికి బలపడడానికి వారు శ్రద్ధ పెట్టడంలో తప్పేమీ లేదు. అయితే అందుకు అనుగుణంగా వారు ఏం పనిచేస్తున్నారన్నదే కీలకం.

అమరావతి రాజధాని నిర్మాణ శంకుస్థాపన మహోత్సవానికి పిలిస్తే.. మోడీ వచ్చి ఏం కానుక తెచ్చారో తలచుకుంటేనే తెలుగు ప్రజల గుండెలు ఇప్పటికీ మండిపోతున్నాయి. అప్పటినుంచి ఇప్పటిదాకా అమరావతికి సంబంధించి గానీ.. ఫలానా ఒక్క రూపాయి ఇవ్వబోతున్నాం అనే మాట ఎత్తకుండా.. ఆయన పాలన సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో శుక్రవారం జరగబోతున్న భేటీని నిజానికి ఆయనే సద్వినియోగం చేసుకోవాలి. పార్టీని దక్షిణాదిలో కూడా విస్తరించుకోవాలనే ఆలోచన మోడీలో ఏ కొంత ఉన్నా.. అందుకే ఆంధ్రప్రదేశ్ సరైన వేదిక అని ఆయన గుర్తించాలి. తెలంగాణలో భాజపా అస్తిత్వం అనేది ఒకప్పటి మాట. ఇప్పుడది పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. ఏపీలో అంతో ఇంతో అవకాశముంది. దానికి తగినట్లుగా ఏపీ ప్రజల ఆదరణను కూడా చూరగొనడం అనేది ప్రభుత్వాధినేతగా ఆయన విధి.

మరి చంద్రబాబుతో భేటీని సద్వినియోగం చేసుకుని.. ఏపీలో భాజపా పునాదుల్ని బలోపేతం చేస్తారో.. లేదా ఈ భేటీని చిన్న చూపు చూడడం ద్వారా.. తమ పతనానికి తామే దిశానిర్దేశం చేసుకుంటారో వేచిచూడాలి

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*