కేసీఆర్ కు షాక్ : గులాబీలో ముసలం!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో.. ప్రత్యేకించి.. తెరాస రాజకీయాల్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాటకు ఎదురు ఉండదని.. ఆయన మనోభీష్టానికి వ్యతిరేకంగా మాట్లాడే దమ్మున్న నాయకుడు ఆ పార్టీలో ఉండరు అని.. అంతా అనుకుంటూ ఉంటారు. నిన్నటిదాకా అది నిజం. కానీ ఇవాళ్టికి పరిస్థితి ఒక్కసారిగా మారిపోయినట్లు కనిపిస్తోంది.. అలాంటి అపోహల్ని పటాపంచలు చేసేస్తూ.. ఇప్పుడు గులాబీదళంలో ధిక్కార స్వరాలు వినిపిస్తున్నాయి. నిన్న సీనియర్ నాయకుడు నాయని నర్సింహారెడ్డి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని.. ఆనాడు తెలంగాణ కోసం ఎలాంటి త్యాగాలు చేయని వారినందరినీ.. ఇవాళ కేసీఆర్ కేబినెట్ లోకి తీసుకున్నారని చేసిన వ్యాఖ్యలు ఏదో యథాలాపంగా వచ్చినవి కాదు. ఇవాళ ఆ వ్యాఖ్యల కొనసాగింపుగా.. ఉద్యోగ సంఘాలనుంచి వచ్చి ఎమ్మెల్యే అయిన శ్రీనివాస గౌడ్ కూడా.. అంతకంటె సీరియస్ రేంజిలో కేసీఆర్ కేబినెట్ కూర్పుపై విమర్శలు గుప్పించారు. ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టడానిన తలచుకుంటే కళ్లల్లో నీళ్లు వస్తాయంటూ ఆయన ఆవేదనను పంచుకున్నారు. తెలంగాణ పోరాటంలో ఉద్యోగులు ఎన్నో త్యాగాలు చేశారని కూడా ఆయన సెలవిచ్చారు.

శ్రీనివాస గౌడ్ ఇంత స్థాయిలో కేసీఆర్ మీద ధిక్కారస్వరం వినిపించడానికి ఒక హేతువు కూడా ఉంది. పైకి మాత్రం ఆయన .. కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనుక ఒక బలమైన కారణం ఉండే ఉంటుంది అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు గానీ.. ఆయన చేసిన విమర్శలన్నీ సూటిగా కేసీఆర్ కు ఝలక్ ఇచ్చేవే. విషయం ఏంటంటే.. ఉద్యోగం తర్వాత… శ్రీనివాస గౌడ్ కు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు.. ఆయనను తాను మంత్రిని చేయబోతున్నాను అని.. మీరంతా మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని సభాముఖంగా మాట ఇచ్చారు. తెరాస గెలిచిన తర్వాత.. తొలి కేబినెట్ ఏర్పాటు సమయం నుంచి శ్రీనివాస గౌడ్ తనకు పదవి దక్కాలని విపరీతంగా ఆశ పడుతున్నారు. అయితే భిన్న కాంబినేషన్లను ప్రాధాన్యక్రమంలోకి తీసుకోవడంలో భాగంగా.. కేసీఆర్ ఆయనకు మాత్రం అవకాశం కల్పించలేదు. అదేమాదిరిగా.. మరో ఉద్యోగుల నాయకుడు స్వామిగౌడ్ కు కూడా కేబినెట్ మాట్ ఇచ్చారు గానీ.. కనీసం మండలి ఛైర్మన్ చేసి గౌరవప్రదమైన కుర్చీలో కూర్చోబెట్టారు. శ్రీనివాసగౌడ్ పరిస్థితి ఎటూ కాకుండా పోయింది. ఇన్నాళ్లుగా లోలోన రగులుతున్న అసంతృప్తిని ఆయన బయటకు తీసినట్లుంది. ఇప్పుడిలా నాయని విమర్శలకు తోడుగా.. ధ్వజమెత్తుతున్నారు.

మొత్తానికి గులాబీ పార్టీలో పెద్ద ముసలమే పుట్టింది. దీనిని తక్షణమే సెట్ చేసుకోకపోతే గనుక.. కేసీఆర్ కు వచ్చే ఎన్నికల సమయానికి పరిస్థితులు క్లిష్టంగా మారినా ఆశ్చర్యం లేదు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*