మంత్రి దేవినేని పై కేసు నమోదు

ఏపీ భారీ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమా మహేశ్వరరావు, ఆయన అనుచరుల పై కేసు నమోదైంది. దేవినేని నుంచి ప్రాణహాని  ఉందని, రక్షణ కావాలని హైదరాబాద్ యూసఫ్‌గూడలో ఉంటున్న అట్లూరి ప్రవిజ, ఆమె భర్త జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అట్లూరి ప్రవిజ అనే యువతి గతంలో విజయవాడలో నివాసం ఉంది. ఓ భూమి వివాదం కేసులో లోకాయుక్తలో కేసు వేసింది. అమరావతి సమీపంలోని కంచికచర్ల మండలం చౌటుకల్లు గ్రామంలో ఆమెకు రెండెకరాల స్థలం ఉంది. ఈ భూమి పంపకాల విషయంలో మంత్రి దేవినేని తమ్ముడు దేవినేని చంద్రశేఖర్, చవలం శ్రీనివాసరావు, మన్నె నాయుడు, మంత్రి పీఏ చౌదరి, మరో పీఏ శివరావు, గన్‌మన్‌ ప్రసాద్, ఆయన క్లాస్‌మేట్‌ ఎనిగళ్ల రాజేంద్రప్రసాద్, సొసైటీ ప్రెసిడెంట్‌ కోగంటి విష్ణువర్ధన్‌రావు వేధిస్తున్నారని బాధితురాలు ఆరోపించింది. ‘వీరిపై గతేడాది జూన్‌ 21న విజయవాడ సీపీ సవాంగ్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి దేవినేనితో పాటు ఆయన సోదరుడిపై విజయవాడ సూర్యారావుపేట పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.

అమరావతి రాజధానిలో ఉన్న ఆ భూమిని తమకు విక్రయించాలని మంత్రి దేవినేని అనుచరులు ఇబ్బంది పెడుతున్నారనేది ఆమె ఆరోపణ. తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని ఆమెపోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతే కాదు..వారు గతం నుంచి తమను బెదిరిస్తున్నారని చెప్పారు.  విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి యూసుఫ్‌గూడలో ఉంటోంది. గుర్తు తెలియని వ్యక్తులు తమ ఇంటికి వస్తున్నారని, మంత్రికి అక్కడి పోలీసులు సహకరిస్తున్నారని తన ఫిర్యాదులో వివరించింది. ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటుందని, కేసును వెనక్కి తీసుకోవాలని నాపై మంత్రి కార్యాలయంతో పాటు పోలీసులు ఒత్తిడి చేస్తున్నారని వివరించింది.

పోలీసుల వ్యవహార శైలిపై ఆయువతి  గతేడాది సెప్టెంబర్‌ 19న మానవ హక్కుల కమిషన్‌ (హెచ్‌ఆర్సీ)లో ఫిర్యాదు చేసింది. ఫలితంగా ఏపీ డీజీపీకి హెచ్‌ఆర్సీ నోటీసులు ఇచ్చింది. కొందరు పోలీసులు విజయవాడలోని ప్రవిజ ఇంటికెళ్లి ఆరా తీశారు. 2015 నవంబర్‌లోనే ప్రవిజను పోలీసులు కిడ్నాప్ చేసి బెదిరించారనే ఆరోపణలు ఉన్నాయి. పటమట సీఐ దామోదర్‌ ఆమెను కిడ్నాప్‌ చేసి గొల్లపూడిలోని మంత్రి ఇంటికి తీసుకెళ్లారనే ప్రచారం ఉంది. ఈ కేసు నడుస్తున్న సమయంలో రక్షణ ఇవ్వలేమని, హైదరాబాద్‌లో ఏమైనా ఇబ్బంది ఉంటే 100 నెంబర్‌కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని బంజారాహిల్స్ పోలీసులు చెప్పారు.

ఏపీ పోలీసు ఉన్నాతాధికారి ఒకరు…బంజారాహిల్స్ పోలీసులకు ఫోన్ చేసి కేసు వివరాలు కనుక్కున్నారు. దాని పై పెద్దగా ఒత్తిడి చేయవద్దని..చెప్పినట్లు తెలుస్తోంది. తప్పు చేసింది మంత్రి అయినా…టీడీపీ నేత అయినా మరొకరుకు అయినా పోలీసులు బాధితుల పక్షాన నిలవాల్సిన అవసరముంది. లేకపోతే వారి ప్రతిష్ట మసక బారే అవకాశముంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*