మోడీ, సోనియాలే ఆ మంత్రి టార్గెట్

తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి కొత్త పంథాలోకి వెళుతున్నాడు. ప్రాంతీయ నేతలను విమర్శిస్తే కుదరదనుకున్నాడు. అందుకే అతను ఏకంగా అటు ప్రధాని మోడీ, ఇటు కాంగ్రెస్ నేత సోనియాగాంధీ పై విరుచుకుపడ్డాడు. కేసీఆర్ ఉచిత విద్యుత్ పై కాంగ్రెస్, బీజేపీలు విమర్శిస్తున్న సంగతి తెలిసిందే. ద‌మ్ముంటే ఈ విషయం పై  బ‌హిరంగ చ‌ర్చ‌కు రావాల‌ని డిమాండ్ చేశారు ఆపార్టీ నేతలు. దీనికి విద్యుత్ మంత్రి జ‌గ‌దీశ్ రెడ్డి ఘాటుగానే స్పందించారు. రాష్ట్రంలో రైతులకు ఉచిత విద్యుత్ సరఫరా చేస్తుంటే కాంగ్రెస్, బీజేపీ నాయకులు అవాకులు, చవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. తెలంగాణను అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దే క్రమంలో సీఎం కేసీఆర్, టీఆర్ ఎస్ ప్రభుత్వం క‌ష్టపడి పనిచేస్తుందని చెప్పారు. అంత వరకు బాగానే ఉంది. ఇందులోకి దేశ నాయకులను లాగితే తన పరపతి పెరుగుతుందనుకున్నాడు. అంతే మోడీ, సోనియాగాంధీలను వివాదంలోకి లాగేశాడు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన సొంత రాష్ట్రమైన గుజరాత్ లో ఉచిత విద్యుత్ ఇస్తున్నారా అని అడిగేశారు. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియాగాంధీ సొంత నియోజకవర్గంలో సగం ప్రాంతానికి కరెంటే లేదు. ఈ విషయాలపై ఆయా పార్టీల నేతలు మాట్లాడాలన్నారు. ఊరికే సొల్లు కబుర్లు మాట్లాడుతున్నారు అని జగదీశ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్షాకాలం నుంచి రైతులకు వ్యవసాయ పెట్టుబడుల నిమిత్తం ప్రభుత్వం ప్రకటించిన ఎకరాకు రూ.4వేల పథకాన్ని ప్రారంభించనున్నట్లు చెప్పారు.

ఎన్నికలకు ముందు రైతులను ఆకట్టుకునేందుకు సి.ఎం కేసీఆర్ మంచి ఆలోచనే చేశారు. ప్రతి రైతుకు వారి ఖాతాలో డబ్బులు ఇవ్వడం గానీ..లేక చెక్ లు ఇచ్చే ఆలోచన చేస్తున్నారు. రాష్ట్రంలో 23లక్షల వ్యవసాయ మోటార్లకు ఉచిత విద్యుత్ ను సరఫరా చేస్తోంది కేసీఆర్ సర్కార్. ఇది బాగానే ఉంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే పునాదులు వేసిన విద్యుత్ ప్రాజెక్టులు ఇప్పుడు ఫలితాలను ఇస్తోంది. అందుకే కేసీఆర్ విద్యుత్ ను ఇవ్వగలుగుతున్నాడు.అదే సమయంలో కేంద్రం వారికి సహకరిస్తోంది. దాన్ని మర్చిపోయి తాము ఏదో సాధించినట్లు చెప్పుకోవడంతో కాంగ్రెస్, బీజేపీలు మండిపడ్డాయి. ఇప్పుడు మంత్రికి మరోసారి కౌంటర్ ఇచ్చే ఆలోచన చేస్తున్నాయి ఆయా పార్టీలు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*