వామ్మో…మాణిక్యాలరావు ఇంతగా మాట్లాడతారా…

ఉండి ఉండి ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యారు మంత్రి మాణిక్యాలరావు. ఇంతకాలం అవమానాలు భరిస్తు వచ్చాను. ఇక మీదట ఆ పరిస్థితి లేదనే రీతిలో ఆయన మాట్లాడిన తీరు ఆశ్చర్యమేస్తోంది. బీజెపి నేత మాణిక్యాలరావు చాలా రోజుల తర్వాత భగ్గుమన్నారు. గతంలో అధికారులు తనను పట్టించుకోవడం లేదని ఆవేదన, ఆక్రోశం వెల్లగక్కారు. ఈ సారి అంతకు మించి ప్రత్యర్థులకు హెచ్చరికలు చేయడం హాట్ టాపికైంది. పశ్చిమగోదావరి జిల్లా పరిషత్ చైర్మన్ ముళ్లపూడి బాపిరాజు వర్గానికి  మంత్రికి మధ్య గొడవలున్నాయి. మరోవైపు మంత్రిని ముళ్లపూడి వర్గం అసలు పట్టించుకోదు. అందుకే మంత్రి జన్మభూమి సభలో నిప్పులు చెరిగారు మంత్రి. ఈ రాష్ట్రంలో నిరంతరం ముఖ్యమంత్రి పక్కన కూర్చొనే వ్యక్తిని. నాకు.. నా ఊరికి.. నా నియోజకవర్గానికి వచ్చే నిధుల్ని.. నా ద్వారా చేసే పనులను నువ్వు ఆపడానికి ప్రయత్నిస్తే నేను మగాడినో.. కాదో తేల్చుకుంటా’ అని బాపిరాజు ను ఉద్దేశించి ఆయన అన్నారు.

‘మూడున్నరేళ్లలో రామన్నగూడెంలో ఏ ప్రారంభోత్సవానికైనా నన్ను పిలిచారా? ఎందుకీ శత్రుత్వ ధోరణి? నేను వైసీపీ నుంచి వచ్చానా? ఊళ్లో ఏదైనా రోడ్డు వేసి.. నా రోడ్డుపై నడవద్దంటే ఎదుటివాడు వచ్చి తంతాడు. ఎవరెవరికైనా ఓటు వేసుకోవచ్చు..’ అంటూ మధ్యలో మంత్రి తిట్ల దండకం అందుకున్నారు. ఎవరినో వదిలేయండి. నన్నే అంటరానివాడిగా చూసే దౌర్భాగ్య పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉందన్నారు. అంటరానితనం గురించి కథల్లో చదివాను. నా నియోజకవర్గంలో నన్ను అంటరానివాడిగా చూస్తున్నారని ఆయన చేసిన కామెంట్లు టీడీపీ, బీజేపీలోనే కాదు..తెలుగు రాష్ట్రాల్లోను చర్చనీయాంశమైంది.

తనను నిలదీసే పరిస్థితి వస్తే ప్రభుత్వాన్నే నిలదీస్తా. నన్ను కట్‌ చేయాలని ప్రయత్నం చేస్తే ఆంధ్రప్రదేశ్‌ను కూడా కట్‌ చేస్తా.. చాలా స్పష్టంగా చెబుతున్నా, సహనానికి హద్దులు ఉంటాయి అని మాణిక్యాలరావు హెచ్చిరిస్తూ మాట్లాడటం తీవ్ర కలకలం రేపుతోంది

దమ్ముంటే రాజీనామా చేయి….

బిజెపి మంత్రి మాణిక్యాలరావు వ్యాఖ్యలను తెలుగుదేశం నేత ముళ్లపూడి బాపిరాజు వర్గం ఖండించింది. దమ్ముంటే మంత్రి పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని ఆ వర్గం మాణిక్యాలరావుకు సవాల్ విసిరింది. బాపిరాజు ఇప్పుడు రాజీనామా చేస్తే మేం మళ్లీ గెలిపించుకోగలం. మీకు ఆ ధైర్యం ఉందా అని తాడేపల్లిగూడెం మున్సిపల్‌ చైర్మన్‌ బోలిశెట్టి శ్రీనివాస్‌ తదితరులు మంత్రిని ప్రశ్నించారు. మంత్రి అపోహపడుతున్నారని,తన ఎదుగుదలను, జరుగుతున్న అబివృద్దిని చూసి మంత్రి ఓర్వలేకపోతున్నారని తిట్టిపోశారు. ఫలితంగా సి.ఎం చంద్రబాబు జోక్యం చేసుకోవాల్సిన 
పరిస్థితి ఏర్పడింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*