కేంద్రం కరుణిస్తే అభివృద్ధి పనుల వెల్లువే!

ఎన్నికలు ఇంకో సంవత్సరం రోజులు మాత్రమే ఉన్నాయి. ప్రభుత్వాలు వేగిర పడాల్సిన సమయం ఇది. ఈ సంవత్సరంలో వీలైనన్ని ఎక్కువ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి.. తమ సమర్థతను నిరూపించుకోలేకపోతే గనుక.. ప్రజల తిరస్కారాన్ని వారు చవిచూడాల్సి వస్తుంది. అదే సమయంలో.. అన్ని రాజకీయ పార్టీలూ ఈ ఏడాది సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి ప్రయత్నిస్తుంటాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కూడా పాలనలో ప్రస్తుతం గేరప్ అవుతున్నారు. ఈ మూడున్నరేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో ప్రాజెక్టులు వచ్చినప్పటికీ.. ఆయన ఎక్కువ ఫోకస్ అమరావతి మరియు పోలవరం మీదనే పెట్టారన్నది నిజం. అంత ఫోకస్ పెడితేనే ఆ పనులు అంతమాత్రం వచ్చాయి. ఇప్పుడు రాష్ట్రవ్యాప్త సమతుల అభివృద్ధి మీద దృష్టి పెట్టినట్టు కనిపిస్తోంది.

తిరుపతిలో ఓ ఐటీ కంపెనీ ప్రారంభం కాబోతోంది. మరోవైపు రాష్ట్రంలోని 13 జిల్లాల్లో వివిధ పనులు చేపట్టడానికి 16వేల కోట్ల రూపాయల అంచనాలతో జాబితాలు రూపొందించి కేంద్ర ప్రభుత్వానికి చంద్రబాబు లేఖ రాశారు. విదేశీ సంస్థల నుంచి రుణాల రూపేణా కాకుండా, నాబార్డు నుంచి గ్రాంట్ల రూపంలో ఈ సొమ్ము ఇప్పించాల్సిందిగా ఆయన అరుణ్ జైట్లీకి రాసిన లేఖలో కోరారు. మరో నాలుగైదురోజుల్లో ప్రధానితో జరగబోయే భేటీలో కూడా ఈ నిధులకు సంబంధించిన ప్రస్తావన వచ్చే అవకాశం ఉంది. కేంద్రం కరుణిస్తే గనుక.. రాష్ట్రవ్యాప్తంగా అభివృద్ధి పనుల వెల్లువ మొదలయ్యే అవకాశం ఉంది.

రాష్ట్రవ్యాప్తంగా పల్లెల్లో తాగునీటి సదుపాయాల కల్పన, మండలకేంద్రాలన్నిటికీ డబుల్ రోడ్లు, చిన్న పల్లెలనూ కలిపే రోడ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల భవనాల నిర్మాణం, 13 జిల్లాల్లో అవసరమైన చోట్ల వంతెనల నిర్మాణం, గ్రామీణ రోడ్ల బాగు- నిర్మాణం, అమరావతిలో పచ్చదనం పెంపునకు ఏర్పాట్లు వంటివి ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపాదించిన వాటిలో ఉన్నాయి. మరి నిధుల విడుదల విషయంలో కేంద్రం ఏ మేరకు సహకరిస్తుందో చూడాలి. అసలే ఏపీలో మేం నిధులిస్తేనే మీరు పనులు చేస్తున్నారు.. దానికి సంబంధించిన మైలేజీని మాకు కట్టబెట్టడం లేదు అంటూ పలు సందర్భాల్లో భాజపా శ్రేణులు అభ్యంతరపెడుతున్నాయి. కేంద్రంనుంచి వచ్చే ప్రతిరూపాయికీ.. భాజపాకు మైలేజీ రావాలని వారు కోరుకుంటున్న వాతావరణం కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల్లో ఏపీలో తమ బలాన్ని మరింతగా పెంచుకోవాలని.. ఇప్పుడు కూడా సాధ్యం కాకపోతే.. ఇంకెప్పటికీ సాధ్యం కాదని కూడా వారు ఆలోచిస్తున్నారు.. ఇలాంటి నేపథ్యంలో నిధుల విడుదల ఎలా ఉండబోతున్నది సందేహంగానే ఉంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*