7 రోజులు x 7 ఆటలు = తుస్స్..స్..స్..స్..స్!!

ఎవరైనా సరే ఓపెనింగ్ లోనే సినిమాకు పెట్టిన పెట్టబడి మొత్తం రాబట్టేయాలని చూస్తున్నారంటే గనుక.. ఆ సినిమాలో ఓపెనింగ్ తర్వాత చూడ్డానికి ఏమీ లేదేమో అని సందేహం కలుగుతుంది. సినిమా నిలకడగా ప్రజల్ని రంజింపజేసేదే అయితే.. ఓపెనింగ్ సీజన్ మీద అంత కక్కుర్తి ఎందుకు..? పరిమితమైన సెంటర్లలో విడుదల చేసుకుంటే.. సినిమా పరిశ్రమలో మళ్లీ ‘హండ్రెడ్ డేస్’ ఆడే కల్చర్ కూడా వస్తుంది కదా..! అని సామాన్య ప్రేక్షకులకు అనిపిస్తుంది. కానీ.. భారీ చిత్రాల నిర్మాతలకు అదేం అక్కర్లేదు. ఈ సినిమా ఆడుతుందో లేదో పరమాత్ముడికెరుక..! అలాంటప్పుడు లాటరీ ఎందుకు? హైప్ క్రియేట్ చేసి.. ఓపెనింగ్ ఎక్కువ థియేటర్లు వేసేసి.. సినిమా చెత్తగా ఉన్నదనే టాక్ స్ప్రెడ్ అయ్యేలోగా అన్ని టికెట్లు అమ్మేసుకుంటే సరిపోతుంది కదా అనే ఆత్రం పెరుగుతుంది.

ఈ సిద్ధాంతం కరెక్టే. ప్రస్తుతం అజ్ఞాతవాసి చిత్రం విషయంలో కూడా అచ్చంగా అదే జరిగింది. సినిమా ఒక దశ వరకు షూటింగ్ జరిగిన తర్వాత.. లేదా, రషెస్ చూసిన తర్వాత.. మేకర్స్ కు అది సవ్యంగా వస్తోందో.. చెత్తగా తయారవుతున్నదో అర్థమైపోతుంది. సినిమా ఫంక్షన్ ల వేదికల మీద వారు ఎలాంటి డాంబికపు మాటలు అయినా చెప్పవచ్చు గాక.. కానీ వారికి మాత్రం తమ సినిమా ఫ్లాప్ అనే సంగతి కొన్ని నెలల ముందుగానే అర్థమవుతుంది. అలాంటప్పుడు ఇలాంటి వక్రమార్గాలను విపరీతంగా అన్వేషిస్తారు. ప్రేక్షకులను బురిడీ కొట్టించి.. గరిష్టంగా లబ్ధిపొందాలని కక్కుర్తి పడుతుంటారు.

అజ్ఞాతవాసి నిర్మాతలు రూపకర్తల అలాటి కక్కుర్తికి ఏపీ ప్రభుత్వం ఈసారి చాలా బాగా సహకరించింది. వారి విచ్చలవిడి తనానికి రెడ్ కార్పెట్ పరిచేసింది. ఏదో విడుదల రోజు అర్ధరాత్రినుంచి ఫ్యాన్స్ కోసం ఆటలు వేసుకోడానికి అనుమతులు ఇవ్వడం గతంలో ఉండేది గానీ.. మొత్తం రాష్ట్రంలోని సినీ ప్రియులందరినీ దోచేసుకోవడమే లక్ష్యంగా ఏకంగా ఏడు రోజులపాటూ , రోజుకు ఏడేసి ఆటలు వేసుకోవడానికి అనుమతులచ్చింది.

అయితే సినిమా రూపకర్తల ఈ కుట్ర బెడిసికొట్టింది. అజ్ఞాతవాసి చిత్రానికి తొలిరోజునుంచే చాలా పేలవమైన టాక్ రావడంతో మధ్యాహ్నం మ్యాట్నీ ఆట సమయానికే థియేటర్ల వద్ద క్రౌడ్స్ పలచబడిపోయాయి. ఉదయం నుంచి అప్పటికే నాలుగు ఆటలు ప్రదర్శించేసిన ఎఫెక్ట్ అది. పైగా సినిమా బాగాలేదని టాక్ రావడంతో.. ఇది నిలబడితే కొన్నాళ్లు ఆగిన తర్వాత చూడొచ్చులే అనుకునే వారు పెరిగారు. పైగా యూత్ లో సాధారణంగా పవన్ కు క్రేజ్ గనుక.. తొలిరోజుతో పాటూ మలిరోజుకు కూడా రెండోసారి మూడోసారి చూడడానికి కూడా ముందే టికెట్లు కొనేసుకున్న వారు వేలల్లోనే ఉంటారు. అలాంటి వారంతా ఒకటో సారి సినిమా చూసిన తర్వాత.. మిగిలిన షోలకోసం టికెట్ల కోసం కొనుక్కున్న టికెట్లను ఇతరులకు అమ్మేస్తున్నారట. కొనేవాళ్లు లేకపోతే.. మిత్రులకు పరిచయస్తులకు ఉచితంగా కూడా ఇచ్చేస్తున్నారట. టికెట్ వేస్టయినా పరవాలేదు గానీ.. రెండోసారి మాత్రం అజ్ఞాతవాసి ఉన్న థియేటర్ వైపు వెళ్లరాదని అనుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. వాస్తవంగా 7 రోజులు, 7 ఆటల వంతున వేసేస్తే.. వారంలో మొత్తం కలెక్షన్లు చాప చుట్టేయాలి. కానీ ఈ చిత్రానికి అంత సీన్ లేదని, ఈ కొత్త ప్రయోగం వికటించిందని సినీ పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*