సినిమా రిజల్ట్ మించి పవన్ ఫ్యాన్స్ కు పరాభవం!

పవన్ కల్యాణ్ తాజా చిత్రం అజ్ఞాతవాసి ప్రపంచ వ్యాప్తంగా వీర బీభత్స రేంజిలో విడుదల అయింది. సినిమా గురించి రకరకాల వ్యాఖ్యలు వినవస్తున్నాయి. ఏకపక్షంగా అద్భుతం అనే మాట ఫ్యాన్స్ వైపు నుంచి కూడా రావడం లేదు. రిజల్ట్ సంగతి ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా ఒక మినిమం గ్యారంటీ పవన్ కల్యాణ్ చిత్రాలకు ఉంటుందని ఆశించవచ్చు. ఇది అందరికీ తెలిసిందే. అయితే.. రిజల్ట్ సంగతి పక్కన పెడితే.. అంతకు మించిన అత్యంత ఘోరమైన పరాభవం పవన్ అండ్ కోటరీకి ఎదురైదింది. అది కూడా కత్తి మహేష్ నుంచి! ‘‘ఇలాంటి చెత్త సినిమాలను రివ్యూ చేయడం కూడా తన స్థాయికి తగదంటూ’’ కత్తి మహేష్ వ్యాఖ్యానించడంతో.. పవన్ ఫ్యాన్స్ మౌనంగానే ఉడికిపోతున్నారు.

కత్తి మహేష్ వెర్సస్ పవన్ కల్యాణ్ కోటరీ మధ్య కొన్ని రోజులుగా యుద్ధ వాతావరణం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. పవన్ రాజకీయ వ్యవహారంపై కత్తి మహేష్ కొన్ని విమర్శలు చేయడం అనేది ఈ యుద్ధానికి బీజం. వాటికి పవన్ ఫ్యాన్స్ స్పందించడం.. ఆ తర్వాత… పవన్ నర్మగర్భాలంకారం వేసి ట్వీట్లు పెట్టడం.. వాటికి చాలా సూటిగా కత్తి మహేష్ రెస్పాండ్ కావడం. ఒక రోజంతా దాదాపుగా అన్ని టీవీ ఛానెళ్లు తిరిగేసి.. పవన్ కల్యాణ్ రాజకీయ, వ్యక్తిగత వ్యవహారాల మీద ఎడా పెడా విమర్శలు ఎక్కుపెట్టి ఓ ఆటాడుకోవడం ఇవన్నీ సీక్వెన్సులో జరిగిపోయాయి. అక్కడకు యుద్ధవిరమణ వాతావరణం ఏర్పడింది.

ఇప్పుడు తాజాగా అజ్ఞాతవాసిచిత్రం విడుదల కూడా పూర్తయింది. చిత్రానికి డివైడ్ టాక్ వస్తున్న నేపథ్యంలో కొత్తగా చూడదలచుకుంటున్న వారంతా కూడా ఆన్ లైన్ లో వస్తున్న రివ్యూల మీద ఆధారపడే అవకాశం ఉంది. అయితే రివ్యూల పరిస్థితి సానుకూలంగా లేదని తెలుస్తోంది. తటస్థంగా ఉండే కొన్ని రివ్యూల్లో అటూ ఇటూ తేల్చకుండా ఏదో ఒక సంగతి చెప్పేస్తున్నప్పటికీ.. సూటిగా విశ్లేషణ అందించే సమీక్షలు కొన్ని ప్రత్యేకంగా ముద్రపడినవి ఉన్నాయి. సినీ విమర్శకుడిగా కత్తి మహేష్ చేసే సమీక్షలకు కూడా అలాంటి గుర్తింపు ఉంది. అయితే ఇలాంటి సమీక్షకులు ప్రతి సినిమాను సమీక్షించకుండా.. ఒక స్థాయి కంటె తక్కువగా ఉంటే.. దాన్నసలు సమీక్షించకుండానే.. వదిలేయడం చాలా అలవాటుగా చేస్తున్నారు.

అలాంటి క్రమంలో కత్తి మహేష్ కూడా.. అజ్ఞాతవాసికి అలాంటి పరాభవాన్ని రుచిచూపించారు. తాను రివ్యూ చేసే రేంజిలో ఈ చిత్రం లేనే లేదని ఆయన వ్యాఖ్యానించాడు. కొన్ని రోజులుగా కత్తి మహేష్ తో ఆన్ లైన్ విమర్శల యుద్ధం సాగిస్తున్న పవన్ ఫ్యాన్స్ లో కొందరు ఇప్పటికీ ఆగ్రహంగా తిడుతున్నా.. చాలా మంది సినిమా చూశాక కిక్కురుమనకుండా ఊరకుండిపోతున్నారు. అందుకే పవన్ ఫ్యాన్స్ కుసినిమా రిజల్ట్ కంటె పెద్ద పరాభవం.. కత్తి నుంచి వచ్చందని అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*