పవన్ సైకిల్ పిచ్చి చిన్నప్పటినుంచీ ఉన్నదే!

తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా మెలగడం చూసి.. పవన్ కల్యాణ్ – అంతా చంద్రబాబునాయుడు వేసిన స్కెచ్ ప్రకారమే నడుచుకుంటూ ఉంటారని ఆయన రాజకీయ ప్రత్యర్థులు విమర్శిస్తూ ఉంటారు. పవన్ పేరుకు తను కూడా సొంతంగా పార్టీ ప్రారంభించి.. పార్టీ అధినేతగా ఉంటున్నప్పటికీ.. ఆయన లక్ష్యం సైకిలు పార్టీని గెలిపించడం మాత్రమే అనే విమర్శలు జోరుగానే వినిపిస్తూ ఉంటాయి. పవన్ కల్యాణ్ మాత్రం.. తన ఇటీవలి రాజకీయ ప్రసంగాల్లో.. ఏపీని అభివృద్ధి చేయడానికి అనుభవజ్ఞుడైన నాయకుడు కావాలని.. అలాంటి అనుభవం చంద్రబాబు వద్ద ఉన్నదని అంటూనే… ఆయన కష్టపడే తత్వం నచ్చే.. ఆయనైతే రాష్ట్రాన్ని గాడిలో పెట్టగలరనే నమ్మకంతో తాను మద్దతు ఇస్తున్నట్లు చెబుతూ ఉంటారు.

ఇవన్నీ రాజకీయ నేపథ్యంలో సాగుతున్న సంగతులు కాగా.. ఒక రకంగా పవన్ కల్యాణ్ తెలుగుదేశం పార్టీ మీద చూపించే సానుకూల దృక్పథానికి బుధవారం విడుదల అయిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసినట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే ఈ చిత్రంలో సైకిలు మీద పవన్ కల్యాణ్ మోజు గురించి ప్రత్యేకమైన ఎపిసోడ్.. మరియు డైలాగ్ కూడా ఉంది.

అజ్ఞాతవాసి చిత్రంలో పవన్ కల్యాణ్ అసోంనుంచి దిగుమతి అయి.. వ్యాపార సామ్రాజ్యాన్ని చక్కదిద్దే ఉద్యోగిగా చేరుతాడనే సంగతి రివ్యూలు ఫాలోఅవుతున్న పాఠకులందరికీ తెలిసే ఉంటుంది. అలాగే ఈ చిత్రంలో మెయిన్ విలన్ ఆది లాగానే.. కామెడీ విలన్ లుగా మురళీ శర్మ, రావు రమేష్ ల పాత్రలు రెండు ఉన్నాయి. కామెడీ ఎక్కువగా వీరి ద్వారానే పండించే ప్రయత్నం చేశారు. ట్రైలర్ లోనే ‘మళ్లీ సైకిలెక్కుతాడా వర్మా’ అనే డైలాగును చూపించడం ద్వారా.. సైకిలు ఎపిసోడ్ ఏదో అలరించేలా ఉండబోతుందని ఎవరైనా గెస్ కొట్టి ఉండవచ్చు.

కామెడీ విలన్లను సరదాగా ఏడిపించే సన్నివేశంలో పవన్ కల్యాణ్ సైకిలు తొక్కుతూ వారిని ఓ ఆటాడుకునే సీన్ ఒకటుంది. సైకిలు నడుపుతూ పవన్ కల్యాణ్ తమను ఏడిపించిన తీరుకు వారిద్దరూ బెంబేలెత్తిపోతారు. అందుకే పవన్ గురించి ‘మళ్లీ సైకిలెక్కుతాడా వర్మా’ అనే డైలాగు ఆ తర్వాతి పార్ట్ లో వస్తుంది. కాకపోతే.. అసలు సైకిల్ కామెడీ ఎపిసోడ్ జరిగినప్పుడు.. హీరోలను ఎలివేట్ చేసే డైలాగులు చెప్పడానికి సీన్ లోకి ఎంటరవుతూ ఉండే.. తనికెళ్ల భరణి ఎంట్రీ ఇచ్చి.. మావాడు అంతే.. వాడికి చిన్నప్పటినుంచి సైకిలు అంటే పిచ్చి అని సెలవిస్తాడు.

ఈ డైలాగే ఇప్పుడు రాజకీయంగా వైరల్ అవుతోంది. పవన్ గురించి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆవిష్కరించిన రాజకీయ వాస్తవం ఇది.. అని పలువురు అంటున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే మోజు బహుశా పవన్ కు చిన్నతనం నుంచే ఉన్నదేమో అనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అన్నయ్య పార్టీ పెట్టినప్పుడు.. ఏదో ఆయన సీఎం అయిపోగలరనే భ్రమలో.. చంద్రబాబును కూడా తిట్టి ఉండొచ్చు గానీ.. ఇప్పుడు తన రాజకీయ పార్టీ ద్వారా కూడా అధికారం కాకుండా.. ఇతర ప్రయోజనాలు మాత్రమే ఆశిస్తున్నాడు గనుక.. చిన్నప్పటినుంచీ ఉన్న తన సైకిలు పిచ్చిని దాచుకోకుండా ప్రదర్శిస్తున్నాడని పలువురు అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*