చంద్రుల పాలన అధ్భుతమని గవర్నర్ నివేదిక

ప్రధాని నరేంద్ర మోడీ వద్దకు గవర్నర్ నరసింహన్ వెళ్లారు. తెలుగు రాష్ట్రాల్లోని పని తీరు పై వేరు వేరు నివేదికలు ఇచ్చారు గవర్నర్. ఒక నోట్ లో వారి పనితీరు బాగుందని చెప్పగా..మరో నోట్ లో బీజేపీకి పనికొచ్చే అంశాలు ప్రస్తావించారంటున్నారు. మోడీకి తప్ప మరెవరికీ ఆ నివేదికలు తెలిసే అవకాశం లేదని సమాచారం. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో పాలన ఎలా ఉంది.  ఇద్దరు ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నారు. వారిద్దరి మధ్య జరిగే చర్చల సమయంలో ఏయే సందేహాలు వచ్చాయి. వాస్తవ పరిస్థితి ఏంటనే విషయం పై ప్రధాని మోడీ ఆరా తీశారంటున్నారు. చంద్రులిద్దరు సయోధ్యతోనే ఉంటున్నారా..లేక ఒకరి పై మరొకరు కత్తులు నూరుకుంటున్నారా..వాస్తవం ఏంటని మోడీ అడిగారని తెలుస్తోంది. విభేదాలు ఉన్నా..పైకి కనపడవని..ఎవరికి వారే తమ వ్యూహాల్లో ఉన్నారని చెప్పారని సమాచారం వస్తోంది. 

మరోవైపు తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయానికి 24గంటల విద్యుత్‌ సరఫరా, తెలంగాణలో భూ రికార్డుల ప్రక్షాళన సత్ఫలితాలు ఇస్తోందని ఇంకో నివేదిక ఇచ్చారంటున్నారు.  పోలవరం, కాళేశ్వరం ప్రాజెక్టు పనులు వేగంగా జరుగుతున్నాయని చెప్పారట. రెండు రాష్ట్రాల్లోనూ శాంతిభద్రతల పరంగా ఎలాంటి సమస్యలూ లేవని చెప్పారు. రాష్ట్రపతి శీతాకాల విడిదికి వచ్చిన సమయంలో ఇద్దరు ముఖ్యమంత్రులు కలిశారని, అన్ని విషయాలూ చర్చించుకున్నారని ప్రధానికి ఆ నోట్ ద్వారా అధికారికంగా తెలిపారు. కావాలని ఆ నోట్ ను లీక్ చేసారనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత సిఎంలు ఇద్దరు తూర్పు, పడమరలుగా ఉన్న సంగతి తెలిసిందే. గవర్నర్ నరసింహన్ వారిద్దరి మధ్య తొలిసారిగా సమావేశం ఏర్పాటు చేసారు. ఆ తర్వాత అటు ఇటు రాకపోకలు సాగుతున్నాయి. మాట మంతీలు సజావుగా ఉన్నాయని ఆ నివేదిక ద్వారా గవర్నర్ చెబుతున్నారు. 

ఇద్దరు ముఖ్యమంత్రులు జరిపిన చర్చలు సజావుగా ఉంటే ముందుగా ఎందుకు చెప్పలేదనేది ఆసక్తికరం. వారిద్దరు మాట్లాడుకున్నారు. చర్చలు బాగా సాగాయి. రెండు రాష్ట్రాల మధ్య ఇబ్బందులు లేవని మీడియాకు చెప్పేవాళ్లు. కానీ అదిజరగక పోవడంతో గవర్నర్ నివేదిక పై అనుమానాలు వస్తున్నాయి. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*