కమ్యూనిస్టు పార్టీలు కలిసి పోతాయా…..

భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) జాతీయ సమావేశాలు బెజవాడ కేంద్రంగా జరుగుతున్నాయి. ఆ పార్టీ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి తెలుగు వారే. కాబట్టి ఇక్కడ సమావేశాలు జరిపేందుకు మొగ్గు చూపారంటున్నారు. ఈ సందర్భంగా ఆసక్తికర చర్చ జరుగుతోంది. సిపిఐ, సిపిఎంలు విలీనం అయ్యే అంశం చర్చకు వచ్చే వీలుందంటున్నారు. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్ లో ఆరెండు పార్టీలు ఏకమయ్యే అవకాశముంది.

1962లో భారత్ చైనా యుద్దం వచ్చింది. చైనాకు మద్దతు పలికారు కొందరు కమ్యూనిస్టులు. ఇంకొందరు వ్యతిరేకించారు. ఇదే సమయంలో అప్పటి ప్రధాని నెహ్రూ విధానాలను సమర్థించారు కీలక నేతలు. దీంతో సిపిఐలో చీలిక ఏర్పడింది. 1964లో సిపిఐ నుంచి వేరుపడి సిపిఎం ఏర్పడింది. పుచ్చపల్లి సుందరయ్య, మాకినేని బసవపున్నయ, హరికిషన్ సింగ్ సూర్జిత్, జ్యోతిబసు, బిటి రణదేవ్, ఇ.ఎంస్. నంబూద్రిపాద్, ఏకే గోపాలన్ వంటి ప్రముఖ నేతలు సిపిఎంలు చేరారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో త్రిపుర, పశ్చిమ బెంగాల్, కేరళలో ఆ పార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. చాలా రాష్ట్రాల్లో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు చట్టసభలకు ఎంపికయ్యారు. సిపిఐ ఇంకా అలానే ఉంది. ఏ రాష్ట్రంలో సంపూర్ణ మెజార్టీని సిపిఐ పొందలేకపోయింది.

రాబోయే ఐదేళ్లలో సీపీఐతో సీపీఎం విలీనం అవుతుందనే చర్చ ఇప్పుడు జరుగుతోంది. సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఈ విషయాన్ని ఇంతకు ముందే కమ్యూనిస్టు పార్టీ చీలిపోయిన 1964 నాటి పరిస్థితులు ఇప్పుడు లేవన్నారు సురవరం. అందుకే ఇప్పుడు విలీనం దిశగా పార్టీల నేతలు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది. సయోధ్యతో కలిసి ఉంటేనే మనుగడ సాధించగలమని, లేకుంటే రెండింటికీ ఇబ్బందులు తప్పవనేది సురవరం మాటగా ఉంది. ఒకే లక్ష్యంతో, సారూప్యతతో పోరాటాలు సాగిస్తున్న రెండు పార్టీలు  వేర్వేరుగా ఉండి ఉద్యమాలు కొనసాగించటం నేడు కష్టంగా మారింది.

లౌకికతత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ నిబద్ధత వంటి విషయాల్లో రెండు పార్టీలు ఇప్పటికే ఒకే విధానం కలిగి ఉన్నాయి. ఏకీకరణ విషయంలో మాత్రం ముఖాముఖి చర్చలు ఇంకా జరగలేదు. రెండు పార్టీల్లోనూ విలీనంపై కొంత సానుకూల దృక్పథం ఉంది. కాకపోతే సిసిఎం నాయకత్వం తమ పార్టీతో చర్చించేందుకు ముందుకు రావాలనేది సురవరం లాంటి నేతలు సూచన. రెండు పార్టీల ఉన్నత స్థాయి సమావేశాలు జరగనున్నాయి. ఆ సమయంలో రెండు పార్టీలు విలీనం విషయం పై చర్చిస్తే మంచిదంటున్నారు. కచ్చితంగా రెండు పార్టీలు కలుస్తాయని చెప్పారు సురవరం. రాబోయే నాలుగైదు సంవత్సరాల్లో విలీన ప్రక్రియ పూర్తి చేసుకుంటాయని ఆత్మవిశ్వాసంతో చెప్పారు కామ్రేడ్స్.

బెజవాడలో ఏం జరుగుతోంది…

భారత కమ్యూనిస్టు పార్టీ జాతీయ సమితి సమావేశాలు విజయవాడలో ప్రారంభమయ్యాయి. ఈనెల 10 వరకు ఇవి జరగనున్నాయి. ఈ సమావేశాలకు సీపీఐ అగ్రనేతలు సురవరం సుధాకరెడ్డి, డి.రాజా, జాతీయ కార్యదర్శివర్గ సభ్యులతో పాటు 29 రాష్ట్రాలకు చెందిన రాష్ట్ర పార్టీ కార్యదర్శులు హాజరయ్యారు. చివరి రోజు గాంధీనగర్‌ జింఖానా గ్రౌండ్స్‌లో బహిరంగ సభను నిర్వహించనుంది ఆ పార్టీ. అదే సమయంలో రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీకి పొత్తు పెట్టుకోవాలనే అంశం పైనా చర్చ జరగనుంది. వారి నిర్ణయం ఎలా ఉంటుందో వేచి చూడాలి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*