శాటిలైట్, డబ్బింగ్ డబ్బులు… సమర్పయామి!

సినిమాకు సంబంధించి లీగల్, కాపీరైట్ వివాదం మొదలైందంటే.. అది ఎంతదూరమైనా వెళ్లవచ్చు. భారీ సినిమాల విషయంలో అయితే.. అలాంటి వివాదాలు ఎంత భారీ నష్టాన్ని కలుగచేస్తాయో అంచనా వేయడం కూడా కష్టం. అందుకే కాబోలు.. ఎంత ఖర్చయినా సరే.. తెగించి.. వివాదం నుంచి బయటపడడానికి అజ్ఞాతవాసి నిర్మాతలు ప్రయత్నించినట్లుగా ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. టీ సిరీస్ వారితో తలెత్తిన కాపీరైట్ వివాదం సద్దు మణగడానికి.. హిందీ డబ్బింగ్ హక్కులు విక్రయించడం ద్వారానూ, హిందీ శాటిలైట్ ఛానెళ్లకు విక్రయించడం ద్వారానూ వచ్చే మొత్తం సొమ్మును పరిహారంగా చెల్లించడానికి అజ్ఞాతవాసి నిర్మాత రాధాకృష్ణ అంగీకరించినట్లుగా చెప్పుకుంటున్నారు. ఈ రెండు రేట్ల మొత్తం విలువ దాదాపు 20 కోట్ల వరకు ఉండవచ్చునని కూడా అనుకుంటున్నారు.

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ హీరోగా ఎస్ రాధాకృష్ణ ఈ చిత్రాన్ని నిర్మించారు. కాగా, ఇది 2008లో వచ్చిన ఫ్రెంచి చిత్రం లార్గో వించ్ కు యథాతథంగా కాపీ అనే ప్రచారం ఇండస్ట్రీలో గుప్పుమంది. బాలీవుడ్ లో దీనిని రీమేక్ చేయడానికి ప్రముఖ నిర్మాణ సంస్థ టీసిరీస్ ఫ్రెంచి చిత్రం హక్కులు కూడా కొనుక్కుంది. అయితే ఆ సంగతి తెలియకుండా వీళ్లు నిర్మాణం పూర్తి చేసేశారు. సినిమా కాగానే.. బాలీవుడ్ లో దీనిని డబ్బింగ్ చేసుకోడానికి , అక్కడ శాటిలైట్ విడుదలకు హక్కులను కూడా అమ్మేశారు.

తీరా టీ సిరీస్ నుంచి నోటీసులు వచ్చేసరికి నిర్మాతలు ఖంగుతిని వారితో సంప్రదింపులు జరిపినట్లుగా తెలుస్తోంది. ఎడతెగని చర్చల తర్వాత.. అజ్ఞాతవాసి బాలీవుడ్ డబ్బింగ్, హిందీ ఛానెళ్లకు అమ్మిన శాటిలైట్ హక్కు లధరల మొత్తం టీసిరీస్ కు పరిహారంగా చెల్లించేశారుట.

అయినా విదేశీ చిత్రాలను యథాతథంగా కాపీ కొట్టేయడం అనేది మన సినీ దర్శకులు తమ జన్మహక్కు కింద భావిస్తుంటారు. కాకపోతే.. నిండా పదేళ్లు కూడా నిండని లేటెస్టు చిత్రాన్ని కూడా కాపీ కొట్టేసే సరికి.. వివాదం రచ్చకెక్కి.. భారీ పెనాల్టీ పడినట్లుగా పరిస్థితి తయారైందని అంతా అనుకుంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*