జగన్ బాహుబలినట

         నగరి ఎమ్మెల్యే, వైకాపా నేత రోజా ఎక్కడా తగ్గడం లేదు. మరింత దూకుడుగానే తన మాటల దాడిని కొనసాగిస్తోంది. సిఎం చంద్రబాబును జగన్ తర్వాత వ్యక్తిగతంగా విమర్శించే నేత రోజానే. నంద్యాల ఉప ఎన్నికల సమయంలో మంత్రి అఖిల ప్రియ డ్రస్ పై నోరు జారి చివరకు తిప్పలు తెచ్చుకుంది. మహిళలే ఆమెను అక్కడ నుంచి పంపించే పరిస్థితి తెచ్చుకుంది. 
        ఇప్పుడు ఆమె  వైకాపా అధినేత జగన్ ను బాహుబలితో పోల్చింది. సి.ఎం చంద్రబాబు భళ్లాలదేవుడిగా, హస్తిన నేతలు శివగామిగా పోల్చారామె. జగన్ ను బాహుబలిగా ప్రస్తావించారు. ఎవరు ఎన్ని కుట్రలు చేసినా చివరకు విజయం బాహుబలిదేనని చెప్పారు. జగన్ పాదయాత్రకు జనం వస్తుంటే చూసి భయపడుతున్నారని విమర్శించారు. పులివెందులలో చంద్రబాబు సభకు జనం బాగా వచ్చారు. ఎంపీ అవినాష్ రెడ్డి గొడవ జరగక పోయి ఉంటే అదే అంశం చర్చకు వచ్చేది. కానీ అవినాష్ రెడ్డి విషయంలో చంద్రబాబు తీరు పై భిన్నాభిప్రాయాలు వస్తున్నాయి. గొడవ చేసేందుకు వారు వచ్చారు. మైక్ తీసుకోక పోతే ఏదేదో మాట్లాడేవారు. కానీ మేము అలాంటి అవకాశం ఇవ్వలేదనేది టీడీపీ వాదన. 
          ఎంపీకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా చంద్రబాబు అవమానించారనేది మరొక వాదన. విషయం ఏదైనా ఆ ఎపిసోడ్ తో పులివెందులలో చంద్రబాబు సభకు వచ్చిన జనం సంగతి అంతా మర్చిపోయారు. ఇప్పుడు రోజా అదే విషయాన్ని ప్రస్తావించారు. ప్రజాస్వామ్య పద్దతిలో ఎన్నికైన ఎంపీని సభలో మాట్లాడనీయకుండా ఆపారనేది ఆమె చేసిన ఆరోపణ. జన్మభూమి టీడీపీ కారక్రమం కాదని…ప్రభుత్వం చేసే పని అని చెప్పారు. 
కేసుల్లో ఇరుక్కుంటే బాహుబలి అవుతారా…
          అక్రమాస్తుల కేసులో జగన్ ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతున్నారు. ఇప్పటికే ఈడీ రూ.46వేలకోట్ల ఆస్తులు అటాచ్‌ చేసింది. ఇంకా ఆ కేసులో విచారణ సాగుతూనే ఉంది. జగన్ కి చెందిన 170 కోట్ల రూపాయల నగదు డిపాజిట్లను ఎన్‌‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ (ఈడీ) రెండు రోజుల కిందటనే స్వాధీనం చేసుకుంది. జగన్‌ అక్రమాస్తుల కేసులో 2014 నుంచి ఈడీ ఆయన కంపెనీలకు చెందిన స్థిర, చరాస్తులను జప్తు (అటాచ్‌మెంట్‌) చేసుకుంటోంది. వీటి మొత్తం విలువ రూ.2524 కోట్లు. ఇందులో భారతీ సిమెంట్స్‌కు చెందిన రూ.170 కోట్ల విలువైన బ్యాంకు డిపాజిట్లు, షేర్లు ఉన్నాయి. ఇంత పెద్ద స్థాయిలో జగన్ కు సంబంధించిన విషయాలు వెలుగులోకి వస్తుంటే..ఆయన్ను రోజా బాహుబలి అంటుందా అంటున్నారు మరోవైపు తెలుగు తమ్ముళ్లు. విషయం ఏదైనా రోజా బాహుబలి మాటలతో రాజకీయ వేడి రగులుతోంది.