ఇసుక మాఫియా ఆగడాలతో కేసీఆర్ కు చిక్కులు

          తెలంగాణలో ఇసుక మాఫియా బరితెగిస్తోంది. తమ ఆగడాలకు అడ్డు వచ్చే వారిని చంపేస్తోంది. గవర్నర్ నరసింహన్ ను కలిసిన టీ కాంగ్రెస్ నేతలు అదే విషయాన్ని ప్రస్తావించారు. సి.ఎం కేసీఆర్ కు చేతగావడం లేదు. మీరైనా చెప్పాలని కోరారు. అయినా సరే ఇసుక అక్రమాలకు  బ్రేకులు పడలేదు. ఇసుకాసురుల దందా కొనసాగుతూనే ఉంది. కామారెడ్డి జిల్లాలో డ్యూటీలో ఉన్న వీఆర్ఏ ను ట్రాక్టర్ తో తొక్కించి మరీ ప్రాణాలు తీసిన సంగతి తెలిసిందే. కామారెడ్డి జిల్లాలోని పిట్లం మండలం కంబాపూర్ గ్రామశివారులో ఉన్న కాకివాగు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు వీఆర్ఏ సాయిలుకు ఫోన్ వచ్చింది. కుటుంబ సభ్యులకు ఆ విషయం చెప్పిన సాయిలు కాకివాగు వద్దకు బయల్దేరాడు. ట్రాక్టర్లలో ఇసుకను తరలిస్తున్న ముఠా సాయిలను చూసింది. తీవ్రమైన ఆగ్రహంతో ఊగిపోయిన ఇసుక ముఠా వీఆర్ఏ సాయిలు మీదుగా ట్రాక్టర్‌ను తొక్కించారు. ఈ ఘటనలో సాయిలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.
          దీని పై దుమారం రేగింది. మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పిట్లం గ్రామస్తులు, సాయిలు కుటుంబ సభ్యులు ఘటనా స్థలికి చేరుకొని ఆందోళన చేశారు. అన్యాయం జరిగినా, ప్రాణాలు పోతున్నా…ఏం జరిగినా కేసీఆర్ కుటుంబం పట్టించుకోవడం లేదని ఆందోళన చేశారు. సాయిలు కుటుంబానికి న్యాయం చేయాలని బాధితులు డిమాండ్ చేశారు. ఇంతకుముందు సిరిసిల్ల జిల్లా నేరెళ్లలో ఇసుక మాఫియా అరాచకాలు సాగిన సంగతి తెలిసిందే. బీసీలు, దళితులపై పోలీసులు చాలా కిరాతకంగా వ్యవహరించారనే విమర్శలు వచ్చాయి. మాఫియా దురాగతాలను కట్టడి చేయలేకపోయిన పోలీసులు యువకుల మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. పోలీసుల ప్రతాపానికి కొందరు యువకుల మర్మాంగాలు దెబ్బతిన్నాయంటారు. 
       నేరెళ్ల ఘటనపై కాంగ్రెస్, బీజేపీ నాయకులు పెద్ద ఉద్యమమే చేశారు. లోక్ సభ మాజీ స్పీకర్ మీరాకుమార్ నేరెళ్లలో పర్యటించి కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అధికార పార్టీ నేతల బంధువులే ఇసుక మాఫియాను ప్రోత్సహిస్తున్నారనే వాదనలున్నాయి.  ప్రతిపక్షాలే కాదు..మావోయిస్టు పార్టీ ఈ విషయంలో కేసీఆర్ తీరును తప్పుపట్టారు. 
కేటీఆర్ దబాయింపు….
        కానీ ఈ ఘటన పైరాష్ట్ర మంత్రి కేటీఆర్ ఆలస్యంగా స్పందించారు. అసలు చనిపోయింది విఆర్ఏ కాదని బుకాయించారు. మీడియా అనవసరంగా ప్రచారం చేస్తుందని జాగ్రత్తగా వార్తలు ఇవ్వాలని హెచ్చరికలు చేశారు. ఇసుక మాఫియా చేతిలో చనిపోయింది వీఆర్ఎనా..మరొకరా అనేది కాదు విషయం. అందుకు బాధ్యులైన వారి పై చర్యలు తీసుకుంటాని చెప్పాలి మంత్రి. కానీ ఇందుకు విరుద్దంగా మాట్లాడటంతో ఇసుకాసురులకు అండగా నిలుస్తున్నట్లు ఉన్నాయి కేటీఆర్ మాటలు. ఫలితంగా కేసీఆర్ పైనే కాదు..కేటీఆర్ పైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 
 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*