తాను డిఫరెంట్ అని ప్రూవ్ చేసుకున్న కేటీఆర్!

తమ్ముడు తనవాడైనా ధర్మ ధర్మమే అని సామెత. రాజకీయాల్లో దీన్ని పట్టించుకునేవారు తక్కువే. ‘తమ’ వాళ్లు అయితే చాలు ఎంత అడ్డగోలుగా అయినా వ్యవహరించడానికి నాయకులు తెగబడుతుంటారు. తమ వారు తప్పులు చేసినా చూసీ చూడనట్లు వదిలేస్తూ ఉంటారు. అయితే ఈ విషయంలో తాను మాత్రం డిఫరెంట్ నాయకుడిని అని తెలంగాణ మంత్రి కేటీఆర్ ప్రూవ్ చేసుకున్నారు. తెలంగాణలో కీలకం అయిన పట్టణాభివృద్ధి శాఖతో పాటూ ఐటీశాఖను కూడా పర్యవేక్షిస్తున్న మంత్రి కేటీఆర్.. ఆచరణలో తప్పు జరిరగినప్పుడు తన-పర భేదాలు లేకుండా చర్యలకు ఉపక్రమించడమే ధర్మం అని నిరూపించారు. నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణానికి హాని కలిగేలా ఫ్లెక్సిలు ఏర్పాటుచేసినందుకు తన సొంత పార్టీకే చెందిన కార్పొరేటర్లకు జీహెచ్ఎంసీ తరఫున జరిమానాలు విధింపజేశారు.

వివరాల్లోకి వెళితే.. మంత్రి కేటీఆర్ ఇటీవల మలక్ పేట ఇండోర్ స్టేడియంను ప్రారంభించారు. సాక్షాత్తూ సీఎం తరువాత.. అంతటి కీలకమైన తమ పార్టీ నాయకుడు వస్తుండేసరికి స్థానికంగా ఉండే గులాబీ శ్రేణుల వారందరికీ ఉత్సాహం పొంగుకొచ్చింది. మంత్రిని ఇతర నాయకులను స్వాగతిస్తూ, శ్లాఘిస్తూ.. వారిని ప్రసన్నం చేసుకోవడానికి లెక్కకు మిక్కిలిగా ఫ్లెక్సిలు ఏర్పాటుచేశారు. ఆ ప్రాంతం మొత్తం గులాబీ వర్ణమయం అయిపోయింది. ఎటుచూసినా.. కేటీఆర్ ఫోటోలతో కూడిన ఫ్లెక్సిలే.

తనకు భజన చేసినంత మాత్రాన తాను నిబంధనలకు విరుద్ధంగా ప్రవర్తించేది లేదని కేటీఆర్ నిరూపించుకున్నారు. ఫ్లెక్సీల్లో హద్దులు దాటిన తెరాస కార్పొరేటర్లు సునరితా రెడ్డి, మాజీ కార్పొరేటర్ అస్లాం, మరో తెరాస నాయకుడు శ్రీనివాస్ లకు ముగ్గురికీ కలిపి లక్ష రూపాయల జరిమానాలను విధింపజేశారు. అయితే తమాషా ఏంటంటే.. మంత్రిని ప్రసన్నం చేసుకోవడానికి వేసిన ఫ్లెక్సిలు బెడిసికొట్టి ఆయన ఆగ్రహానికి, జరిమానాలకు దారి తీసినప్పటికీ.. సదరు నాయకుల్లో మాత్రం అసంతృప్తి కలగలేదు. తమ మీద చర్య తీసుకున్నప్పటికీ కేటీఆర్ మంచి పనే చేశారంటూ వారు కితాబులిచ్చారు. తమ ప్రమేయం లేకుండానే అనుచరులు ఫ్లెక్సిల్లో హద్దులు దాటేశారంటూ… జరిమానాల శిక్షను స్వీకరించారు. కార్పొరేటర్ సునరితారెడ్డి అప్పటికప్పుడే 50 వేల రూపాయల చెక్కును జీహెచ్ ఎంసీకి చెల్లించేశారు కూడా.

నిజానికి ఇలాంటివి చిన్న చిన్న విషయాలే అయినా.. నాయకులకు ప్రజల వద్ద ఒక విలక్షణమైన గుర్తింపు రావడానికి ఉపయోగపడుతూ ఉంటాయి. హైదరాబాదును విశ్వనగరంగా తీర్చిదిద్దాలని అంటున్న కేటీఆర్ పర్యావరణానికి విఘాతం కలిగించే ప్లాస్టిక్ వినియోగం, ఫ్లెక్సిలను ఏర్పాటుచేయడం తదితర వ్యవహారాలపై నిర్దిష్టమైన ప్రణాళిక, నియంత్రణ, నిబంధనలతో ముందుకు సాగుతున్నారు. అలాంటిది తన కార్యక్రమానికే ఇలా జరగడంపై ఆగ్రహించి.. ఆయన జరిమానాలు విధించినట్లుగా కనిపిస్తోంది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*