జడ్జిల జీతాలు సరే.. మా సంగతేంటి… అంటున్న ఎంపీలు

కేంద్ర ప్రభుత్వం దేశంలో జడ్జిలకు జీతాలు పెంచే బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టింది. ఇందుకు ఆమోదం తెలుపుతామని చెప్పిన సభ్యులు కొంత మంది మా సంగతి ఏంటని ప్రశ్నించారు. ఎంపీలకు ప్రస్తుతం ఇస్తున్న జీతాలు సరిపోవడం లేదని వారు అడిగారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ జడ్జిల జీతాల బిల్లును లోక్ సభలో ప్రవేశ పెట్టిన సందర్భంగా జరిగిన ఆసక్తికర చర్చ ఇది. ఆ సమయంలో పార్టీలకు అతీతంగా పలువురు తమ జీతాల సంగతిని అడగడంతో మంత్రికి కాసేపు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత సర్దుకుని వారికి సమాధానం ఇచ్చారు. సభ్యులు పెద్దమనసుతో వ్యవహరించాలని కోరారు. జడ్జిల జీతాలకు, ఎంపీల జీతాలకు లింక్ పెట్టవద్దని వేడుకున్నారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ జీతం రూ.2,80,000, సుప్రీంకోర్టు జడ్జిలు, హైకోర్టు చీఫ్ జస్టిస్ లకు రూ. 2,50,000 రెండున్నర లక్షలకు, హైకోర్టు జడ్జిలకు రూ.2,25,000కు పెంచే బిల్లు పై ఇప్పుడు చర్చలు జరుగుతున్నాయి. 
ఎంపీల జీతాల పై ఒకటే చర్చ…
సమాజ్ వాదీ పార్టీ నేత నరేష్ అగర్వాల్ ఎంపీల జీతాల పై తొలిగా మాట్లాడిన సంగతి తెలిసిందే. పార్టీల కతీతంగా ఎంపీలంతా ఆయనకు మద్దతు పలికారు. మాజీ ఎంపీ, ప్రస్తుత యూపి సి.ఎం యోగీ ఆదిత్య నాథ్ సారథ్యంలో కమిటీ జీతాల పెంపును సూచిస్తూ ఒక నివేదిక తయారు చేసింది.
                      ఎంపీలకన్నా తమ సెక్రటరీల జీతం ఎక్కువగా ఉందని చెబుతున్నారు వాళ్లు. అందుకే తమ సెక్రటరీలకన్నా కనీసం వెయ్యి రూపాయలైనా జీతం ఎక్కువగా ఉండాలని కోరుతున్నారు. ఎంపీల జీతం మీడియా ప్రతినిధుల జీతం కన్నా తక్కువే ఉందని నరేష్ అగర్వాల్ కామెంట్ చేశారు. ఈ డిమాండ్ ను కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే గతంలోనే సమర్ధించారు. అందరి జీతాల్లాగా ఎంపీల జీతాలు పెరగాలని కోరారు. ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ ఛైర్మన్ వెంకయ్య నాయుడు దీని పై సీరియస్ గానే చర్యలు తీసుకుంటున్నారు. 
                            పార్లమెంటు నియోజక వర్గం నిధులను రెట్టింపు చేయాలని, ఎంపీల పెన్షన్లను కూడా 75 శాతం పెంచాలనీ వారు కోరారు. ఎంపీల జీతాలు చివరి సారిగా 2010లో పెరిగాయి. అప్పట్లో 16 వేలుగా ఉన్న ఎంపీ జీతాన్ని 50 వేలకు పెంచారు. ఇప్పుడు దీన్ని రెట్టింపు చేయాలని డిమాండ్ పెరుగుతోంది. ఎంపీల జీతం పెంచాలంటే పార్లమెంటు ప్రతినిధుల చట్టం 1954 కు సవరణలు చేయాలి. తమ జీతాల పెంపు విషయంలో మాత్రం అంతా ఐక్యత ప్రదర్శిస్తున్నారు. పార్టీల కతీతంగా ఒక్కటయ్యారు. అంతా అలా కోరితే ఉప రాష్ట్రపతి మాత్రం ఏం చేస్తారు. చేస్తామని చెప్పారు. ప్రజా సమస్యల పై మాట్లాడదామంటే ఏకతాటి పైకి రారు. కానీ జీతాల విషయంలో అందరికీ ఒకటే దారి అంటున్నారు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*