నియోజకవర్గాల పెంపు బిల్లును అడ్డుకునే వ్యూహంలో కాంగ్రెస్

       తెలుగురాష్ట్రాల సి.ఎంలు చంద్రబాబు, కేసీఆర్ లు నియోజకవర్గాల పెంపు పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు నియోజకవర్గాల సంఖ్య పెరిగితేనే తమ పార్టీలో చేరి వారికి సీట్లు ఇస్తామనేది వారి ఆలోచన. అందుకే ప్రధాని మోడీని కలిసినప్పుడు ఇదే విషయాన్ని వారు ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. ఒక వేళ కేంద్ర ప్రభుత్వం కనుక ఎపి, తెలంగాణలలో నియోజకవర్గాల పునర్విభజన బిల్లును తీసుకు వస్తే కాంగ్రెస్ పార్టీ అడ్డుకునే ఆలోచన చేస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ నేతలు గట్టిగా ఇదే విషయాన్ని తమ హైకమాండ్ కు తెలిపినట్లు తెలుస్తోంది. కాంగ్రెస్ ఇన్ చార్జీ కుంతియాతో పార్టీ నేతలు భేటీ అయినప్పుడు ఈ అంశం పై చర్చ జరిగింది. నియోజకవర్గాల పెంపుకు బిజెపి సానుకూలంగా లేదని కొందరు నేతలు చెబుతున్నారు. పునర్విభజన జరిగితే తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరిగే అవకాశాలే ఉన్నాయనేది వారి అభిప్రాయంగా ఉంది. 
         పునర్విభజన ఆశలు చూపి తెలుగు రాష్ట్రాల్లోని పార్టీల నుంచి ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను అధికార పార్టీలు చేర్చుకున్నాయి. అందుకే దీన్ని దెబ్బకొట్టడానికి పునర్విభజన బిల్లును రాజ్యసభలో అడ్డుకోవాలని నేతలు పార్టీ అదిష్టానానికి తెలిపారు. విభజన బిల్లు యుపిఎ నే తెచ్చింది కాబట్టి హైకమాండ్ ఏం చేస్తుందోనన్న ఉత్కంఠ నెలకుంది. 
కీలక నేతలు టచ్ లో ఉన్నారట
        మరోవైపు టీఆర్ఎస్ పార్టీలో కీలక నేతలు తమతో టచ్ లో ఉన్నారని తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఉత్తం కుమార్ రెడ్డి చెబుతున్న మాట.  టిఆర్ఎస్ కు చెందిన ఒక ముఖ్య నేత త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతున్నారని ఆయన అంటున్నారు. కానీ ఆయన ఎప్పుడు చేరిది స్పష్టతనివ్వలేదు. సంక్రాంతి తర్వాత భారీ చేరికలు ఉంటాయని ఆయన చెబుతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా విజయం తమదేనని ఆయన అన్నారు. డెబ్బై సీట్లు వస్తాయని ధీమాగా చెబుతోంది కాంగ్రెస్. దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ స్వీప్ చేయబోతోందని ఉత్తమ్ చెబుతున్న మాట. ఈనెలలో ఏఐసిసి అధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటన ఉండేలా ప్లాన్ చేస్తున్నారు వాళ్లు. ఇప్పటికే చాలా సార్లు వాయిదా పడిన రాహుల్ పర్యటన ఈ సారి ఎక్కడ ఏర్పాటు చేస్తారనేది ఇంకా ప్రకటించలేదు. 

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*