‘2.ఓ’ మూవీ రివ్యూ

బ్యాన‌ర్: లైకా ప్రొడ‌క్ష‌న్స్
నటీనటులు: ర‌జ‌నీకాంత్‌, అక్ష‌య్‌కుమార్‌, ఎమీజాక్స‌న్‌, సుధాంశు పాండే, అదిల్ హుస్సేన్‌, రియాజ్ ఖాన్ త‌దిత‌రులు
మ్యూజిక్: ఎ.ఆర్‌.రెహమాన్‌
ఎడిటింగ్‌: ఆంథోని
ఆర్ట్‌: ముత్తురాజ్‌
సినిమాటోగ్రఫీ: నిర‌వ్‌షా
నిర్మాత‌: సుభాస్క‌ర‌న్‌
ర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం: ఎస్‌.శంక‌ర్‌

2010లో శంకర్-రజినీకాంత్ కాంబినేషన్‌లో వచ్చిన విజువల్ వండర్ ‘రోబో’. ఇప్పుడు దానికి కొనసాగింపుగా వచ్చినదే ‘2.ఓ’. ఒకవైపు సంచలన దర్శకుడు.. మరోవైపు సూపర్ స్టార్ రజినీ.. వీరిద్దరి కాంబినేషన్ అంటేనే ఎన్నో అంచనాలు ఉంటాయి. అందునా దాదాపు నాలుగేళ్ల పాటు కష్టపడి, ఐదు వందల కోట్ల రూపాయల పైచిలుకు బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కింది. దీనికి తోడు బాలీవుడ్ సూపర్ స్టార్ అక్షయ్ కుమార్ నెగెటివ్ రోల్ చేయడం దీనిపై మరింత ఆసక్తిని పెంచింది. ఇండియన్ సినీ చరిత్రలోనే భారీ బడ్జెట్ చిత్రాల్లో ఒకటిగా తెరకెక్కిన ‘2.ఓ’ విడుదలకు ముందే ఎన్నో రికార్డులు బద్దలు కొట్టింది. అలాగే సినిమా టీజర్, ట్రైలర్ కూడా ప్రేక్షకులను మెస్మరైజ్ చేయడంతో దీనిపై అంచనాలు భారీగా పెరిగిపోయాయి. గతంలో వచ్చిన రోబో ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే. ఇప్పుడు దానికి సీక్వెల్‌గా రూపొందిన ఈ సినిమా కూడా అంతటి విజయాన్నే అందుకుందా..? ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన రోబో రికార్డులను ఈ సినిమా బద్దలు కొట్టిందా..?

కథ
చెన్నై నగరంలో ఉన్నట్లుండి సెల్‌ఫోన్లన్నీ గాల్లోకి ఎగిరిపోతుంటాయి. ఇది దేశ వ్యాప్తంగా పెను సంచలనం అవుతుంది. అప్పుడు దీనిపై పరిశోధనలు చేయడానికి శాస్త్రవేత్త వశీకర్(రజినీకాంత్) సహాయం కోరుతుంది ప్రభుత్వం. తన హ్యుమనాయిడ్ లేడీ రోబోట్ వెన్నెల‌(ఎమీజాక్స‌న్‌)తో క‌లిసి దీని వెనుక ఏదో బలమైన శక్తి ఉండడం వల్లే ఇలా జరుగుతుందని వశీకర్ గ్రహిస్తాడు. సరిగ్గా అప్పుడే సెల్‌ఫోన్‌లతో పక్షి ఆకారంగా ఏర్పడిన ఓ జీవి నగరంలో విధ్వంసం సృష్టిస్తుంటుంది. వశీకర్‌పైనా దాడి చేస్తుంటుంది. అప్పుడు అతడు ‘చిట్టి’ని మళ్లీ యాక్టివేట్ చేయడానికి ప్రభుత్వ అనుమతి తీసుకుంటాడు. మరి వశీకర్ చిట్టిని యాక్టివేట్ చేశాడా..? అసలు సెల్‌ఫోన్లు ఎందుకు గాల్లోకి వెళ్తాయి..? దీని వెనకున్న పక్షిరాజు ఎవరు..? చిట్టి.. 2.ఓగా ఎలా మారాడు..? వంటివి తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

సినిమా ఎలా ఉందంటే
భారీ తారాగణంతో తెరకెక్కిన ‘2.ఓ’ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అద్భుతమైన విజువల్ వండర్స్‌తో హాలీవుడ్ సినిమాను తలపించేలా సినిమా సాగుతుంది. దర్శకుడు శంకర్ ఈ విషయంలో సక్సెస్ అయ్యాడు కానీ, కథనం మీద శ్రద్ధ చూపలేదనిపిస్తుంది. సినిమాలో కొన్ని సన్నివేశాలు స్పీడ్‌ బ్రేకర్‌లా అనిపిస్తాయి. దీనికి తోడు ‘రోబో’ తరహా కామెడీ, అలాగే హీరోహీరోయిన్ల మధ్య రొమాన్స్‌ను కోరుకునే ప్రేక్షకులు డిస్సాపాయింట్‌మెంట్‌కు గురవుతారు. అయితే, రజినీ, అక్షయ్ కుమార్ నటన, గ్రాఫిక్స్, యాక్షన్ సీన్స్ ఆ లోటు పూడ్చేలానే ఉంటాయి. మొత్తంగా శంకర్-రజినీ ప్రేక్షకులను మరో లోకంలోకి తీసుకువెళ్తారు. ఇన్నాళ్లు ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినీ అభిమానులకు శంకర్ గుర్తుపెట్టుకునే మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. ముఖ్యంగా సెల్‌ఫోన్స్ వల్ల జరిగే అనర్థాల గురించిన సోషల్ మెసేజ్ సినిమాకు మంచి ముగింపునిస్తుంది.

నటీనటుల పనితీరు
ఈ సినిమాలో రజినీకాంత్ తన గత సినిమాల కంటే అద్భుతమైన నటనను కనబరిచారు. వశీకర్, చిట్టి, 2.ఓ ఇలా మూడు పాత్రల్లో నటించి, వాటికి వేరియేషన్స్ చూపించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. కొన్ని సన్నివేశాల్లోనైతే తన నటనతో సినిమాకు ప్రాణం పోశారు. ఇక ఈ సినిమాకు మరో హైలైట్ అంటే అక్షయ్‌కుమార్ అనే చెప్పాలి. ఆయన తన క్రూరమైన నటనతో సినిమాను మరో లెవెల్‌కు తీసుకెళ్లారు. సినిమాకు ఎంత కావాలో అంతే పరిధిలో నటించి ఆకట్టుకున్నారు. హ్యుమనాయిడ్ లేడీ రోబోట్ వెన్నెల‌లా కనిపించిన ఎమీజాక్సన్‌ పాత్ర పరిధి తక్కువే అయినా.. చేసినంతలో న్యాయం చేసింది. మిగిలిన నటులు తమ పాత్రల పరిధి మేర నటించారు.

టెక్నీషియన్ల పనితీరు
సంచలన సినిమాలు తీసే దర్శకుల్లో ఒకరైన శంకర్.. ఈ సినిమాను తెరకెక్కించి విధానం ఆకట్టుకుంటుంది. భారీ విజువల్స్‌తో భారీ చిత్రాన్ని తెరకెక్కించి గుర్తుపెట్టుకునే మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. సినిమా చూస్తున్నంతసేపూ ఓ హాలీవుడ్ సినిమా చూస్తున్న ఫీల్ తెవడంలో ఆయన సక్సెస్ అయ్యారు. అయితే, కథ, కథనం మరింత దృష్టి పెట్టుంటే బాగుండేది. ఇక, ఈ సినిమాకు మరో హైలైట్ అంటే ఏఅర్ రెహమాన్ అందించిన సంగీతమే. ఆయన అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఉన్న విజువల్స్‌ను ఇంకా ఎలివేట్ చేస్తూ బాగా ఆకట్టుకుంటుంది. నిరవ్ షా సినిమాటోగ్రఫీ సినిమాకు మరింత వన్నె తెచ్చింది. సినిమాలోని ప్రతి సన్నివేశాన్ని ఎంతో రిచ్‌గా చూపించారు. ఇక ఆంటోని ఎడిటింగ్ కూడా బాగుంది. కానీ, మధ్య మధ్యలో బోరింగ్‌గా అనిపించే సీన్స్‌ను తీసేసుంటే బాగుండేది అనిపిస్తుంది. ఈ సినిమా నిర్మాత గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. సుభాష్ శరన్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.

బలాలు
* రజినీ, అక్షయ్ నటన
* దర్శకత్వం
* విజువల్స్
* యాక్షన్ సీన్స్
* బ్యాగ్రౌండ్ స్కోర్

బలహీనతలు
* కథనం
* కామెడీ లేకపోవడం
* మధ్యలో కొన్ని బోరింగ్ సీన్స్

మొత్తంగా: ‘చిట్టి’ని మించిన ‘2.ఓ’

రేటింగ్: 3.5/5

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.