తండ్రీ కొడుకులు నోరెందుకు జారుతున్న‌ట్లు!

మాట‌ల మాంత్రికుడు.. స‌మ‌యం.. సంద‌ర్భం ఏదైనా.. అల‌వోక‌గా మాట్లాడ‌గ‌లనేత‌. విజ్ఞ‌త గ‌ల నాయ‌కుడు. ఉర్దూ.. తెలుగు.. ఇంగ్లిషు.. అన‌ర్గ‌ళంగా సంభాషించ‌గ‌ల తెలంగాణ సీఎం కె.చంద్ర‌శేఖ‌ర్‌రావు నోరు జారుతున్నారు. నువ్వు.. వాడు. వీడు.. అనే ప‌దాలు తెలంగాణ‌లో వాడుక భాష నిజ‌మే. ఏక‌వ‌చ‌న సంబోధ‌న‌తో అవ‌త‌లి వ్య‌క్తులతో వున్న సాన్నిహిత్యానికి గుర్తు అనేది నిజ‌మే. కానీ.. ముఖ్య‌మంత్రి స్థానంలో ఉండి.. సాక్షాత్తూ.. ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీను ఉద్దేశించి ఏక‌వ‌చ‌న సంబోధ‌న బీజేపీకు కోపం తెప్పించింది. దీనిపై సాక్షాత్తూ.. ర‌క్ష‌ణ మంత్రి  నిర్మ‌లా సీతారామ‌న్ ఘాటుగానే స్పందించారు. సీఎం స్థానంలో వున్న వ్య‌క్తి పీఎం ను అలా సంబోధించ‌టం చాలా బాధేసింద‌న్నారు. పుర‌పాల‌క మంత్రి కేటీఆర్‌ను పిలిచి.. త‌ప్పును స‌రిదిద్దుకోమ‌ని చెప్పిన‌ట్లు ఆమె స్ప‌ష్టంచేశారు. దీనిపై కేటీఆర్ కూడా.. అది వ్య‌క్తిగ‌త‌మైన క‌క్షేమీ కాద‌ని.. కేవ‌లం ప్ర‌సంగంలో దొర్లిన పొర‌పాటుగా వివ‌ర‌ణ కూడా  ఇచ్చార‌ట‌. తండ్రి.. కేంద్రంపై నోరుజారితే.. పుత్రుడు కేటీఆర్  ప్ర‌తిప‌క్ష నేత జానారెడ్డిని జానా బాబా 40 దొంగ‌లు అన్న‌ట్లుగా కామెంట్ చేయ‌టం.. పైగా.. ఫ్లోరైడ్ గురించి హ‌స్తం పార్టీ  ప‌ట్టించుకోలేదంటూ చేసిన వ్యాఖ్య‌ల‌పై జానారెడ్డి స్పందించారు. కేటీఆర్ పుట్ట‌క‌మేందే తాను.. ఫ్లోరైడ్ గురించి యుద్ధ‌మే చేశామ‌ని గుర్తు చేశారు. నాలుగేళ్ల‌పాటు ఎంతో సంయ‌మ‌నం వ‌హిస్తూ వ‌చ్చిన టీఆర్ ఎస్ కీల‌క నేత‌లిద్ద‌రూ.. ఎందుకు ఓపిక కోల్పోతున్నారు. దీని వెనుక అస‌లేం జ‌రుగుతోంద‌నేది ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారింది. వ‌య‌సు.. ప‌ద‌వి.. హోదాను మ‌రచి.. గ‌ల్లీ నేత‌ల్లా  గులాబీ నేత‌లు మాట్లాడే తీరుపై విప‌క్షాలు మండిప‌డుతున్నాయి. దాదాపు ప‌దేళ్ల‌పాటు అధికారం త‌మ‌దే అన్నంత ధీమాగా వున్న గులాబీద‌ళంలో త‌లెత్తిన విబేధాలు.. క్ర‌మేణా పెరిగిపోతున్న ప్ర‌భుత్వ వ్య‌తిరేక‌త వ‌ల్ల‌నే సంయ‌మ‌నం కోల్పోతున్నార‌నే విమ‌ర్శ‌లు పెల్లుబుకుతున్నాయి.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.