కనిపించని కన్నబాబు… కలవరంలో వైఎస్సాఆర్‌సీపీ

మాజీ ఎమ్మెల్యే, వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ యలమంచిలి అసెంబ్లీ సమన్వయకర్త, యువివి కన్నబాబురాజు ఆయన తనయుడు, డిసిసిబి చైర్మన్ సుకుమార వర్మ గడచిన పది రోజులుగా పార్టీ వర్గీయులకు అందుబాటులో లేకపోవడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. కన్నబాబురాజు తన కుటుంబ సభ్యులతో కలిసి విదేశాలకు వెళ్లిపోయారని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నుండి యలమంచిలి అసెంబ్లీకి వరుసగా రెండు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన కన్నబాబురాజు గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో చేరడంతో పాటు ఆ పార్టీ విజయానికి కృషిచేశారు. యలమంచిలి, పాయకరావుపేట అసెంబ్లీలో టీడీపీ విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించారు. ముందస్తుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తాను చేసిన కృషికి ప్రతిఫలంగా తెలుగుదేశం పార్టీ నుండి ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కుతుందని ఆయన కొండంత ఆశలు పెట్టుకున్నారు. ఎమ్మెల్సీ టిక్కెట్ దక్కకపోగా రానున్న ఎన్నికల్లో యలమంచిలి అసెంబ్లీ టిక్కెట్ అయినా దక్కుతుందని భావించారు. అయితే దీనికి పార్టీ అధినేత చంద్రబాబుతోపాటు ఆ పార్టీ ముఖ్యనేతల నుండి సానుకూల స్పందన రాకపోవడంతో రెండునెలల క్రితమే ఆయన హడావుడిగా వైఎస్సాఆర్సీపీలో చేరిపోయారు. కన్నబాబురాజు పార్టీలో చేరిందే తడవుగా యలమంచిలి అసెంబ్లీలో వైసీపీ విజయానికి ఢోకాలేదనే సంకేతాలు వచ్చాయి. రానున్న ఎన్నికల్లో యలమంచిలి అసెంబ్లీ టిక్కెట్ కన్నబాబుకు ఖరారైనట్లేననే సంకేతాన్ని పార్టీశ్రేణులకు జగన్ స్పష్టంగానే చేరవేశారు.
ఈ నేపధ్యంలో వైఎస్సాఆర్ పార్టీలోకి తటస్థులను తీసుకురావడంలో కన్నబాబురాజు తన ప్రయత్నాలను తీవ్రతరం చేశారు. వైఎస్ జగన్ పాదయాత్ర ఇక్కడకు చేరుతున్న సందర్భంలో జిల్లా వ్యాప్తంగా జగన్ పాదయాత్రను దిగ్విజయం చేయడంలో కన్నబాబురాజు ప్రధాన పాత్ర వహిస్తారని అంతా భావించారు. యలమంచిలి, పాయకరావుపేట, అనకాపల్లి, మాడుగుల, చోడవరం, పెందుర్తి తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో సైతం తటస్థులను, తెలుగుదేశం పార్టీలో ఉన్నవారిని వైసీపీ గూటిలోకి తీసుకువచ్చేందుకు కన్నబాబు గోప్యంగా ప్రయత్నాలు సాగించారని తెలుస్తోంది. దీంతో జిల్లాలో జరిగే వైఎస్ జగన్ పాదయాత్రతో పార్టీమరింత బలాన్ని కూడగట్టుకుంటుందని ఆ పార్టీశ్రేణులు ఆశించారట. అయితే ఇటువంటి కీలక పరిస్థితుల్లో కన్నబాబురాజు ఆయన తనయుడు సుకుమార వర్మ ఎవరికీ అందుబాటులో లేకుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోవడం తీవ్ర దుమారం రేపుతోంది. మరోవైపు గతంలో ఆయనపై నమోదైన కేసులను తిరగతోడి, ఆయనను అరెస్టు చేసేందుకు టీడీపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తున్నదనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ భయంతోనే ముందు జాగ్రత్తగా కన్నబాబురాజు, ఆయన తనయుడు సుకుమార వర్మ అజ్ఞాతంలోకి వెళ్లిపోయారనే ప్రచారం వినిపిస్తోంది. కాగా జగన్ పాదయాత్ర  పర్యవేక్షణకు కన్నబాబురాజు పార్టీకి అందుబాటులో లేకపోవడంతో, ఆ బాధ్యతను మాజీ ఎమ్మెల్సీ సూర్యనారాయణ రాజుకు అప్పగించారని తెలుస్తోంది. అయితే జగన్ పాదయాత్రకు ఇన్‌చార్జిగా సూర్యనారాయణ రాజును నియమించడం చర్చనీయాంశంగా నిలిచింది.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.