ఏపీలో ఎన్ని కుల స‌మ‌ర‌మే!

ఏపీ రాజ‌కీయాలు కులం చుట్టూ తిరుగుతున్నాయి. రేప‌టిరోజున ఏ పార్టీ గెల‌వాల‌న్నా.. ఓడాల‌న్నా.. కుల ప్రాతిప‌దిక‌న సాధించే ఓట్లు కీల‌కం కానున్నాయి. అది కాపు, క‌మ్మ‌, రెడ్డి, బీసీ, ఎస్సీ, ఎస్టీలు.. ఎవ‌రైనా కావ‌చ్చు. ఎవ‌రికి వారు య‌మునాతీరే అన్న‌ట్లుగా ఇప్ప‌టికే కుల‌బీజం.. మ‌హావృక్షంగా మారింది. దీనిప్ర‌భావం బ‌య‌ట‌కు క‌నిపించ‌క‌పోయినా.. సోష‌ల్ మీడియాలో యుద్ధ‌వాతావ‌ర‌ణాన్ని త‌ల‌పిస్తున్నాయి. కులాల‌ను బ‌ట్టి నేత‌ల‌ను ఎంచుకుని రెచ్చ‌గొట్టే విధంగా పోస్టులు చేస్తున్నారు. వాటిపై కామెంట్స్ చూస్తే.. కుల‌పిచ్చి ఇంత‌గా పెరిగిందా అనే వేద‌న కూడా క‌లుగుతుంది. సామాన్యుల‌కు ఎలా వున్నా.. ఇది రాజ‌కీయ పార్టీలు మాత్రం వ‌ణ‌కుపుట్టిస్తుంది. 1980 ద‌శ‌కంలో  తెలుగుదేశం పార్టీ స్థాప‌న‌తో అప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం రెడ్డి వ‌ర్గానికే ప‌రిమిత‌మైన అధికారం క‌మ్మ సామాజిక‌వ‌ర్గం అందుకోగ‌లిగింది. దానితో పాటే.. అప్ప‌టి వ‌ర‌కూ కేవ‌లం జెండా మోసేందుకే ప‌రిమిత‌మైన బీసీ, ఎస్సీ వ‌ర్గాల‌కూ చ‌ట్ట‌స‌భ‌ల్లో కూర్చునే చోటే కాదు.. అధికారం కూడా ద‌క్కింది. దీని ఫ‌లిత‌మే.. ఇప్ప‌టికీ టీడీపీ కు  కిందిస్థాయి వ‌ర‌కూ బ‌ల‌మైన పునాదున్నాయంటే కార‌ణ‌మిదే.  ఆ త‌రువాత ఎన్‌టీఆర్ మ‌ర‌ణం.. క్ర‌మంగా టీడీపీ కొంత బ‌ల‌హీన‌మ‌వ‌టం కాంగ్రెస్ కు క‌ల‌సివ‌చ్చాయి. ఫ‌లితంగా 2004లో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి పాద‌యాత్ర‌.. చంద్ర‌బాబు ముంద‌స్తు ఎన్నిక‌ల‌కు వెళ్ల‌టం వంటి వాటితో అధికారం హ‌స్తం వ‌శ‌మైంది. 2009లో సినీ హీరో చిరంజీవి ప్ర‌జారాజ్యం పార్టీ ఏర్పాటుతో కొత్త ఎన్నిక‌ల స‌మీక‌ర‌ణ‌ల‌కు తెర‌లేపాడు. అప్ప‌టి వ‌ర‌కూ కాపు సామాజిక‌వ‌ర్గం  ఏదో ఒక పార్టీతో ఉంటూ వ‌చ్చింది. చిరు రాక‌తో త‌మ నేత‌గా భావించిన కాపులు చాలావ‌ర‌కూ అటువైపు మొగ్గుచూపారు. ఫ‌లితంగా టీడీపీ ఓట్లు చీలాయి. మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీ గెల‌వ‌టం.. వైఎస్ సీఎం కావ‌టం జ‌రిగాయి.

 

అనంత‌రం కొద్దిరోజుల‌కే వైఎస్ హెలికాప్ట‌ర్ ప్ర‌మాదంలో మ‌ర‌ణించాడు. దీంతో ఆయ‌న త‌న‌యుడు జ‌గ‌న్ సీఎం సీటు కూడా ప్ర‌య‌త్నించి భంగ‌ప‌డ్డాడు.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పెట్టి.. కాంగ్రెస్ ఎమ్మెల్యేల‌ను చీల్చాడు. ఇది రెడ్డి సామాజిక‌వ‌ర్గానికి.. వైసీపీ త‌మ‌ద‌నే ఆలోచ‌న‌కు బీజం వేసిన‌ట్లుగానే భావిస్తున్నారు. 2014 ఎన్నిక‌ల్లో కాపుల ఓట్ల కోసం.. చంద్ర‌బాబు ప‌వ‌న్‌తో జ‌త‌క‌ట్టారు. బీజేపీ మిత్ర‌ప‌క్షంగా ఉండ‌టంతో ప‌వ‌న్ కూడా చంద్ర‌బాబు వంటి సీనియ‌ర్ రాష్ట్ర విభ‌జ‌న త‌రువాత ఏపీకు కావాల‌ని భావించి మ‌ద్ద‌తు ప‌లికారు. ఫ‌లితంగా.. చంద్ర‌బాబు సీఎం అయ్యారంటూ.. ఆ పార్టీ నేత‌లే చెప్పారు. ఇప్పుడు.. త‌మ పార్టీ వ‌ల్ల‌నే గెలిచామంటూ.. ప‌వ‌న్ కేవ‌లం నామ‌మాత్ర‌మే నంటూ చెబుతుండ‌టం కొస‌మెరుపు. ఇప్పుడు జ‌న‌సేన‌ను కాపులు త‌మ పార్టీగా భావిస్తున్నారు. క‌మ్మ‌వ‌ర్గం.. టీడీపీ, వైసీపీ రెడ్లు త‌మ పార్టీలంటూస్వ‌యంగా ప్ర‌క‌టించుకుంటున్నారు. నేత‌ల సంగ‌తి ఎలా వున్నా గ్రామాల్లో మాత్రం కులాల వారీగానే ఓట్లు ప‌డ‌తాయ‌నేది జ‌గ‌మెరిగిన స‌త్యం. ప‌దిహేనేళ్ల‌ వ్య‌వ‌ధిలో చోట‌చేసుకున్న  రాజ‌కీయ ప‌రిణామాల‌తో ముఖ్య‌మైన కాపు, క‌మ్మ‌, రెడ్డి సామాజిక‌వ‌ర్గాలు మూడు పార్టీలుగా మారాయి. వెనుక‌బ‌డిన వ‌ర్గాలు, ఎస్సీలు ఏ పార్టీకు మ‌ద్ద‌తు ప‌లుకుతార‌నే అంశంపై ఇప్ప‌టికీ స్ప‌ష్ట‌త లేదు. మైనార్టీలు కూడా బాబు త‌న‌వెంట న‌డుస్తార‌నుకుంటున్నా కాంగ్రెస్ వైపు మ‌ళ్లే అవ‌కాశాలే ఎక్కువ‌. కాపులు కూడా.. పాత‌త‌రం టీడీపీ, కాంగ్రెస్‌ల‌కు ఓట్లేసినా.. ఈ త‌రం మాత్రం.. జ‌న‌సేన వైపు న‌డుస్తామంటూ తెగేసి చెబుతున్నాయి. వైసీపీ వైపు కూడా యువ‌తే అధికంగా మొగ్గుచూపుతుంది. భిన్న వాతావ‌ర‌ణం.. విభిన్న‌మైన కుల స‌మీక‌ర‌ణ‌ల‌తో ఏ పార్టీ నెగ్గినా.. గొప్ప పార్టీగా నెత్తిన పెట్టుకోవ‌చ్చు.

Be the first to comment

Leave a Reply

Your email address will not be published.


*


This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.